Jio laptop: జియో ల్యాప్‌టాప్‌ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!

Jio laptop: జియో ఎట్టకేలకు తన ల్యాప్‌టాప్‌ను విక్రయానికి ఉంచింది. అయితే, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే.

Published : 04 Oct 2022 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ జియో (Jio) నుంచి ఓ ల్యాప్‌టాప్‌ (Laptop) రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీంతో తొలి నుంచీ ఈ ల్యాప్‌టాప్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధర, స్పెసిఫికేషన్ల గురించి ఎప్పటి నుంచో లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆ కంపెనీ తన తొలి ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. అయితే, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. గవర్నమెంట్‌ ఇ-మార్కెట్‌ ప్లేస్‌ (GeM) పోర్టల్‌లో ప్రస్తుతానికి దీన్ని విక్రయానికి ఉంచారు. సాధారణ వినియోగదారుల కోసం ఈ దీపావళికి ఈ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనున్నారు.

జీఈఎం పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ ల్యాప్‌టాప్‌ను నెట్‌బుక్‌గా పేర్కొన్నారు. ధరను రూ.19,500గా నిర్ణయించారు. ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 అక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఇస్తున్నారు. జియో ఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ పనిచేస్తుంది. 2జీబీ ఎల్‌పీడీడీఆర్‌ 4X ర్యామ్‌ను ఇస్తున్నారు. ర్యామ్‌ను పెంచుకునే సదుపాయం ఇవ్వలేదు. 32జీబీబీ eMMC స్టోరేజ్‌ ఇస్తున్నారు.

డిస్‌ప్లే విషయానికొస్తే.. 11.6 అంగుళాల హెచ్‌డీ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్‌ యాంటీగ్లేర్‌ డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్నారు. 1366× 768 పిక్సల్‌ రెజల్యూషన్‌తో ఈ డిస్‌ప్లే అందిస్తున్నారు. టచ్‌స్క్రీన్‌ సదుపాయం లేదు. యూఎస్‌బీ 2.0 పోర్ట్‌, యూఎస్‌బీ 3.0, హెచ్‌డీఎంఐ పోర్టులు ఇస్తున్నారు. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ లేదు. వైఫై 802.11acకి ఇది సపోర్ట్‌ చేస్తుంది. బ్లూటూత్‌ 5.2, 4జీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్నారు. డ్యూయల్‌ ఇంటర్నల్‌ స్పీకర్స్‌, డ్యూయల్‌ మైక్రోఫోన్స్‌, స్టాండర్డ్‌ కీబోర్డ్‌, మల్టీ గెశ్చర్‌ సపోర్ట్‌ కలిగిన టచ్‌ప్యాడ్‌ ఇస్తు్న్నారు. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ సదుపాయం లేదు. ఇందులో అమర్చిన బ్యాటరీ 6.1 నుంచి 8 గంటల వరకు బ్యాకప్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతం 10 ల్యాప్‌టాప్‌లు మాత్రమే విక్రయానికి ఉంచినట్లు పోర్టల్‌ ద్వారా తెలుస్తోంది. అది కూడా కేవలం మహారాష్ట్రకు మాత్రమే డెలివరీలు ఇస్తున్నారు. దీపావళికి సాధారణ ప్రజలకు విడుదల చేసే ల్యాప్‌టాప్‌ ధర కూడా ఇంతే ఉంటుందా? అనేది తెలియ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ముదురు నీలం కలర్‌లో మాత్రమే పోర్టల్‌లో కనిపిస్తోంది. వేరే రంగుల్లోనూ లభిస్తుందా? లేదా? అనేది కూడా చూడాలి మరి!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని