Recession: మాంద్యంలోకి మూడో వంతు ప్రపంచం.. IMF చీఫ్‌ కీలక వ్యాఖ్యలు!

IMF chief on Recession: ఆర్థిక మాంద్యంపై ఐఎంఎఫ్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో వంతు ప్రపంచం ఆర్థిక మాంద్యం ఎదుర్కోబోతోందన్నారు.

Published : 02 Jan 2023 17:44 IST

వాషింగ్టన్‌: ఆర్థిక మాంద్యం (Recession) భయాలు వెంటాడుతున్న వేళ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదే మాంద్యం సంభవించనుందని, మూడో వంతు ప్రపంచం మాంద్యంలోకి వెళుతుందని చెప్పారు. గతేడాది కంటే ఈ ఏడాది మరింత కఠిన పరిస్థితులు నెలకొనబోతున్నాయని హెచ్చరించారు. ఆదివారం ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 10 నెలలు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతుండడం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, చైనాలో కరోనా కేసుల పెరుగుదల వంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించకున్నాయి.

‘‘ఈ ఏడాది మూడింట ఓ వంతు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలోకి జారుకోనుందని అంచనా వేస్తున్నాం. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, చైనాలో ఆర్థిక మందగమనం కారణంగా గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి. మాంద్యం పరిస్థితులు లేని దేశాల్లోనూ లక్షలాది మంది ప్రజలు మాంద్యం తరహా పరిస్థితులను చూడబోతున్నారు’’ అని క్రిస్టాలినా అన్నారు. రాబోయే రెండు నెలల పాటు చైనా గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందని చెప్పారు. అది చైనా వృద్ధిపైనా, ఆ ప్రాంతంపైనా, ప్రపంచం ఆర్థికంపైనా ప్రభావం చూపనుందని చెప్పారు.

ఇప్పటికే 2023కు సంబంధించి వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్‌ సవరించింది. 2021లో 6 శాతంగా ఉన్న ప్రపంచార్థిక వృద్ధి రేటు 2022లో 3.2 శాతంగానూ, 2023లో 2.7 శాతంగా ఉండబోతోందని అంచనా కట్టింది. 2008 ఆర్థిక మాంద్యం, కొవిడ్‌ పరిస్థితులను మినహాయిస్తే 2001 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి కానుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని