Jio-Tesla: భారత్‌లో టెస్లా యూనిట్‌.. రిలయన్స్ జియో చర్చలు!

ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా (Tesla)తో రిలయన్స్‌ జియో (Reliance Jio) చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో టెస్లా కంపెనీ భారత్‌కు రావడం ఖరారైనట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Published : 22 May 2023 18:40 IST

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుందని గత కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో టెస్లాకు అవసరమైన ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌(5G Network)ను రిలయన్స్‌ జియో (Reliance Jio) అందిచనుందని సమాచారం. ఈ మేరకు జియో సంస్థ టెస్లా ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు కంపెనీ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. దీంతో టెస్లా కంపెనీ భారత్‌కు రావడం ఖరారైనట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

గత వారం టెస్లా సంస్థ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, టెస్లాతో రిలయన్స్ జియో చర్చలు మస్క్‌ (Elon Musk) కంపెనీ భారత్‌కు రాబోతుందనే సంకేతాలకు బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, టెస్లా తయారీ యూనిట్‌ ఎక్కడ నెలకొల్పుతుందనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటే.. జియో నెట్‌వర్క్‌పై స్పష్టత వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. టెస్లాతోపాటు త్వరలో భారత్‌కు రాబోయే ఆటోమొబైల్‌, హెల్త్‌కేర్‌, తయారీ పరిశ్రమలకు కూడా 5జీ నెట్‌వర్క్‌ అందించేందుకు ఆయా సంస్థలతో జియో చర్చలు జరుపుతోందని సమాచారం. 

ఇండస్ట్రీ 4.0 అందిపుచ్చుకోవడంలో భాగంగా పలు పరిశ్రమలు టెలికాం సంస్థలతో జట్టు కడుతున్నాయి. దీంతో ఆయా సంస్థలకు వేగవంతమైన నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా డేటా మార్పిడి సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పటికే మహీంద్రా సంస్థకు చెందిన చకాన్‌ యూనిట్‌కు 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు టెలికాం సంస్థలతో కలిసి సొంత 5జీ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని