Motor Insurance: వాహన బీమా క్లెయిమ్‌ ఎలాంటి సందర్భాల్లో తిరస్కరిస్తారు?

పాల‌సీ తీసుకుని ప్రీమియంలు స‌మ‌యానికి చెల్లించిన‌ప్ప‌టికీ.. క్లెయిమ్ స‌మ‌యంలో పాల‌సీ తిర‌స్క‌ర‌ణ‌కు గురికావచ్చు.

Published : 03 Feb 2022 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వ‌స్తుందో తెలియ‌దు. వాహ‌నంలో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ న‌ష్టాన్ని ఆర్థికంగా భ‌ర్తీ చేసేందుకు ముందు జాగ్రత్తగా బీమా తీసుకుంటాం. పాల‌సీ తీసుకుని ప్రీమియంలు స‌మ‌యానికి చెల్లించినప్పటికీ ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోక‌పోతే.. క్లెయిమ్ స‌మ‌యంలో పాల‌సీ తిర‌స్కరణకు గురౌతుంది. ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాహన బీమా క్లెయిమ్‌ తిరస్కరణకు గురికాకుండా చూసుకోవచ్చు.

  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిస్తే: ద్విచ‌క్ర వాహ‌నం ప్రమాదానికి గురైన సమయంలో వాహ‌నం న‌డిపే వ్యక్తికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉండాలి. ఒక‌వేళ లైసెన్స్ గ‌డువు ముగిస్తే బీమా క్లెయిమ్ తిర‌స్కరిస్తారు. అందువ‌ల్ల మీ లెసెన్స్ గడువు తేదీ చెక్ చేసుకుంటూ ఉండండి. గ‌డువు ముగిస్తే వెంటనే పునరుద్ధరించండి.
  • పాల‌సీ బ‌దిలీ పూర్తికాన‌ప్పుడు: మీరు వేరొక వ్యక్తి నుంచి పాత ద్విచ‌క్ర వాహనాన్ని కొనుగోలు చేస్తే.. వాహ‌నం మీ పేరుకు బ‌దిలీ అయిన 15 రోజుల్లోపు బీమా బ‌దిలీ పూర్తికావాలి. ఒక‌వేళ ఈ ప్రక్రియ పూర్తి చేయ‌డంలో ఆల‌స్యం జ‌రిగి.. వాహ‌నం ప్రమాదానికి గురైతే బీమా సంస్థ మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది.
  • ఆల‌స్యంగా స‌మాచార‌మివ్వడం: ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ఇత‌ర‌ మాన‌వ త‌ప్పిదాల‌ కార‌ణంగా వాహనానికి నష్టం జ‌రిగితే వెంట‌నే బీమా సంస్థకు స‌మాచారం ఇవ్వాలి. ఒక‌వేళ స‌మాచారం ఇవ్వడంలో ఆల‌స్యం చేస్తే  క్లెయిమ్ తిరస్కరించే అవకాశాలు ఎక్కువ. ప్రమాదం జరిగిన 2-3 రోజుల్లోపు బీమా కంపెనీకి ఈ విషయాన్ని తెలియజేయడం మంచిది.
  • నో-క్లెయిమ్ బోనస్ విష‌యంలో: ఎన్‌సీబీ ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశంతో మునుపటి క్లెయిమ్ గురించి ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే బీమా పాలసీ కోసం చేసిన క్లెయిమ్‌లు తిరస్కరిస్తారు.
  • ట్రిపుల్ రైడింగ్‌: ద్విచ‌క్ర వాహ‌నంపై ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదని కచ్చిత‌మైన నియ‌మాలు ఉన్నాయి. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో వాహ‌నంపై ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రయాణించినా లేదా వాహ‌నం ఓవ‌ర్‌లోడ్ అయినా బీమా తిర‌స్కరిస్తారు.
  • మద్యం సేవించి నడిపితే: మద్యం సేవించి లేదా నిషేదిత మ‌త్తు ప‌దార్థాలు సేవించి వాహనాలు నడిపే వారికి ప్రమాదం జరిగితే అలాంటి వారికి ఎలాంటి బీమా వర్తించదు.
  • హెల్మెట్ లేకుండా: హెల్మెట్ లేకుండా ఉన్న సమయంలో ప్రమాదం జరిగితే బీమా వర్తించదు.
  • రాంగ్ రూట్‌లో వాహ‌నం న‌డిపితే: రాంగ్‌ రూట్‌లో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైతే వాహనానికి గానీ, వ్యక్తికి గానీ ఎలాంటి బీమా వర్తించదు. సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తిపై ఎటువంటి కేసులూ ఉండవు. పైగా ఆ వ్యక్తికి పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన‌ప్పుడు ప్రమాదం జ‌రిగితే కూడా బీమా వ‌ర్తించ‌దు. పైగా జ‌రిమానా, శిక్షలు పడతాయి.
  • రిజిస్ట్రేష‌న్‌: ఆర్‌టీఓ కార్యాల‌యంలో మీ వాహ‌న రిజిస్ట్రేష‌న్ స‌క్రమంగా పూర్తిచేసి ఉండాలి. అలాగే, మీ ద్విచ‌క్ర వాహ‌నానికి సంబంధించిన అన్ని ఇత‌ర ప‌త్రాల‌ను అప్ టు డేట్‌గా  ఉంచుకోవాలి. లేదంటే ప్రమాదం జరిగినప్పుడు బీమా క్లెయిమ్‌ల‌ను బీమా సంస్థ తిర‌స్కరిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని