Reliance Jio IPO: జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియోను పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated : 06 Jul 2024 06:56 IST

దేశంలోనే అతిపెద్ద ఇష్యూ అవుతుంది

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియోను పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇష్యూ ద్వారా రూ.55,000 కోట్లు సమీకరించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇదే నిలుస్తుంది. ఇప్పటి వరకు రూ.21,000 కోట్లు సమీకరించిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది.  

టారిఫ్‌ పెంపు అందుకేనా: రిలయన్స్‌ జియో ఇటీవలే మొబైల్‌ టారిఫ్‌లు పెంచింది. ఇప్పటివరకు 4జీ టారిఫ్‌లతోనే 5జీ సేవలు అందిస్తుండగా, ఇకపై 5జీకి ప్రత్యేక టారిఫ్‌ నిర్ణయించే వీలుంది. ఇవన్నీ ఈ టెలికాం సేవల సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు ముందు కనిపించే సంకేతాలుగా భావించొచ్చని ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ రావొచ్చన్న విశ్లేషకుల అంచనాను ఉటంకించింది. 

ఆగస్టులో తెలిసే అవకాశం: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఏటా ఆగస్టులో వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్‌) నిర్వహిస్తుంటుంది. ఈసారి విశ్లేషకులు, పరిశ్రమ నిపుణులు, జియో ఐపీఓ గురించి సంస్థ అధిపతి ముకేశ్‌ అంబానీని స్పష్టత కోరే అవకాశం ఉంది. ‘టారిఫ్‌ పెంపు, 5జీ వ్యాపారంతో వచ్చే నగదుతో జియో సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెరుగుతుంది. రాబోయే త్రైమాసికాల్లో మదుపర్లకు ఇది అత్యంత ఆకర్షణీయ అంశంగా మారొచ్చ’ని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇదీ విలువ: తాజా టారిఫ్‌ పెంపు, 5జీ నగదీకరణ ప్రతిపాదన నేపథ్యంలో జియో విలువ 133 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.11.11 లక్షల కోట్లు) వరకు ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ జెఫ్రీస్‌ అంటోంది. పెద్ద కంపెనీలు తమ విలువలో కనీసం 5 శాతాన్ని, చిన్న కంపెనీలైతే 10 శాతానికి సమానమైన వాటా విలువను ఐపీఓ ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. జియో విలువ దృష్ట్యా, 5% వాటాయే రూ.55,000 కోట్లు అవుతుంది. ఇంతటి భారీమొత్తం నిధులను సమీకరిస్తే కనుక.. జియో ఐపీఓ మన దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలుస్తుందని జెఫ్రీస్‌ అంచనా వేస్తోంది. 

పీఈ సంస్థలు బయటకు వెళ్లొచ్చు: ఈ ఐపీఓ ద్వారా అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) కంపెనీలు జియోలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు 67.03% వాటా ఉంది. మిగతా 32.97 శాతంలో 17.72 శాతాన్ని మెటా, గూగుల్‌ కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పీఈ సంస్థలైన విస్టా ఈక్విటీ పార్టనర్స్, కేకేఆర్, పీఐఎఫ్, సిల్వర్‌ లేక్, ఎల్‌ కాటర్టన్, జనరల్‌ అట్లాంటిక్, టీపీజీలకు 15.25% వాటా ఉంది. 2020లో ఈ అంతర్జాతీయ పెట్టుబడిదార్ల నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌ రూ.1.52 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని