Vehicles sales: నవరాత్రికి రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు

నవరాత్రి ఉత్సవాల సమయంలో దేశీయంగా 5.4 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (FADA) వెల్లడించింది.

Published : 10 Oct 2022 18:57 IST

దిల్లీ: నవరాత్రి ఉత్సవాల సమయంలో దేశీయంగా 5.4 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (FADA) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 57 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం రోజైన సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5 వరకు జరిగిన విక్రయాలకు సంబంధించిన డేటాను వెల్లడించింది. గతేడాది 3,42,459 యూనిట్ల వాహనాలు అమ్ముడవ్వగా.. ఈ సారి 5,39,227 యూనిట్ల వాహన విక్రయాలు జరిగాయని ఫాడా తెలిపింది. కొవిడ్‌ ముందు ఏడాది (2019) ఇదే సమయంలో 4,66,128 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది అంతకంటే అధికంగా విక్రయాలు జరిగాయని వెల్లడించింది. మూడేళ్ల తర్వాత వినియోగదారులు మళ్లీ షోరూమ్‌ల బాట పట్టారనడానికి ఈ గణాంకాలు నిదర్శమని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు.

  • విభాగాల వారీగా చూస్తే.. నవరాత్రి సమయంలో 3,69,020 ద్విచక్ర వాహన విక్రయాలు జరిగాయని ఫాడా పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో 2,42,213 ద్విచక్ర వాహన అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే 52.35 శాతం వృద్ధి నమోదైంది. కొవిడ్‌ ముందు ఏడాది 3.55 లక్షల ద్విచక్ర వాహనాలతో పోల్చినప్పుడు కేవలం 3.7 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది.
  • ప్రయాణికుల వాహన అమ్మకాలు గతేడాది 64,850 యూనిట్లు నమోదవ్వగా.. ఈ ఏడాది 70.43 శాతం వృద్ధితో 1,10,521 యూనిట్లు విక్రయాలు జరిగాయి.
  • కమర్షియల్‌ వాహన అమ్మకాలు సైతం 48.25 శాతం వృద్ధితో 22,437 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది 15,135 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
  • త్రీవీలర్‌ కేటగిరీలో ఈ ఏడాది 19,809 యూనిట్లు విక్రయమవ్వగా.. గతేడాది ఈ సంఖ్య 9,203 యూనిట్లుగా ఉంది.
  • గతేడాది 11,062 ట్రాక్టర్లు అమ్ముడుపోగా.. ఈ సారి 17,440 యూనిట్లు అమ్ముడైనట్లు  ఫాడా తెలిపింది. దీపావళి వరకు ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు సింఘానియా తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని