Reliance Retail: రిలయన్స్‌ చేతికి మెట్రో ఇండియా.. రూ.2,850 కోట్లతో కొనుగోలు

మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా (Metro Cash & Carry India) కొనుగోలుతో రిలయన్స్‌ (Reliance) తమ రిటైల్‌ వ్యాపారాన్నిమరింత విస్తరించనుంది.

Updated : 22 Dec 2022 11:39 IST

దిల్లీ: దేశీయ రిటైల్‌ రంగ వ్యాపారంలో మరింత బలోపేతం అయ్యే దిశగా ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance) మరో ముందడుగు వేసింది. జర్మనీ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లో ‘మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా (Metro Cash & Carry India)’ నిర్వహిస్తున్న టోకు వ్యాపారాన్ని ఆర్‌ఐఎల్‌ చేజిక్కించుకుంది. ఈ కొనుగోలు విలువ రూ.2,850 కోట్లు. పూర్తిగా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య నిశ్చయాత్మక ఒప్పందం కుదిరింది.

మెట్రో ఇండియా 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్‌సేల్‌ పంపిణీ కేంద్రాలున్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న రిటైలర్లు వంటి బిజినెస్‌ కస్టమర్లతో ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోంది. ‘క్యాష్‌-అండ్‌-క్యారీ’ వ్యాపార నమూనాతో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. దాదాపు 3 మిలియన్ల కస్టమర్లకు సేవలందించింది. దీంట్లో 1 మిలియన్‌ కస్టమర్లు తరచూ మెట్రోతో కొనుగోళ్లు చేస్తున్నారు. 2022 సెప్టెంబరుతో ముగిసిన ఏడాది వ్యవధిలో ఈ కంపెనీ రూ.7,700 కోట్లు విలువ చేసే విక్రయాలు జరిపింది. భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత మెట్రోకు ఇదే మెరుగైన రికార్డు.

చిరు వ్యాపారులు, సంస్థల సహకారంతో వినియోగదారులకు చేరువవ్వాలనే తమ వ్యాపార నమూనాలో భాగంగానే మెట్రో ఇండియాను కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ ఇశా అంబానీ తెలిపారు. భారత B2B మార్కెట్‌లో మెట్రో పటిష్ఠమైన బహుళ-ఛానెల్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించిందన్నారు. భారత కిరాణా మార్కెట్‌పై రిలయన్స్‌కున్న లోతైన అవగాహనకు మెట్రో నెట్‌వర్క్‌ జత కలిస్తే దేశంలో చిరు వ్యాపారులకు ప్రత్యేకమైన లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని