డబ్బుతో మీకు ఎటువంటి సంబంధం ఉంది?

మ‌న జీవితంలో మార్పు తెచ్చేందుకు మాత్ర‌మే డ‌బ్బు ఉప‌యోగ‌ప‌డుతుంది

Updated : 28 Apr 2021 15:10 IST

డ‌బ్బుతో సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇది విన‌డానికి వింతగా ఉన్నా, క‌చ్చితంగా ప్ర‌తి మ‌నిషికి డ‌బ్బుతో సంబంధం ఉంటుంది.  కానీ అది ఎటువంటిది అనేదే ముఖ్యం. అది ఆరోగ్య‌క‌ర‌మైన సంబంధం అయితే ఫ‌ర్వాలేదు కానీ, డ‌బ్బే జీవితంగా భావిస్తే అది మీకు ఉన్న ఇత‌ర సంబంధాల‌ను దెబ్బ‌తీస్తుంది. ఎలా అనుకుంటున్నారా ?

ఉదాహ‌ర‌ణ‌కు, ఉద్యోగం చేసే ఒక మ‌హిళ మొద‌ట ఎవ‌రి స‌హాయం లేకుండా ఇంట్లో, కార్యాల‌యంలో ఒంట‌రిగా త‌న వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణంగా భావిస్తుంది. కానీ, అదే మ‌హిళ ఒక‌ త‌ల్లి అయిన త‌ర్వాత ఇంటిని, ఉద్యోగాన్ని నిర్వ‌హించ‌లేక ఒత్తిడికి గుర‌వుతుంది. దీంతో నిరాశ ఎదుర‌వుతుంది.  పిల్ల‌ల‌తో స‌రైన స‌మ‌యం గ‌డ‌ప‌లేక‌పోతున్నానే భావ‌న ఎదుర‌వుతోంది. అలాగ‌ని త‌న‌కి ఇష్ట‌మైన ఉద్యోగం వ‌దిలేయ‌లేదు. ఒక వేళ కొంత విరామం తీసుకుంటే వృత్తిలో తిరిగి పుంజుకోగ‌ల‌నా అనే సందేహం వ‌స్తుంది. ఇలాంటి విరుద్ధ‌మైన ఆలోచ‌న‌లు మ‌న‌సును క‌ల‌వ‌ర‌పెడ‌తాయి. దీంతో జీవితంలో నిరాశ ఎదుర‌వుతుంది. 

మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా, ఇంకో మ‌హిళ త‌న ఉద్యోగం చేస్తూ, పిల్ల‌ల‌ను చూసుకుంటుంది. కానీ ఆమెకు డ‌బ్బు విష‌యంలో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక ఉంది. డ‌బ్బు ఆదా చేయ‌డ‌మే కాకుండా తెలివిగా ఖ‌ర్చు చేస్తుంది. స‌మ‌యం వృథా కాకుండా ఇంట్లో ప‌నివాళ్ల‌ను, స‌హాయ‌కుల‌ను పెట్టుకుంది. దీంతో ఆమె ఉద్యోగం నుంచి తిరిగి రాగానే ఎటువంటి ప‌నిలేకుండా పిల్ల‌ల‌తో ఎక్కువ‌సేపు గ‌డిపేందుకు స‌మ‌యం దొరుకుతుంది. వీలైన‌ప్పుడు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, స్నేహితుల‌తో మాట్లాడ‌టం వంటివి చేయ‌డంతో ఆమెకు ఎటువంటి ఒత్తిడి లేదు.

ఈ రెండు ఉదాహ‌ర‌ణ‌లను చూస్తే, వారికి డ‌బ్బుతో ఉన్న సంబంధం గురించి తెలుస్తుంది. ఒకరు డ‌బ్బు త‌క్కువ ఖ‌ర్చు పెట్టి, ఎక్కువ ప‌నిచేసి పిల్ల‌ల‌కు స‌మ‌యం కేటాయించ‌డానికి వీలుండ‌టం లేద‌ని నిరాశ‌కు గుర‌వుతుంటే, మ‌రొక‌రు ఆమె సంపాదించే అదే డ‌బ్బు ఆమె జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు త‌న స‌మ‌యం వృథా కానివ్వ‌కుండా ఉద్యోగం, పిల్ల‌ల‌ను రెండూ చూసుకునేందుకు స‌మ‌యం కేటాయిస్తున్నారు.  ఇక్క‌డ ఒక‌రికి డ‌బ్బుపై  సంకుచిత‌ మ‌న‌స్త‌త్వం ఉంటే, మ‌రొక‌రికి ఆరోగ్య‌క‌ర‌మైన సంబంధం ఉంది.

అప్ప‌ట్లో మ‌న‌ తల్లిదండ్రులకు ఆర్థిక పరిమితులు ఉన్నందున, పిల్లలలో అంటే మనలో చాలా మంది డబ్బు విష‌యంలో చాలా బాధ‌ప‌డి ఉంటారు. అంటే, సరిపడా డ‌బ్బు లేనందున  చిన్న చిన్న కోరికలకు దూరం కావడం, పొందాలనుకున్నది పొందలేకపోవడం, తల్లిదండ్రులు ఆర్ధిక ఇబ్బందులు పడటం చూస్తూ పెరగడం వంటివి చిన్న‌ప్ప‌టినుంచే మ‌న‌సులో బ‌లంగా నాటుకుపోయి ఉంటాయి. దీని ఫ‌లితంగా ఎలాగైనా డ‌బ్బును సంపాదించాల‌నే కోరిక బ‌ల‌ప‌డుతుంది. అయితే, డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు కాదు. కానీ, తెలియకుండానే దానికి బానిస  అవ్వడం మాత్రం ఆలోచించదగ్గ విషయమే.  

డ‌బ్బుని మ‌న‌కోసం ప‌నిచేసేలా చేయాలి కానీ, మ‌నం డ‌బ్బు కోసం పనిచేయ‌కూడ‌ద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోండి.  జీవితంలోని ప్రతి అంశంలోనూ ఇది వ‌ర్తిస్తుంది. డ‌బ్బు ఉండ‌టం చాలా మంచి విష‌యం. కానీ అది ఉప‌యోగ‌క‌ర‌మైన వాటికి వెచ్చిస్తేనే మంచిది. మన జీవిత శైలిలో, ఆలోచనలో, ఔదార్యం లో  మార్పుని  తీసుకురాగలిగినప్పుడే డబ్బుకి విలువ. కానీ డ‌బ్బు మీద ఇష్టంతో మ‌న చుట్టూ ఏం జ‌రుగుతుందో, ఎవ‌రిని కోల్పోతున్నామో, ఎవ‌రితో ఎంత స‌మ‌యం కేటాయిస్తున్నామో తెలుసుకోలేనంత‌గా డ‌బ్బు విష‌యంలో సంకుచిత మ‌న‌స్త‌త్వం ఉండ‌టం స‌రైన‌ది కాద‌ని ఆర్థిక నిపుణుల స‌ల‌హా. 

అయితే, బాల్యం లో డ‌బ్బు లేక ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ప‌రిస్థితుత‌లో చ‌క్క‌బ‌డ్డాక కూడా అదే విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకొని డ‌బ్బు సంపాదించ‌డ‌మే ద్యేయంగా పెట్టుకోవ‌ద్దు. మీరు డబ్బుతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో చూడటానికి కొంత సమయం కేటాయించండి. బాల్యం  లో డబ్బు గురించి మనం సమకూర్చుకున్న అభిప్రాయాలు ఇప్పుడు సరైనవేనా అని తరచి చూసుకోవడం ముఖ్యం.
 
అలా చేయడంలో మీకు సహాయపడే కొన్ని ప్రశ్నలు:

1. డబ్బు మీద‌ నా అభిప్రాయం ఏమిటి? (పొదుపరి మనస్తత్వం లేక దుబారా ఖర్చు చేసే మ‌న‌స్త‌త్వం)
2. ఇప్పుడు, పదవీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా నా కోరిక‌లు, నా కుటుంబం కోరిక‌లు, లక్ష్యాలు ఏమిటి? (దీనిపై స్పష్టత పొందడానికి మీరు సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానెర్స్ తో సంప్ర‌దించ‌వ‌చ్చు)
3. ప్రాథమిక అవసరాలు, భవిష్యత్తు కోసం పొదుపు మాత్రమే కాకుండా, నా జీవితంలో అభివృద్ధికి, నా కుటుంబం, చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయడానికి నేను ఏమి చేయగలను? (అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం లాంటివి మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి)
4. డబ్బు ద్వారానే నాకు విలువ ఉంటుంద‌ని భావిస్తున్నారా? (మీ స‌మాధానం అవును అయితే, మీకు తెలియకుండానే మీకు డ‌బ్బు విష‌యంలో త‌గిలిన గాయాలు, నమ్మకాలను ప‌రిష్క‌రించ‌డానికి లైఫ్ కోచ్ / థెరపిస్ట్‌తో  సంప్ర‌దించ‌వ‌చ్చు) 
5. చివరి రోజుల్లో, నేను వెనక్కి తిరిగి చూసుకున్న‌ప్పుడు నా జీవితాన్ని ఎలా చూడాలనుకుంటున్నాను? నేను అర్ధవంతమైన జీవితాన్ని గడిపానా లేదా?

Author:

(Krishna Priya Rayala, Life coach

కృష్ణప్రియ రాయల, లైఫ్ కోచ్)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని