హామీదారుగా ఉండ‌టానికి సిద్ధ‌ప‌డుతున్నారా? ఒక్కసారి ఇది చ‌ద‌వండి

సొంత ఇల్లు, కారు తదితర అవసరాల నిమిత్తం రుణాలు పొందడం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. అనివార్య ప‌రిస్తితుల‌ను ఎదుర్కొనేందుకు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులను హామీగా ఉంచమ‌ని రుణ‌గ్ర‌హీత‌ను కోరుతున్నాయి రుణాలును మంజూరు చేసే సంస్థ‌లు. సాధార‌ణంగా స్నేహితులు, బంధువులను

Published : 16 Dec 2020 15:25 IST

సొంత ఇల్లు, కారు తదితర అవసరాల నిమిత్తం రుణాలు పొందడం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. అనివార్య ప‌రిస్తితుల‌ను ఎదుర్కొనేందుకు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులను హామీగా ఉంచమ‌ని రుణ‌గ్ర‌హీత‌ను కోరుతున్నాయి రుణాలును మంజూరు చేసే సంస్థ‌లు. సాధార‌ణంగా స్నేహితులు, బంధువులను రుణ హామీదారులుగా ఉండవ‌ల‌సిందిగా రుణ గ్ర‌హీత‌లు కోరుతుంటారు. బాగా కావాల్సినవారు కావడంతో కాదనలేని ప‌రిస్థితి హామీదారుల‌ది. రుణ గ్రహీత అప్పు చెల్లించలేని పక్షంలో ఆ బాధ్యత హామీదారుదే అన్న సంగ‌తి గుర్తుంచుకోవాలి. హామీగా ఉండేవారి బాధ్యతలు, వారికి ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకుందాం.

కింది సందర్భాల్లో హామీని కోరతారు:
* రుణ గ్రహీత గత ఆర్థిక‌ చరిత్ర అనుమానించదగినదిగా ఉన్నప్పుడు
* రుణ గ్రహీత ఉద్యోగ రీత్యా ఒకచోట స్థిరంగా ఉండనప్పుడు లేదా తరచూ విదేశాలకు వెళ్లి వస్తూ ఉంటే
* విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లినప్పుడు
* చిన్న, మధ్య తరహా సంస్థలు రూ. పది లక్షల కన్నా ఎక్కువ రుణం స్వీకరించినప్పుడు
*రుణ గ్రహీత తనఖా పెట్టే ఆస్తి విలువ, స్వీకరించే రుణంలో భారీ వ్య‌త్యాసం ఉన్న‌ప్పుడు
హామీగా ఉండటానికి వీరిని అనుమతిస్తారు:
రుణ సంస్థలు రక్త సంబంధీకులను హామీగా ఉంచ‌డాన్ని ప్రాముఖ్య‌త‌నిస్తాయి. కొన్ని సందర్భాల్లో సహోద్యోగులు, స్నేహితులను సైతం అంగీకరిస్తాయి. హామీదారు బాధ్యతలు పలు రకాలుగా ఉంటాయి. రుణ సంస్థలు హామీదారు ఆదాయం, ఆస్తుల వివరాలను సేకరిస్తాయి. ఆర్జించే ఆదాయాన్ని బట్టి బ్యాంకులు వ్యక్తి వివరాలను ఆరా తీస్తాయి. కేవైసీ నిబంధనలకు సంబంధించిన పత్రాలను హామీదారు బ్యాంకుల‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

రుణ చరిత్రపై ప్రభావం:
* రుణం తీసుకోగానే రుణ గ్రహీత, హామీదారు ఇద్దరి రుణ చరిత్ర నివేదికల్లో ఈ విషయం గురించి అప్‌డేట్‌ చేస్తారు.
* ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా రుణ గ్రహీత డిఫాల్టర్‌గా మారితే అది ఇద్దరి రుణ చరిత్రపై ప్రభావం చూపుతుంది.
* భవిష్యత్తులో హామీదారు తీసుకునే రుణాలపై ఈ ప్రభావం ఉంటుంది.
సొంత రుణం తీసుకోవడంపై ప్రభావం:
క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలు హామీగా ఉన్న వివరాలను రుణ చరిత్ర నివేదికలో ఉంచుతాయి. దీంతో మీరు రుణం తీసుకునేప్పుడు మీ సామర్థ్యాన్ని దీనితో జతకలిపి అంచనా వేస్తారు.

అప్పు తీసుకున్నవారు డీఫాల్ట్‌ అయితే:
పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేరు. రుణం తీసుకున్నప్పుడు అన్నీ బాగానే ఉండొచ్చు. ఒక్కోసారి అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు లేదా ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంగవైకల్యం లేదా మరణం సంభవించవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణ గ్రహీతకు భద్రత ఉండి ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే రుణ సంస్థలు హామీగా ఉన్నవారి నుంచి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఒక్కసారి హామీగా ఉండటం మొదలైన తర్వాత మధ్యలో వైదొలగేందుకు వీలుండదు. రుణ గ్రహీత చేత వాయిదాలు చెల్లింపచేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయలేకపోతే మీ వంతుగా మీరు చెల్లించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.

హామీగా ఉన్నవారు చెల్లించేందుకు అంగీకరిస్తే:
రుణ గ్రహీత అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో నియమ నిబంధనల ప్రకారం హామీదారుకు నోటీసులు అందిస్తాయి. అప్పుడు హమీదారు వాయిదాలు చెల్లించాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఎవరిదో రుణం తీర్చడం కోసం హామీదారు రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇంతకు ముందు తీసుకున్న రుణాలు, హామీగా ఉన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో రుణ అర్హతను నిర్ణయిస్తారు.

హామీగా ఉన్నవారు చెల్లించేందుకు నిరాకరిస్తే:
* మనం ఒకసారి హామీగా ఉంటూ సంతకం చేస్తే నియమనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
* రుణ సంస్థలు లాభాల కోసమే పనిచేస్తాయి. రుణాలను రాబట్టుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తాయి. న్యాయపరంగా అన్ని పరిస్థితులను విశ్లేషిస్తాయి.
* డీఫాల్టర్‌గా మారిన వారి అప్పులను చెల్లించాల్సిన బాధ్యత హామీదారులదే. మీ స్థిర, చరాస్తులను సైతం ఉపయోగించి రుణ సంస్థలు రికవరీకి ప్రయత్నిస్తాయి.
* చివరకు చెల్లింపులు రాబట్టుకోలేని పరిస్థితుల్లో మీరు జైలుకు వెళ్లడాన్ని కూడా కొట్టిపారేయలేం. 

నిరర్ధక ఆస్తుల నుంచి తప్పించుకునేందుకు బ్యాంకులు హామీని కోరతాయి. తద్వారా రుణ గ్రహీత అప్పు చెల్లించకపోయినా హామీదారు నుంచి రాబట్టుకునేందుకు వీలుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా రుణ గ్రహీత వాయిదాలు చెల్లిస్తారనే నమ్మకం ఉంటేనే హామీ సంతకం పెట్టడం మంచిది. అలాగే నియమ నిబంధనలను అన్నింటినీ చదివిన తర్వాత మాత్రమే సంతకాలు చేయాలి. ఏవైనా అనుమానాలు ఉంటే నిపుణులను అడిగి తెలుసుకోవాలి. మీరు సంతృప్తి చెందకపోతే హామీగా ఉండకపోవడమే ఉత్తమం. సాధ్యమైనంత వరకూ హామీగా ఉండకపోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని