Reliance: చాక్లెట్ కంపెనీలో రిలయన్స్‌ 51% వాటా కొనుగోలు

కొత్త ఏడాది రిలయన్స్‌ తీపి కబురుతో ముగించనుంది. ఈ మేరకు రియలన్స్‌ ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగం చాక్లెట్‌ కంపెనీలో మెజార్టీ వాటాను సొంతం చేసుకోనుంది. 

Published : 29 Dec 2022 23:59 IST

ముంబయి:  రిలయన్స్‌ సంస్థలోని ఎఫ్‌ఎంసీజీ విభాగం మరో కంపెనీలో మెజార్టీ వాటాను సొంతం చేసుకోనుంది. రిలయన్స్ రిటైల్‌ వెంచర్స్ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ ₹ 74 కోట్లకు లోటస్‌ చాక్లెట్ కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలింపింది. దీంతో లోటస్‌ కంపెనీకి చెందిన 65,48, 935 ఈక్వీటీ షేర్లు రిలయన్స్‌కు బదిలీ కానున్నాయి. ఈ డీల్‌తో మొత్తం 51 శాతం వాటా రిలయన్స్‌ సొంతంకానుంది. లోటస్‌ చాక్లెట్ ఒక్కో షేరుకు రిలయన్స్‌  ₹113 చెల్లించనుంది. అదనంగా మరో 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. రిలయన్స్‌ కొనుగోలు నేపథ్యంలో లోటస్‌ చాక్లెట్‌ షేరు లాభపడింది. గురువారం వరుసగా నాలుగో సెషన్‌లో 5 శాతం పెరిగి ₹ 117 వద్ద స్థిరపడింది. 

‘‘కోకో, చాక్లెట్ ఉత్పత్తుల విభాగంలో బలమైన వ్యాపారాన్ని నెలకొల్పిన లోటస్‌ చాక్లెట్ కంపెనీలో భాగస్వామ్యం అయ్యేందుకు రిలయన్స్‌ ఎంతో ఆసక్తిగా ఉంది. దేశీయంగా తయారుచేసే నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు వినియోగదారులకు అందించాలనేది ఈ పెట్టుబడుల ముఖ్య ఉద్దేశం. ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడం కోసం లోటస్ బృందంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’’ అని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. లోటస్‌ చాక్లెట్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రకాష్‌ పీ పాయ్‌, అనంత్ పీ పాయ్‌ ఈ కంపెనీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని