2000 Note: రూ.2వేల నోట్లు వెనక్కి.. RBI కీలక నిర్ణయం

రూ.2వేల నోట్లపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Updated : 19 May 2023 20:21 IST

ముంబయి: రూ.2వేల నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో చలామణీలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. (RBI to withdraw Rs 2000 currency note) ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే, ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టంచేసింది.

రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఒక విడతలో గరిష్ఠంగా రూ.20వేల వరకు మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. డిపాజిట్‌ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందీ లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. 

ఆర్‌బీఐ ప్రకటన ఇదీ..

  • 2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు నేపథ్యంలో నగదు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.2వేల నోట్లను తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2018-19లోనే ఈ నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు తెలిపింది.
  • 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న నగదు మొత్తంలో రూ.2వేల నోట్ల వాటా 89 శాతంగా ఉంది. 2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఆ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. అంటే చలామణీలో ఉన్న మొత్తం నగదులో రూ.2వేల నోట్ల వాటా 10.8 శాతానికి చేరిందని ఆర్‌బీఐ తెలిపింది.
  • ‘క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా తాజాగా రూ.2వేల నోట్లను చలామణీని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే, రూ.2వేలు నోటు అనేది ప్రస్తుతం లావాదేవీలకు వినియోగించుకోవచ్చని (లీగల్‌ టెండర్‌) స్పష్టం చేసింది. 2013-14లోనూ ఇదే తరహాలో సర్క్యులేషన్‌లో ఉన్న నోట్లను వెనక్కి తీసుకున్నామని ఆర్‌బీఐ గుర్తుచేసింది. (అప్పట్లో 2005 కంటే ముందు జారీ చేసిన నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకుంది) 
  • రూ.2 వేల నోట్లను ప్రజలు బ్యాంకుల ద్వారా మార్పిడి చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఏదైనా బ్యాంక్‌ శాఖ నుంచి మే 23 నుంచి సెప్టెంబరు 30 లోగా రూ.2వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక విడతలో రూ.20వేల వరకు మార్చుకోవచ్చని పేర్కొంది. 
  • అన్ని బ్యాంకులూ రూ.2వేల నోట్ల జారీని నిలిపివేయాలని, ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని