RBI Annual Report: ఆర్‌బీఐ నుంచి మరో పేమెంట్‌ సిస్టమ్‌!

RBI plans new payment system: ఆర్‌బీఐ మరో కొత్త చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అనుకోని విపత్తుల సమయంలో చెల్లింపులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చూస్తోంది.

Published : 30 May 2023 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ద్వారా డిజిటల్‌ చెల్లింలపుల వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆర్‌బీఐ.. మరో చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. లైట్‌ వెయిట్‌ పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ (LPSS) సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. అయితే, ఇది రెగ్యులర్‌ పేమెంట్స్‌ విధానం కాదు. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు వంటి అనుకోని పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ చెల్లింపుల వ్యవస్థ ఉపయోగపడుతుందన్నది ఆర్‌బీఐ ఆలోచనగా ఉంది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని పొందుపరిచింది. కొత్త చెల్లింపుల వ్యవస్థ అవసరాన్ని అందులో ప్రస్తావించింది.
Also Read: చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.500 నోట్లే అధికం! (RBI Annual Report)

ప్రస్తుతం UPI, RTGS, NEFT వంటి చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. పెద్ద మొత్తంలో నగదును సులువుగా పంపేందుకు ఇవి ఉపయోగపడతాయి. అయితే, వీటికి నెట్‌వర్క్‌, ఐటీ మౌలిక సదుపాయాలు అవసరం. అనుకోకుండా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం వంటి పరిణామాల సమయంలో కమ్యూనికేషన్‌ వ్యవస్థపై ప్రభావం పడే సందర్భంలో  ఈ చెల్లింపుల వ్యవస్థలపై ప్రభావం పడుతుంది.

ఇలాంటి అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో సరికొత్త పేమెంట్స్‌ వ్యవస్థ అక్కరకొస్తుందన్నది ఆర్‌బీఐ ఆలోచన. పరిమిత సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అవసరంతో ఈ పేమెంట్‌ వ్యవస్థను రూపొందించాలని ఆర్‌బీఐ ఆలోచన చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ, మార్కెట్‌ సంబంధిత లావాదేవీల్లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు ఈ చెల్లింపుల వ్యవస్థ ఉపయోగుపడుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. అవసరాన్ని బట్టి ఈ చెల్లింపుల వ్యవస్థను అప్పటికప్పుడు యాక్టివ్‌ చేసుకోవడానికి దీన్ని రూపొందించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

నోట్లకు నకిలీల బెడద

నకిలీ నోట్లను అడ్డుకొనేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎన్ని చర్యలు చేపడుతున్నా వీటి చలామణీ నిరాటంకంగా కొనసాగుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన నకిలీ నోట్ల వివరాలను ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అన్ని నోట్ల కంటే రూ.500 నోట్లలోనే ఎక్కువ నకిలీలు చలామణీలో ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. మొత్తం 91,110 నోట్లను తాము గుర్తించినట్లు పేర్కొంది. అలాగే, 78,699 రూ.100 నోట్లు, 27,258 రూ.200 నోట్లు, 9,806 రూ.2వేల నోట్లను గుర్తించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని