
Term Insurance: టర్మ్ బీమా క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలు
ఇంటర్నెట్ డెస్క్: పాలసీ తీసుకునేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులే క్లెయిమ్ తిరస్కరణకు కారణాలు అవుతాయి. అలాంటి తప్పు టర్మ్ పాలసీ విషయంలో జరిగి పాలసీ తిరస్కరణకు గురైతే మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించాలని మీరు చేసిన ప్రయత్నం మొత్తం వృథా అవుతుంది. అందుకే టర్మ్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి చిన్న విషయాన్నీ పరిశీలించాలి. తప్పులు, పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలి.
పాలసీ తీసుకునే సమయంలో పాలసీకి సంబంధించిన అన్ని పత్రాలను క్షుణ్ణంగా చదివి పాలసీదారుడు స్వయంగా పాలసీపత్రాన్ని పూరించి సంతకాలు చేస్తే దాదాపు ఇటువంటి సమస్యలు ఉండవు. కానీ చాలా మంది అలా చేయరు. పాలసీపత్రంపై సంతకాలు చేసి మధ్యవర్తికి ఇచ్చేస్తారు. మధ్యవర్తికి పాలసీదారు గురించి సమగ్ర సమాచారం తెలియకపోవచ్చు. పత్రాలను నింపే క్రమంలో తెలియకుండానే తప్పులు జరగొచ్చు. దీంతో క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీ తిరస్కరించినప్పుడు, పాలసీదారు నామినీలకు ఆందోళన మొదలవుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి సందర్భాల్లో క్లెయిమ్ తిరస్కరిస్తారో తెలుసుకుంటే మంచిది.
పాలసీ ల్యాప్స్ అవ్వడం: ఎక్కువ శాతం పాలసీ క్లెయిమ్‌ల తిరస్కరణకు ప్రధాన కారణం పాలసీ ల్యాప్స్ అవ్వడం. చాలా మంది పాలసీని కొనుగోలు చేస్తారు కానీ ప్రీమియంను సమయానికి చెల్లించరు. ఒకవేళ ఏదైనా కారణం చేత ప్రీమియం చెల్లించాల్సిన తేదీ దాటిపోయినా చాలా వరకు బీమా సంస్థలు ‘గ్రేస్ పిరియడ్’ని అందిస్తున్నాయి. ఈ తేదీలోపు చెల్లించినా పాలసీ రద్దుకాదు. ఒకవేళ గ్రేస్ పిరియడ్‌లో కూడా ప్రీమియం చెల్లించనట్లయితే పాలసీ రద్దు అయ్యే ప్రమాదం ఉంది. అటువంటి సమయంలో క్లెయిమ్ చేసినా బీమా సంస్థలు తిరస్కరిస్తాయి.
నిజాలను వెల్లడించకపోవడం: టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు సమయంలో కావలసిన మొత్తం సమాచారాన్ని నిజాయతీగా ప్రకటించడం తప్పనిసరి. పాలసీ కొనుగోలుదారు.. వారి వైద్య చరిత్ర, జీవనశైలి అలవాట్లు తదితర విషయాల గురించిన ఎలాంటి సమాచారాన్ని దాచిపెట్టకూడదు. క్లెయిమ్ మూల్యాంకనం చేస్తున్నప్పుడు, బీమా కంపెనీ ఏదైనా బహిర్గతం చేయని సమాచారాన్ని కనుగొంటే, ముఖ్యమైన సమాచారాన్ని తెలుపనందున క్లెయిమ్ తిరస్కరించవచ్చు.
పూర్తి సమాచారం ఇవ్వకపోవడం: బీమా ఫారంలో ఇచ్చే అసంపూర్ణ వివరాలు టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు దారితీయవచ్చు. కాబట్టి, ఫారం నింపేటప్పుడు బీమా సంస్థ కోరిన పాలసీదారుని పేరు, వయస్సు, అర్హత, ఆదాయం, వృత్తి, ఇతర అన్ని వివరాలు తప్పులు లేకుండా పూర్తి సమాచారాన్ని అందించడం మంచిది.
ముందున్న పాలసీల గురించి సమాచారం ఇవ్వకపోవడం: ఏ బీమా కంపెనీ అయినా పాలసీ తీసుకునేటప్పుడు మీరు తీసుకున్న ఇతర బీమా పాలసీలకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా అడుగుతుంది. చాలా మంది ఈ వివరాలను వెల్లడించకుండా ఉంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ పాలసీలను కలిగి ఉన్నప్పుడు, వాటి వివరాలను వెల్లడించనప్పుడు కూడా క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు.
నామినీ వివరాలు అప్డేట్ చేయకపోవడం: నామినీ వివరాలను అప్డేట్ చేయకపోవడం కూడా బీమా క్లెయిమ్ చేసేందుకు అడ్డంకి కావచ్చు. బీమా సంస్థ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాల కోసం నామినీ/చట్టపరమైన వారసుడి అర్హతను ధ్రువీకరించలేకపోతే (వారసత్వ ధ్రువీకరణ పత్రాల సాయంతో) అది క్లెయిమ్ తిరస్కరణకు దారితీయవచ్చు.
గడువు లోపు క్లెయిం దరఖాస్తు చేయకపోవడం: పాలసీదారుకి ఏదైనా జరిగినప్పుడు.. సాధ్యమైనంత తొందరగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయాలి. బీమా కంపెనీలను బట్టి ఇందుకోసం 60-90 రోజుల వ్యవధి ఉంటుంది. సమీపంలో ఉన్న సంబంధిత బీమా సంస్థ శాఖకు వెళ్లి, పాలసీదారు మరణానికి సంబంధించిన సమాచారాన్ని లిఖిత పూర్వకంగా అందించాలి. తర్వాత ఏం చేయాలన్న విషయాల గురించి బీమా సంస్థ సేవా కేంద్రాన్ని లేదా సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. నామినీ తనకు సంబంధించిన చిరునామా, ఫోన్ నంబర్ బీమా కంపెనీకి తెలియజేయాలి.
ఇతర కారణాలు: పాలసీ తీసుకునేటప్పుడే కొన్ని రకాల మరణాలకు బీమా వర్తించదని బీమా కంపెనీలు ముందే తెలియజేస్తాయి. సాధారణంగా, పాలసీ తీసుకున్న ఏడాదిలోపు ఆత్మహత్య వంటి కారణాలతో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే క్లెయిమ్ తిరస్కరించొచ్చు.
చివరిగా: కుటుంబానికి మూలాధారమైన వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా టర్మ్ బీమా రక్షణ కల్పిస్తుంది. బీమా చేసిన వ్యక్తి పాలసీ వ్యవధిలోపల మరణిస్తే నామినీకి హామీ మొత్తం అందుతుంది. కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి హామీ లభించదు. అందుకే టర్మ్ బీమా ఇతర పాలసీలతో పోలిస్తే తక్కువ ప్రీమియంతో ఎక్కువ హామీని అందిస్తుంది. పాలసీదారు.. వారి వార్షిక ఆదాయానికి కనీసం 12-15 రెట్లు అధికంగా హామీ మొత్తం ఉండేలా చూసుకోవాలి. కనీసం 60 ఏళ్లు వచ్చే వరకు పాలసీని కొనసాగించాలి. పాలసీదారుడు పాలసీ సమాచారాన్ని కుటుంబంలో ఒకరిద్దరు సభ్యులకు తెలియజేయాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే క్లెయిం సమయంలో పరిహారాన్ని సులువుగా అందుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sini Shetty: ఇప్పటి మిస్ ఇండియా ఒకప్పటి ఎయిర్టెల్ భామనే
-
Sports News
Bairstow: కోహ్లీతో గొడవ.. బెయిర్‌స్టో ఏమన్నాడంటే..?
-
Politics News
Maharashtra: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం.. పవార్ సంచలన వ్యాఖ్యలు..!
-
Business News
windfall tax: విండ్‌ఫాల్ పన్ను తొలగింపు ఎప్పుడంటే..
-
Politics News
Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
-
Crime News
Madhya Pradesh: దారుణం.. మహిళకు నిప్పంటించి, వీడియోలు తీసి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్