ఫెడ్‌తో పాటే రేట్ల పెంపు వద్దు.. ఆర్‌బీఐకి SBI సలహాదారు సూచన

SBI on Rate Hike: వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆర్‌బీఐకి ఎస్‌బీఐ గ్రూప్‌ సలహాదారు ఒకరు సూచించారు. ఫెడ్‌తో పాటే పెంపు నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు.

Published : 11 Mar 2023 20:04 IST

కోల్‌కతా: ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ గత కొన్ని నెలలుగా వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. భారత్‌, అమెరికా, బ్రిటన్‌ సహా అన్ని బ్యాంకులూ ఇదే పంథాను అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ (US Fed) రేట్ల పెంపునకు అనుగుణంగా భారత్‌లోనూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతోంది. ఈ విషయంలో ఆర్‌బీఐ ఆలోచించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ (SBI Group) ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ సూచించారు. కోల్‌కతాలో భారత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన రేట్ల పెంపు గురించి మాట్లాడారు.

రేట్ల పెంపు వియంలో ఇప్పుడప్పుడే ఫెడ్‌ తన పంథాను మార్చుకునే సూచనలు కనిపించడం లేదని ఘోష్‌ అన్నారు. కాబట్టి ఫెడ్‌ నిర్ణయానికి అనుగుణంగా వెళ్లాలన్న నిర్ణయానికి ఆర్‌బీఐ స్వస్తి చెప్పాలన్నారు. ఇప్పటికే ఆర్‌బీ చేపట్టిన రేట్ల పెంపు వల్ల వ్యవస్థలో ప్రభావాన్ని అంచనా వేయాలని సూచించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ కనీస మరో మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లే రేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. 2008లోనూ ఇలానే కేంద్ర బ్యాంకులన్నీ మూకుమ్మడిగా వడ్డీ రేట్లను పెంచాయని, తగ్గింపు విషయంలో తమ దేశ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకున్నాయని గుర్తుచేశారు. కాబట్టి ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో కలిసి వెళ్లాలా, వద్దా అనేది ఆలోచించుకోవాలన్నారు.

ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. దాదాపు 250 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న ఆందోళనకర స్థాయికి ఎగువనే ఉండడంతో మరోసారి రేట్ల పెంపు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం గతేడాది మార్చి 1 నుంచి 4.5 శాతం మేర వడ్డీ రేట్లు పెంచింది. మున్ముందూ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో దేశీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఘోష్‌ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు