RBI Rate Hike: ‘వడ్డీరేట్లు పెంచడంలో ఆర్‌బీఐ ఆలస్యం చేయలేదు’

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకుగానూ వడ్డీరేట్లను పెంచడంలో ఆర్‌బీఐ ఏమాత్రం ఆలస్యం చేయలేదని ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) సభ్యురాలు ఆశిమా గోయల్‌ తెలిపారు....

Published : 15 May 2022 14:54 IST

ఎంపీసీ సభ్యురాలు ఆశిమా గోయల్‌

దిల్లీ: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకుగానూ వడ్డీరేట్లను పెంచడంలో ఆర్‌బీఐ ఏమాత్రం ఆలస్యం చేయలేదని ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) సభ్యురాలు ఆశిమా గోయల్‌ తెలిపారు. కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థలో వచ్చే కుదుపులకు అతిగా స్పందించడం కూడా అంతమంచిది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పెరిగిన ఆహార, చమురు ధరల పెరుగుదలతో భారత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. దీనివల్లే ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత పరిధిని దాటిందని పేర్కొన్నారు. కానీ, దేశంలో గిరాకీ, వేతనాలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజాన్ని దృష్టిలో ఉంచుకునే రేట్ల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. లేదంటే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతూకం దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ఎంపీసీ పరిగణనలోకి తీసుకునే ద్రవ్యోల్బణ అంచనాలు ప్రస్తుతానికి ఆర్‌బీఐ లక్షిత పరిధిలోనే ఉన్నాయని గోయల్‌ తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదని పేర్కొన్నారు. పైగా కరోనా మరోసారి విజృంభించే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపారు. ఈ తరుణంలో వడ్డీరేట్ల పెంపు విషయంలో అతిగా స్పందించడం కూడా అంతమంచిది కాదని వివరించారు.

ఇటీవల అత్యవసరంగా భేటీ అయిన ఆర్‌బీఐ రెపోరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరి 7.79 శాతంగా నమోదైంది. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని