Reliance Retail: క్విక్‌ కామర్స్‌లోకి రిలయన్స్‌ రిటైల్‌.. గంటలో డెలివరీ!

Reliance Retail: ఇతర క్విక్‌ కామర్స్‌ సంస్థల తరహాలో కాకుండా రిలయన్స్‌ రిటైల్‌ గంట వ్యవధిలో సరకులను డెలివరీ చేసే వ్యాపార నమూనాను రూపొందించింది. మరిన్ని స్టోర్లు అనుసంధానమయ్యాక.. ఇతర మార్కెట్లకు ఈ సేవలను విస్తరిస్తూ డెలివరీ సమయాన్ని 30 నిమిషాలకు కుదించే యోచనలో ఉంది.

Published : 26 Jun 2024 16:40 IST

Reliance Retail | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల వెలువడిన ఊహాగానాలను నిజం చేస్తూ రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) క్విక్‌ కామర్స్‌లోకి ప్రవేశించింది. ముంబయి, నవీ ముంబయిలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బీబీనౌ తరహాలో 10 నిమిషాల్లో ఇస్తుండగా, రిలయన్స్‌ మాత్రం గంటలో సరకులను అందించాలని నిర్ణయించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

‘హైపర్‌లోకల్‌ డెలివరీ’ పేరిట ఈ సేవలను జియోమార్ట్‌ మొబైల్‌ యాప్‌నకు అనుసంధానించారు. మరిన్ని స్టోర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత డెలివరీ సమయాన్ని 30-45 నిమిషాలకు కుదించే యోచనలో ఉన్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇతర మార్కెట్లకు విస్తరించే కొద్దీ దీన్ని మరింత సమర్థంగా అమలుచేస్తామని తెలిపారు.

జియోమార్ట్‌ (JioMart) పేరిట కొవిడ్‌ సమయంలో రిలయన్స్‌ నిత్యావసర సరకుల డెలివరీ విభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తరహాలో ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీని మాత్రం హామీ ఇవ్వలేదు. రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) భిన్నంగా 30 నిమిషాల్లో డెలివరీ చేసే వ్యాపార నమూనాను సిద్ధం చేస్తున్నట్లు గత నెలలో వార్తలు వచ్చాయి. సొంత స్టోర్లు, వాటి నుంచి కొనుగోలు చేసే కిరాణా దుకాణాల నుంచి వస్తువులను సేకరించి కస్టమర్లకు అందించే యోచనలో ఉంది. జియోమార్ట్‌ పార్ట్‌నర్‌లో భాగంగా 20 లక్షల కిరాణా దుకాణాలు రిలయన్స్‌ రిటైల్‌ హోల్‌సేల్‌ విభాగం నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో ఇతర క్విక్‌ కామర్స్‌ సంస్థల తరహాలో ప్రతీ ఏరియాలో డార్క్‌ స్టోర్లను ఏర్పాటుచేయాల్సిన అవసరం కూడా ఉండదు.

ఫైండ్‌ (FYND), లోకస్‌ వంటి మ్యాపింగ్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌ల సేవలను ఉపయోగించి వేగవంతమైన రూట్లలో 30 నిమిషాల్లో డెలివరీ చేయాలని రిలయన్స్‌ ప్లాన్‌ చేసింది. తొలుత నిత్యావసర సరకులతో సేవలను ప్రారంభించే యోచనలో ఉంది. తర్వాత దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌కూ విస్తరించనున్నట్లు సమాచారం. రిలయన్స్‌ రిటైల్‌కు ఉన్న 19,000కు పైగా స్టోర్లు అందుకు ఉపయుక్తంగా ఉండనున్నాయి. క్రమంగా దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లోనూ రిలయన్స్‌ వేగవంతమైన డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని