RBI: అధిక ఉష్ణోగ్రతలకు.. EMIల పెరుగుదలకు సంబంధం ఏంటీ..?

దేశంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోవడం రానున్న రోజుల్లో ఈఎంఐలు (EMI) పెరగడానికి కారణమవుతుందని మార్కెట్‌ విశ్లేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గోధుమలు, కూరగాయల ధరలు పెరగడం వంటి ఆర్బీఐ (RBI) కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచేందుకు కారణమవుతాయని చెబుతున్నాయి.

Published : 02 Mar 2023 01:17 IST

ముంబయి: ఫిబ్రవరిలో ఎండలు మండిపోయాయి. గత 120ఏళ్లలో ఫిబ్రవరిలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రానున్న నెలల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందనడానికి ఇది సూచికని అర్థమవుతోంది. ఇక్కడివరకు ఎలాగున్నా.. ఇంటి రుణం తీసుకున్న వారిపై ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉండనుందని నిపుణులు హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అవును.. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోవడమనేది ఏప్రిల్‌లో ఆర్బీఐ ప్రకటించే ద్రవ్య పరపతి విధానంపైనా ప్రభావం పడుతుందని మార్కెట్‌ విశ్లేషణ ఏజెన్సీ ‘ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌’ అంచనా వేసింది. ‘ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. 2022లో మాదిరిగా ఇవి గోధుమ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈసారి గోధుమల దిగుమతి 112 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా వేసిన ముందస్తు అంచనాలతో పోలిస్తే ఇవి 107 మి.టన్నులకు పడిపోయే ప్రమాదం ఉంది. దాంతో ధరలు పెరుగుతాయి. మొన్నటి డిసెంబర్‌, జనవరి నెలల్లో నమోదైన ద్రవ్యోల్బణంలో పదిశాతం ఇలా గోధుమల ధరలు పెరుగుదల వల్లే’నని ఇండియా రేటింగ్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని ప్రస్తావించడంతోపాటు గోధుమ ధరల నియంత్రణ కోసం ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ విధానాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది.

ద్రవ్యోల్బణంపై ఆందోళన..

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 2023లో నమోదైన ఉష్ణోగ్రతలు గడిచిన 122 ఏళ్లలో ఆ నెలలో ఎన్నడూ నమోదు కాలేదు. ఐఎండీ నివేదికకు ముందు.. ఇండియా రేటింగ్స్‌ కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలను తన నివేదికలో ప్రస్తావించింది. రానున్న రోజుల్లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది. ఫిబ్రవరి 17-23తేదీల్లో పంజాబ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా ఉన్నట్లు తెలిపింది. గోధుమల ఉత్పత్తికి కీలకంగా ఉన్న పంజాబ్‌లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. గోధుమల దిగుబడి తగ్గడంతోపాటు వేసవి ప్రారంభంలో కూరగాయల ధరల్లో పెరుగుదల, ఇతర వస్తువుల ధరలు తగ్గకపోవడం వంటివి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తాయని వెల్లడించింది.

ఆర్బీఐ మళ్లీ పెంచుతుందా..?

గత సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను 25బేస్‌ పాయింట్ల మేర పెంచిన విషయాన్ని ఇండియా రేటింగ్స్‌ గుర్తుచేసింది. ద్రవ్యోల్బణం తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని.. అందుకు అనుగుణంగా భవిష్యత్తులో ద్రవ్య పరపతి విధానంపై నిర్ణయం ఉంటుందని ఆర్బీఐ అప్పట్లో తెలిపింది. ఈ నేపథ్యంలో వేసవి మొదలుకావడం.. గోధుమలు, కూరగాయల వంటి వస్తువుల ధరలు పెరగడం వంటివి ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతాయనే భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌లో ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం కీలక రేట్లను ఆర్బీఐ మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేయడం ఇందుకు కారణమవుతోంది.

గృహరుణాలపై ప్రభావం..

ఆర్బీఐ రేట్లను పెంచడం ప్రధానంగా గృహరుణాల ఈఎంఐపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే తక్కువ శాతం వడ్డీతో ఇంటిరుణం తీసుకున్న వారి వార్షిక వడ్డీ సుమారు 9శాతానికి పెరిగింది. ఏప్రిల్‌లో మరోసారి ఆర్బీఐ వీటి రేట్లను పెంచితే ఈఎంఐ చెల్లింపుదారులపై మరోసారి భారం పడుతుంది. మే 2022 నుంచి హౌసింగ్‌ లోన్‌ ఈఎంఐలు క్రమంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని