RBI rate hike: రుణ గ్రహీతలకు ఆర్‌బీఐ సడెన్‌ షాక్‌.. పెరగనున్న ఈఎంఐ భారం!

RBI rate hike: రుణ గ్రహీతలకు ఆర్‌బీఐ ‘సడెన్‌’ షాక్‌ ఇచ్చింది. ఇన్నాళ్లు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఆనందించిన వినియోగదారులకు ఇకపై ఈఎంఐ (EMI) భారం కానుంది.

Updated : 04 May 2022 17:30 IST

RBI rate hike burden for borrowers: రుణ గ్రహీతలకు ఆర్‌బీఐ ‘సడెన్‌’ షాక్‌ ఇచ్చింది. ఇన్నాళ్లు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఆనందించిన వినియోగదారులకు ఇకపై ఈఎంఐ (EMI) భారం కానుంది. కొత్తగా రుణాలు తీసుకోవాలనుకున్న వారికీ ఇది పెద్ద దెబ్బే. అయితే, ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (FD) చేయాలనుకునేవారికి మాత్రం ఊరట కలగనుంది. త్వరలో ఈ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అదుపు చేసే లక్ష్యంతో బుధవారం అత్యవసర భేటీ అయిన ఆర్‌బీఐ.. ఈ మేరకు అనూహ్య నిర్ణయం ప్రకటించింది. రెపో రేట్‌ను 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో 4.40 శాతానికి చేరింది. అలాగే క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (CRR)ను సైతం 50 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో 4.5 శాతానికి చేరింది. రెపో రేటు తక్షణమే అమల్లోకి రానుండగా.. సీఆర్‌ఆర్‌ మే 21 నుంచి వర్తించనుంది.

గృహ రుణ గ్రహీతలకు గట్టి దెబ్బే!

కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఉదాహరణకు: రవి ఏదైనా బ్యాంకు నుంచి 20 ఏళ్ల కాలానికి రూ.20 లక్షలు రుణం తీసుకున్నారనుకుందాం. ప్రస్తుత వడ్డీ రేటు 6.8 శాతం అనుకుంటే అతడు నెలకు ఈఎంఐ కింద రూ.15,267 చెల్లించాల్సి ఉంటుంది. రవిలానే కొత్తగా ఇల్లు కొందామని రాహుల్‌ కొత్తగా రుణం (వడ్డీ రేట్లు పెంచాక) తీసుకోవాలనుకుంటే.. ఇదే మొత్తం, ఇదే కాలానికి 7.2 శాతం వడ్డీ రేటు కింద రూ.15,747 ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రవి కంటే రాహుల్‌ అదనంగా నెలకు దాదాపు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నమాట.

ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా వడ్డీ కట్టే మొత్తం పెరుగుతుంది. కాబట్టి వడ్డీ భారం పడకుండా ఉండాలంటే ముందుగానే రుణాలు తీర్చడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలి. అదే ఆటో లోన్‌, పర్సనల్‌ లోన్‌ తీసుకుని.. ఫిక్స్‌డ్‌ రేట్‌ను ఎంచుకున్నట్లయితే మీపై ఈ వడ్డీ రేట్ల ప్రభావం ఉండబోదు. ఈఎంఐని యథావిధిగా కట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటే వెంటనే బ్యాంకులను లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. త్వరలోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వడ్డీ రేట్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌..

ఆర్‌బీఐ తీసుకున్న అనూహ్య నిర్ణయం ప్రభావంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకునే వారికి ఇకపై అధిక వడ్డీ లభించనుంది. ప్రస్తుతం ఎఫ్‌డీలపై అందిస్తున్న వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటోంది. దీంతో సురక్షిత పొదుపు పథకం అయినప్పటికీ తక్కువ వడ్డీ రేట్లు కారణంగా చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఆ మేరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. తొలి దశలో స్వల్పకాలిక, మధ్యకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని