ఆరోగ్య‌బీమా చిన్న వ‌య‌సులోనే ఎందుకు తీసుకోవాలంటే.. 

చిన్న వ‌య‌సులో ఆరోగ్య పాల‌సీ కొనుగోలు చేస్తే త‌క్కువ ప్రీమియంకే వ‌స్తుంద‌నేది నిపుణుల మాట‌. 

Updated : 10 May 2021 16:12 IST

భార‌త్ లాంటి వ‌ర్ధ‌మాన దేశాల్లో యువ‌త పైనే అంద‌రి దృష్టి. అంత‌కు ముందు త‌రంలా కాకుండా యువ‌త‌లో ఇప్పుడు పోటీత‌త్వం, లోక‌జ్ఞానం మెండు. చిన్న వ‌య‌సులోనే ఎక్కువ వేత‌నాలు పొందే దిశ‌గా జీవ‌నాన్ని సాగిస్తున్నారు. అదే విధంగా ఖ‌ర్చు చేయ‌డానికీ ఏమాత్రం వెన‌కాడ‌టం లేదు. ఏ ప‌ని చేసినా ప‌క్కాగా చేయాల‌నే భావ‌న యువ‌త‌ది. ఆర్థిక విష‌యాల నిర్వ‌హ‌ణ‌కు వ‌చ్చేస‌రికి ఎన్నో విష‌యాల్లో అవ‌గాహ‌న క‌లిగి ఉన్నారు. ముందుత‌రాల వారితో పోలిస్తే ఎంతో ఆధునికంగా ఆలోచిస్తుంది ఇప్ప‌టి యువ‌త‌.

కానీ… ఒక్క విష‌యంలో మాత్రం ఇంకా వెన‌క‌బ‌డే ఉంటున్నారు. అదే ఆరోగ్య బీమా. పెట్టుబ‌డుల విష‌యంలో క్రియాశీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా చాలా మందికి ఆరోగ్య బీమా ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న కానీ, అవి అందించే ప్ర‌యోజ‌నాలు, ఆర్థిక భ‌ద్ర‌త గురించి అంతంత మాత్ర‌మే తెలుసని నిపుణులు అభిప్రాయం. చిన్న వ‌య‌సులోనే యువ‌త ఆరోగ్య బీమా తీసుకోవాల‌నేదానికి అనేక కార‌ణాలున్నాయి. నేటి యువ‌త‌రం జీవ‌న విధానం నాసిర‌కంగా ఉండ‌టంతో ఒత్తిడి, వెన్ను నొప్పి, కంటి స‌మ‌స్య‌లను చిన్న వ‌య‌సులోనే కొనితెచ్చుకుంటున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని మానేయ‌డం లేటెస్ట్‌ ట్రెండ్‌గా మారింది. వైద్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌డానికి జంక్ ఫుడ్ సైతం ఓ కార‌ణంగా మారింది. ఆరోగ్యక‌ర జీవ‌న విధానం క‌న్నా సాటివారితో పోల్చుకొని ఎంత సంపాదిస్తున్నాం.. అనే దానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇలా విప‌రీత‌మైన జీవ‌న ఒత్తిడి వ‌ల్ల వైద్య‌ప‌ర‌మైన క్లిష్ట‌త‌లు చిన్న వ‌య‌సులోనే వ‌స్తున్నాయి. వైద్య‌ప‌ర‌మైన ఇబ్బందులు అనుకోకుండా ద‌రిచేరి జీవ‌నాన్ని అస్త‌వ్య‌స్తం చేసేస్తున్నాయి. అందుకే ఓ మంచి ఆరోగ్య పాల‌సీ కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఆర్థిక ప‌రంగానైనా వైద్య సంక్లిష్ట‌త‌ల‌తో పోరాడ‌వ‌చ్చు. చిన్న వ‌య‌సులో మొద‌లుపెడితే…పెద్ద‌వాళ్ల‌తో పోలిస్తే యువ‌త అనారోగ్యాల‌కు అంత తొంద‌ర‌గా గురికారు. అలాగ‌ని పాల‌సీ తీసుకోకుండా మాత్రం ఉండకూడ‌దు అంటున్నారు నిపుణులు. చిన్న వ‌య‌సులో పాల‌సీ తీసుకోవ‌డం వ‌ల్ల ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధులుంటే వాటికి వ‌ర్తించే వెయిటింగ్ పీరియ‌డ్‌ను దాటేందుకు త‌గిన స‌మ‌యం ల‌భిస్తుంది. ఆ త‌ర్వాతి ద‌శ‌ల్లో స‌మ‌గ్ర బీమా క‌వ‌రేజీ అందేందుకు అవ‌కాశం దొరుకుతుంది. ఆరోగ్య బీమా పాల‌సీకి వ‌ర్తించే నో క్లెయిం బోన‌స్‌ ఏళ్లు గ‌డిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అంతే కాదు చిన్న వ‌య‌సులో ఆరోగ్య పాల‌సీ తీసుకుంటే ప్రీమియం ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయి. మామూలుగా బీమా సంస్థ‌లు యుక్త వ‌య‌సువారికి త‌క్కువ ధ‌ర‌లోనే పాల‌సీని ఇస్తుంటాయి. అలా వారితో అనుబంధం కొన‌సాగించ‌డం వ‌ల్ల ఆ త‌ర్వాత కూడా త‌క్కువ ప్రీమియంకే పాల‌సీ రెన్యూవ‌ల్ చేసే వీలు క‌ల్పిస్తారు. పెద్ద‌వారు అనారోగ్య బారినప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌. అందుకే చిన్న వ‌య‌సులోనే పాల‌సీ తీసుకోమ‌ని ఆరోగ్య బీమా సంస్థ‌లు ప్రోత్స‌హిస్తాయి.

సంస్థ ఇచ్చే బీమా స‌రిపోదేమో! ఉద్యోగులైతే తాము ప‌నిచేసే సంస్థే ఇచ్చే ఆరోగ్య బీమా అన్ని అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల‌ద‌నే అపోహ‌లో యువ‌త ఉంటుంది. సంస్థ‌లు ఇచ్చే పాల‌సీలు స‌మ‌గ్రంగా అన్నింటికి క‌వ‌రేజీ ఇవ్వ‌వు. చాలా సంద‌ర్భాల్లో సంస్థ‌లు ఇచ్చే బీమా హామీ సొమ్ము ఉద్యోగుల‌కు స‌రిప‌డ‌క‌పోవ‌చ్చు. దాన్ని ఉద్యోగులు త‌మ అభీష్టం మేర‌కు మార్చుకోవ‌చ్చు లేదా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకే అద‌నంగా ఏదైనా టాప్ అప్ ప్లాన్ లేదా విడిగా ఆరోగ్య బీమా పాల‌సీ ఉంటే మంచిది. సొంతానికి లేదా కుటుంబంతో క‌లిపి ఆరోగ్య‌పాల‌సీ తీసుకోవ‌డమ‌నేది అవ‌స‌రం. ఉద్యోగ మార్పు లాంటి ప‌రిస్థితుల్లో వ్య‌క్తిగ‌త ఆరోగ్య పాల‌సీలు స‌హ‌క‌రిస్తాయి. బీమా ఖ‌ర్చు కాదు - చాలా మంది యువ‌త బీమా ప్రీమియంల‌ను ఒక ఖ‌ర్చుగా చూస్తారు. ఖ‌ర్చుగా చూసేకంటే దీన్నో పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించాలి. మారుతున్న‌ జీవ‌న విధానం వ‌ల్ల బీపీ, డ‌యాబెటిస్ లాంటివి పెరిగిపోతున్నాయి. ఈ అనారోగ్యాలు మ‌రింత సంక్లిష్టంగా మారి ప్రాణాల మీదికి రావొచ్చు. అందుకే చిన్న వ‌య‌సులో ఆరోగ్య పాల‌సీ కొనుగోలు చేస్తే త‌క్కువ ప్రీమియంకే వ‌స్తుంద‌ని నిపుణుల మాట‌. 

స‌రైన ఆరోగ్య బీమా ఎంచుకునేందుకు…
* క్లెయిం చేసే కొద్దీ ప్రీమియం వ‌డ్డ‌న ఉండే ఆరోగ్య పాల‌సీల జోలికి వెళ్ల‌కండి.
* ఉప ప‌రిమితులు లేని పాల‌సీని ఎంచుకొండి. కొన్ని ఆసుప‌త్రి గ‌ది అద్దెపై ఉప‌ప‌రిమితిని విధిస్తాయి.
* జీవిత కాలానికి స‌రిప‌డా క‌వ‌రేజీ ఇచ్చేవి తీసుకోవాలి. పున‌రుద్ధ‌ర‌ణ‌ను తిర‌స్క‌రించేవి వ‌ద్దు.
* క‌నీస బీమా హామీ సొమ్ము రూ.4-6లక్ష‌ల మ‌ధ్య‌లో ఉండేలా చూసుకోండి.
* క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్‌ పాలసీ అంటే ఏమిటి? గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వివ‌రాలు తెలుసుకోండి.
* క్లెయిం స‌మ‌యంలో తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా పాల‌సీ డాక్యుమెంట్‌ను స్వ‌యంగా మీరే నింపండి.
* అన్ని నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను క్షుణ్ణంగా చ‌ద‌వండి.
* పాల‌సీ ధ‌ర త‌క్కువ ఉంది క‌దా అని ఏది ప‌డితే అది కొన‌కండి.
* మీ అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా క‌వ‌రేజీ, బీమా ప‌రిధిలోనికి వ‌చ్చేవి, ప‌రిమితులు లాంటివ‌న్నీ తెలుసుకొని కొనుగోలు చేయ‌గ‌ల‌రు.
* మీరు పాల‌సీ కొనుగోలు చేయ‌బోయే సంస్థ క్లెయింల ప‌రిష్కార నిష్ప‌త్తిని తెలుసుకున్నాకే స‌రైన నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని