World Bank: మాంద్యం భయాలు.. వృద్ధిరేటు అంచనాలు తగ్గించిన ప్రపంచ బ్యాంకు!

అమెరికా, చైనా, యూరప్‌ ఆర్థిక వ్యవస్థల్లోని బలహీన వృద్ధి రేటు కారణంగా పేద దేశాలు ఇబ్బందులను ఎదుర్కొంటాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. రాబోయే రోజుల్లో ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

Published : 11 Jan 2023 00:26 IST

వాషింగ్టన్‌: ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాల్లో నెలకొన్న బలహీనమైన ఆర్థికాభివృద్ధి కారణంగా ఈ ఏడాది ఆర్థిక మాంద్యం నెలకొనే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన వార్షిక నివేదికలో పలు దేశాల వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. మరోవైపు, ప్రపంచ జీడీపీలో 1.7 శాతం పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 2009, 2020 తర్వాత మళ్లీ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2024 వృద్ధి అంచనాలను కూడా తగ్గించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులు పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది.

మరోవైపు, కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ కారణంగా నెలకొన్న సంక్షోభం  కారణంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జీడీపీలో వృద్ధి అంచనాల కంటే ఆరు శాతం తక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ అన్నారు. అమెరికా, చైనా, యూరప్‌ ఆర్థిక వ్యవస్థల్లోని బలహీన వృద్ధి రేటు కారణంగా పేద దేశాలు ఇబ్బందులను ఎదుర్కొంటాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో అంచనాలకు మించి వడ్డీ రేట్లలో పెరుగుదల ఉంటుందని పేర్కొంది. వృద్ధి నెమ్మదించడం, కఠినమైన ఆర్థిక పరిస్థితులు, రుణభారం పెరగడం వల్ల పెట్టుబడులు తగ్గి  కార్పొరేట్‌ సంస్థలు ఎగవేతదారులుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆర్థిక మాంద్యం భయాల నుంచి తప్పించుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం ఆర్థికంగా చితికిపోయిన వర్గాలకు సహాయం అందించేలా పాలకులు దృష్టిసారించాలని సూచించింది. అలానే, ద్రవ్యోల్బణం అంచనాలు  స్థిరంగా ఉండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలు దృఢంగా కొనసాగేలా జాగ్రత్త పడాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని