Updated : 04 Jul 2022 17:33 IST

MWP ACT: ఎండ‌బ్ల్యూపీ చ‌ట్టం గురించి తెలుసా? దీని కింద బీమా పాలసీ కొనుగోలుతో ప్రయోజనం ఏంటి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాహుల్‌కి పెళ్లైంది. ఇద్దరు పిల్ల‌లు. వ్యాపారం చేయాలనేది అత‌డి క‌ల‌. ఇందుకోసం రాహుల్‌ ప్ర‌స్తుతం చేస్తున్న ఉద్యోగం వ‌దిలిపెట్టి వ్యాపారం మొద‌లు పెట్టాడు. వ్యాపారంలో భాగంగా ప్లాంట్‌, మిష‌న‌రీ కోసం బ్యాంకు నుంచి రూ.70 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం తీసుకున్నాడు. మ‌రోవైపు రాహుల్, కుటుంబ స‌భ్యుల కోసం రూ.1 కోటి ట‌ర్మ్ పాల‌సీ తీసుకున్నాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అంతా స‌వ్యంగా జ‌రిగితే రాహుల్ వ్యాపారం కోసం తీసుకున్న రుణాన్ని కొద్దికొద్దిగా తీర్చ‌గ‌లుగుతాడు. ఒక‌వేళ‌ అనుకోకుండా అత‌డు మ‌రణిస్తే బ్యాంకుకు డబ్బు చెల్లించాల్సిన బాధ్యత కుటుంబ స‌భ్యుల‌పై ప‌డుతుంది. రాహుల్ రూ.1 కోటి ట‌ర్మ్ పాల‌సీ తీసుకున్నాడు కాబ‌ట్టి హామీ మొత్తం నుంచి బ్యాంకు రుణ మొత్తం వ‌డ్డీతో స‌హా జ‌మ చేసుకుంటుంది. దీంతో అత‌డి భార్య‌, పిల్ల‌ల‌కు అంద‌వ‌ల‌సిన హామీ మొత్తం అంద‌క, వారు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇలా వివిధ కార‌ణాల‌తో చాలా మంది బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు, స్నేహితులు, బంధువుల నుంచి రుణం తీసుకుంటారు. ఈ రుణం చెల్లించ‌కుండానే వారు మ‌ర‌ణిస్తే.. భార్య‌, పిల్ల‌ల జీవ‌నం, భ‌విష్యత్తు కోసం చేసిన ఏర్పాటు వారికి అంద‌కుండా రుణ చెల్లింపుల‌కు మ‌ళ్లుతుంది. 

ఇలాంటి సందర్భంలో MWP ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చ‌ట్టం కింద ఒక ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే.. రుణం ఇచ్చిన బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు, బంధువులు, స్నేహితులు, ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు మ‌రిఎవ‌రైనా గానీ.. ట‌ర్మ్ పాల‌సీ హామీ మొత్తాన్ని క్లెయిమ్ చేయ‌డం సాధ్యం కాదు. ఈ మొత్తం పాల‌సీదారుని భార్య‌, పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు స‌హాయ‌ప‌డుతుంది. భార‌త్‌లో నివ‌సించే వివాహితులు MWP చ‌ట్టం కింద పాల‌సీ తీసుకోవ‌చ్చు.

ఎమ్‌డ‌బ్ల్యూపీ (MWP) చట్టం: వివాహిత మహిళల రక్షణ చట్టం 1874 (MWP Act).. భార‌త్‌లో ఎప్ప‌టి నుంచో ఉన్న‌ప్ప‌టికీ చాలా మందికి దీని గురించి అవ‌గాహ‌న లేద‌నే చెప్పాలి. ఈ చ‌ట్టం కింద పాల‌సీ కొనుగోలు చేస్తే, పాల‌సీదారుడు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో హామీ మొత్తాన్ని అందించేందుకు మొద‌టి ప్రాధాన్య‌ం అత‌డి భార్య, పిల్ల‌ల‌కు ఇస్తారు.

వివాహిత మ‌హిళ‌ల ఆస్తి చ‌ట్టం కింద పాల‌సీ కొనుగోలు చేస్తే, పాల‌సీ ప్ర‌యోజ‌నాలు నేరుగా భార్య‌/పిల్ల‌ల‌కు చేరుతాయి. ఈ మొత్తంతో రుణాలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. రుణదాత‌లు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయ‌లేరు. ఎండ‌బ్ల్యూపీ చట్టంలోని సెక్షన్ 6 ఈ అంశాన్ని తెలియ‌జేస్తుంది. మీరు పురుషుడై కుటుంబానికి పోషణాధారం అయితే ఎండ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేయ‌డం ద్వారా భార్యా పిల్ల‌ల‌కు అద‌న‌పు భ‌ద్ర‌త అందించొచ్చు.

ఎండ‌బ్ల్యూపీ చట్టం కింద జారీ చేసిన బీమా పాలసీ సాధారణంగా ఉద్యోగులు (జీతం ద్వారా ఆదాయం పొందుతున్న‌ వ్యక్తులు), వ్యాపారంలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తులు కొన్నిసార్లు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వ్యక్తిగత రుణం, గృహ రుణం, వ్యాపార రుణం, వినియోగదారుల‌ రుణం వంటి ప‌లు ర‌కాల రుణాలపై ఆధారపడతారు. ఇవి చెల్లించ‌కుండానే ఆ వ్య‌క్తి మ‌ర‌ణిస్తే రుణ సంస్థ‌లు హామీ మొత్తం క్లెయిమ్ చేయ‌కుండా, హామీ మొత్తం భార్య‌, పిల్ల‌ల‌కు చేరుతుంది. అయితే ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. ఈ చ‌ట్టం రివ‌ర్స్‌లో ప‌నిచేయ‌దు. అంటే ఒక భార్య త‌న భ‌ర్త‌ను మొద‌టి ల‌బ్ధిదారునిగా చేయ‌డం కుద‌ర‌దు. అయితే ఒక వివాహిత మ‌హిళ త‌న పిల్ల‌ల కోసం ఎండ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద పాల‌సీ కొనుగోలు చేసి లబ్ధి పొందొచ్చు.

ల‌బ్ధిదారులుగా ఎవ‌రిని చేర్చొచ్చు? 
*
 పాల‌సీదారుని భార్య 
* పిల్ల‌లు (ద‌త్త‌త తీసుకున్న‌ప్ప‌టికీ వ‌ర్తిస్తుంది)
*  భార్య, పిల్ల‌ల‌కు క‌లిపి

పాల‌సీదారుడు భార్య‌ను, పిల్ల‌లను కూడా లబ్ధిదారులుగా చేర్చి ఉంటే, ఎవ‌రికి ఎంత శాతం వాటా ఇవ్వాలో కూడా నిర్ణ‌యించ‌వ‌చ్చు. అయితే, ఒక‌సారి దీని గురించి స్ప‌ష్టంగా బీమా సంస్థ‌కు తెలియ‌జేసిన త‌ర్వాత, మ‌ళ్లీ మార్చేందుకు వీలుండ‌దు. ఒక‌వేళ పాల‌సీ తిరిగి ఇచ్చేసినా, ర‌ద్దు చేసినా ముందుగా డిక్లేర్ చేసిన ప్ర‌కారం ల‌బ్ధిదారునికి పాల‌సీ స‌రెండ‌ర్ విలువ‌ను చెల్లిస్తారు. భార్య‌-భ‌ర్త‌లు విడిపోయిన‌ప్ప‌టికీ ల‌బ్ధిదారుల‌ను మార్చుకునే వీలులేదు. ఎండబ్ల్యూపీ చ‌ట్టం కింద బీమా పాల‌సీ తీసుకుంటే త‌ల్లిదండ్రుల‌ను ల‌బ్ధిదారులుగా చేర్చ‌డం కుద‌ర‌దు.

ఎలా కొనుగోలు చేయాలి..?
ఈ చట్టం కింద బీమా పాల‌సీని సుల‌భంగా కొనుగోలు చేయ‌వ‌చ్చు. పాలసీ తీసుకునే సమయంలో బీమా దరఖాస్తుతో పాటు ఎండ‌బ్ల్యూపీఏ అనుబంధాన్ని పూర్తి చేసి, సంతకం చేయాలి. కొన్ని బీమా సంస్థ‌లు ద‌ర‌ఖాస్తు ఫారంలోనే ఆప్ష‌న్‌ను అందిస్తున్నాయి. పాల‌సీదారులు ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద ‘అవును’ అనే ఆప్ష‌న్ ఎంచుకోవాల్సి ఉంటుంది. 

చివ‌రిగా: టర్మ్‌పాల‌సీని ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ, ట‌ర్మ్ పాల‌సీ ఫీచ‌ర్లు, ప్ర‌యోజ‌నాలు, ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తులు సాధార‌ణ ట‌ర్మ్ పాల‌సీ మాదిరిగానే ఉంటాయి. ఎలాంటి మార్పులూ ఉండవు. ఎండ‌బ్ల్యూపీ కింద పాల‌సీ తీసుకోవాల‌నుకునే వారు.. కొనుగోలు స‌మ‌యంలోనే ఈ విష‌యాన్ని బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి. ఇప్ప‌టికే కొనుగోలు చేసిన ట‌ర్మ్ పాల‌సీని ఎండ‌బ్ల్యూపీ కింద‌కి తీసుకురావ‌డం కుద‌ర‌దు. ఒక‌సారి నామినీ ఎంచుకున్న త‌ర్వాత తిరిగి మార్చుకునే వీలుండ‌దు కాబ‌ట్టి.. పాల‌సీ తీసుకునేముందు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని