Jio 5G: విస్తరిస్తున్న జియో 5జీ సేవలు.. ఇక దేశ రాజధాని ప్రాంత వాసులకూ!

రిలయన్స్ జియో తన 5జీ సేవలను దేశ రాజధాని ప్రాంతంలోని మరో నాలుగు నగరాలకు విస్తరించింది. దీంతో ఎన్‌సీఆర్‌లో అన్ని నగరాలకు 5జీ సేవలు అందిస్తున్న మొబైల్‌ నెట్‌వర్క్‌గా జియో అవతరించింది. 

Published : 18 Nov 2022 22:10 IST

దిల్లీ: జియో 5జీ నెట్‌వర్క్‌ సేవలు దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లోని అన్ని నగరాలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఇకపై దిల్లీతోపాటు గుడ్‌గావ్‌, నోయిడా, ఘాజియాబాద్‌, ఫరిదాబాద్‌ నగరాల్లోని యూజర్లు జియో 5జీ సేవలను అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. దీంతో ఎన్‌సీఆర్‌లోని అన్ని నగరాలకు 5జీ సేవలను అందిస్తున్న నెట్‌వర్క్‌గా జియో అవతరించింది. ఈ ఏడాది అక్టోబరు 1న జియో తన 5జీ సేవలను దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాశిలలో ప్రారంభించింది. ఆ తర్వాత చెన్నై, నథాద్వారాలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు జియో 5జీ సేవలను విస్తరించింది. తాజాగా ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని అన్ని నగరాల్లో జియో 5జీ నెట్‌వర్క్‌ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. 

‘‘ఎన్‌సీఆర్‌లోని అన్ని నగరాలకు  5జీ సేవలను పరిచయం చేయడం మాకెంతో గర్వకారణం. జియో తన 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు కృషి చేస్తోంది.  డిసెంబరు 2023 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని రిలయన్స్‌ జియో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను ప్రారంభించాయి. ఇటీవల 5జీ వేగానికి సంబంధించి ఇంటర్నెట్‌ టెస్టింగ్ కంపెనీ ఊక్లా విడుదల చేసిన నివేదికలో 5జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడ్ వేగం 500 ఎంబీపీఎస్‌గా ఉంది. దిల్లీలో జియో డౌన్‌లోడ్ సగటు వేగం 598.58 ఎంబీపీఎస్‌గా ఉండగా, ఎయిర్‌టెల్ వేగం 197.98 ఎంబీపీఎస్‌గా ఉంది. దీంతో డౌన్‌లోడ్ స్పీడ్‌ విషయంలో జియో అగ్రస్థానంలో నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని