Gold loan: అత్యవసరంగా డబ్బు కావాలా? గోల్డ్‌ లోన్‌ మేలైన మార్గం.. ఎందుకంటే?

Gold Loan: అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు గోల్డ్‌ లోన్‌ (Gold Loan) చాలా ఉపయుక్తంగా ఉంటుంది. పెద్దగా డాక్యుమెంటేషన్‌ లేకుండానే తక్కువ వడ్డీకి, వేగంగా ఈ రుణం మంజూరు అవుతుంది.

Updated : 15 Dec 2022 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖర్చులెప్పుడూ మన ఆదాయాన్ని మించొద్దు. అలా అయితేనే మీకు ఆర్థిక క్రమశిక్షణ ఉన్నట్లు. అలాగే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా జీవితం సాఫీగా సాగుతుంది. కానీ, ఖర్చులు చెప్పి రావు కదా? అందుకే అత్యవసర నిధి కింద ఎప్పుడూ ఎంతో కొంత డబ్బును పక్కకు తీసి పెట్టుకోవాలి. సరిపడా ఆరోగ్య, జీవిత బీమా తీసుకోవాలి. లక్ష్యాలకు అనుగుణంగా మదుపు చేస్తూ ఉండాలి.

ఎంతటి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లినా ఒక్కోసారి మన అవసరానికి డబ్బులు చేతికి అందవు. వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వ్యాపారంలో పెట్టుబడి.. ఇలా ఏదో రూపంలో అదనపు ఖర్చులు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న మొత్తం సరిపోకపోతే రుణం (Loan) తీసుకోక తప్పదు. మరి వెంటనే మన అవసరానికి రుణం (Loan) అందుతుందా? రుణ మంజూరుకు పెద్ద ప్రక్రియే ఉంటుంది. కనీసం మూడు రోజులైనా పడుతుంది. ఒక్కోసారి వారం.. నెల.. కూడా పట్టొచ్చు. అలాంటి సందర్భాల్లో మనల్ని ఆదుకునేదే గోల్డ్‌ లోన్‌ (Gold Loan).

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. అత్యవసర సమయాల్లో అదే మనకు అండగా నిలుస్తుంది. దాన్ని తనఖా పెట్టి రుణం (Loan) తీసుకోవడం చాలా మెరుగైన మార్గం. చాలా వేగంగా రుణం మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ఇది సెక్యూర్డ్‌ లోన్‌ కాబట్టి బ్యాంకులు కూడా ఎలాంటి కొర్రీలు లేకుండానే రుణ ప్రక్రియను పూర్తిచేస్తాయి. మరి గోల్డ్ లోన్‌ (Gold Loan) వల్ల ఉన్న ఐదు ప్రధాన ప్రయోజనాలేంటో చూద్దాం..

వేగంగా మంజూరు..

సాంకేతిక అందుబాటులోకి వచ్చిన తర్వాత బంగారంపై రుణాలు మరింత వేగంగా మంజూరవుతున్నాయి. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు డిజిటల్‌ మార్గాన్ని ఆశ్రయిస్తే పని మరింత సులువవుతుంది. ఆన్‌లైన్‌లో గోల్డ్ లోన్‌ (Gold Loan)కు సంబంధించిన దరఖాస్తు నింపి సమర్పిస్తే చాలు. బ్యాంకు ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి బంగారాన్ని సరిచూసుకుంటారు. నాణ్యతను పరీక్షించి ధ్రువీకరించుకుంటారు. అవసరమైన పత్రాలు తీసుకుంటారు. ఇదంతా గంటల్లో పూర్తవుతుంది. డబ్బును సమకూర్చుకోవడానికి ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలతో పోలిస్తే ఇది చాలా వేగవంతమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం గంటల్లోనే రుణ మొత్తం మీ ఖాతాలో జమయ్యే అవకాశం ఉంటుంది. 

పెద్దగా  అర్హతలు అవసరం లేదు..

ఇతర రుణాలతో పోలిస్తే గోల్డ్‌ లోన్‌ (Gold Loan) పొందడానికి రుణగ్రహీతలకు పెద్దగా అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా సెక్యూర్డ్‌ లోన్‌. అంటే మనం పెడుతున్న బంగారం విలువ ఆధారంగానే రుణాన్ని మంజూరు చేస్తారు. ఒకవేళ మనం ఎగ్గొట్టినా.. దాన్ని వేలం వేసి రికవరీ చేసుకునేందుకు వారికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score), క్రెడిట్‌ హిస్టరీ వంటి వాటిని బ్యాంకులు పెద్దగా పరిగణనలోకి తీసుకోబోవు.

పెద్ద మొత్తంలో..

ఒక్కోసారి వైద్య ఖర్చులు, వ్యాపార అవసరాల కోసం పెద్ద ఎత్తున డబ్బు అవసరమవుతుంటుంది. పెద్దగా సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు గోల్డ్‌ లోన్‌ (Gold Loan) తీసుకోవడం మేలైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మిగిలిన రుణాలతో పోలిస్తే పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకునేందుకూ ఇది దోహదం చేస్తుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బంగారం మార్కెట్‌ విలువలో 75 శాతం వరకు రుణం లభించే అవకాశం ఉంది. అందుకే రూ.20 లక్షల విలువ చేసే బంగారంపై రూ.15 లక్షల వరకు రుణం పొందొచ్చు.

తక్కువ వడ్డీరేటు..

వ్యక్తిగత, తనఖా, వ్యాపార, కార్పొరేట్ రుణాలు మొదలైన వాటితో పోలిస్తే బంగారు రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో తక్కువ వడ్డీ రేటుతో రుణం అందడం కంటే కావాల్సింది ఏముంటుంది. ఫలితంగా తిరిగి చెల్లించే మొత్తం తగ్గుతుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంపై ఎటువంటి అదనపు భారం వేయదు. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లేదా ఇల్లు కొనడానికి అదనపు డబ్బు అవసరమైన వారికి అధిక-వడ్డీ రేటు చెల్లించడం గురించి చింతించాల్సిన అవసరం లేకుండా బంగారు రుణాలను ఆశ్రయించవచ్చు.

సులభంగా చెల్లించొచ్చు..

బంగారు రుణం విషయంలో రుణగ్రహీతలకు బ్యాంకులు కొన్ని వెసులుబాట్లను కల్పిస్తాయి. ఆర్థిక పరిస్థితిని బట్టి నెలానెలా కేవలం వడ్డీ చెల్లించినా సరిపోతుంది. అసలు మొత్తాన్ని ఆఖరున చెల్లించొచ్చు. అంటే లోన్ వ్యవధిలో కేవలం వడ్డీ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. కావాలనుకుంటే అసలు, వడ్డీ.. రెండు ఒకేసారి చెల్లించడానికి కూడా బ్యాంకులు అనుమతిస్తాయి. ఫలితంగా మన ఆర్థిక వ్యవహారాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి, సమర్థంగా నిర్వహించడానికి గోల్డ్ లోన్ (Gold Loan)  చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీకు డబ్బు సర్దుబాటు అయినప్పుడే చెల్లించే అవకాశం ఉంటుంది. ఇది మీపై ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా చేస్తుంది. అయితే, గడువు దాటకుండా చూసుకోవాలి.

ఈ ప్రయోజనాలతో పాటు గోల్డ్‌ లోన్‌ (Gold Loan)తో పొందిన మొత్తాన్ని రుణగ్రహీతలు నిర్దిష్టంగా ఒక అవసరానికి మాత్రమే ఉపయోగించాలన్న నిబంధన ఏమీ ఉండదు. అందుకే అత్యవసర సమయాల్లో బంగారంపై రుణం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు