Updated : 01 Aug 2022 17:55 IST

5G auction: ముగిసిన 5జీ వేలం.. జియోనే టాప్‌ బిడ్డర్‌!

దిల్లీ: రెండ్రోజుల్లోనే ముగుస్తుందనుకున్న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం (5G auction) ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. జులై 26న ప్రారంభమైన వేలం ప్రక్రియ.. సరిగ్గా వారం రోజుల పాటు జరిగింది. చివరి రోజు నాలుగు రౌండ్ల బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా 1.50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది విక్రయించిన 4జీ వేలం కంటే (రూ.77,815 కోట్లు) దాదాపు రెట్టింపు కాగా.. 2010లో నిర్వహించిన 3జీ వేలంతో (రూ.50,958 కోట్లు) పోలిస్తే ఈ మొత్తం మూడు రెట్లు అధికం.

ఈ వేలం ప్రక్రియలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. మరో టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేటు టెలికాం నెట్‌వర్క్‌ కోసం వేలంలో పాల్గొన్న అదానీ గ్రూప్‌ 26 మెగాహెర్జ్ట్‌ స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. జియో, ఎయిర్‌టెల్‌ దేశవ్యాప్తంగా సేవలందించేందుకు స్పెక్ట్రమ్‌ దక్కించుకోగా.. వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఎంపిక చేసిన సర్కిళ్లలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిందో వేలం డేటా మొత్తం సేకరించాక వెల్లడి కానుంది.

ఆ బ్యాండ్లకు టెల్కోలు దూరం

మొత్తం 10 బ్యాండ్లలో 72GHz స్పెక్ట్రాన్ని కేంద్రం వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. ఇందులో 600 MHz, 800 MHz, 2300 MHz బ్యాండ్లకు బిడ్లేవీ దాఖలు కాలేదు. 5జీ బ్యాండ్లైన 3300 MHz, 26 GHzకు మాత్రం మూడింట రెండొంతుల బిడ్లు వచ్చాయి. 2016, 2021లో రెండుసార్లు వేలానికి వచ్చినా బిడ్లకు నోచుకోని 700 MHz బ్యాండ్‌కు మాత్రం నాలుగోవంతు బిడ్లు దాఖలు కావడం గమనార్హం. వేలం ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు రూ.1.45 లక్షల కోట్లు విలువైన బిడ్లు దాఖలు కాగా.. ఆ తర్వాత మరో ఆరు రోజులు వేలం ప్రక్రియ కొనసాగినా బిడ్ల విలువ పెద్దగా పెరిగిందేమీ లేకపోవడం గమనార్హం. కొన్ని సర్కిళ్లలో టెలికాం కంపెనీల మధ్య పోటీ కారణంగా వేలం ప్రక్రియ ఆలస్యమైంది.


5జీకి సంబంధించిన కథనాల కోసం క్లిక్‌ చేయండి..


 


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని