ఎలక్ట్రానిక్స్‌ తయారీకి జాయింట్‌ వెంచర్‌.. రిలయన్స్‌-సన్మినా డీల్‌ పూర్తి

అమెరికాకు చెందిన సన్మినా కొర్పొరేషన్‌తో గతంలో రిలయన్స్‌ అనుంబంధ సంస్థ స్ట్రాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (RSBVL) కుదుర్చుకున్న డీల్‌ తాజాగా పూర్తయ్యింది.

Published : 04 Oct 2022 13:53 IST

దిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ తయారీలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. అమెరికాకు చెందిన సన్మినా కొర్పొరేషన్‌తో గతంలో రిలయన్స్‌ అనుంబంధ సంస్థ స్ట్రాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (RSBVL) కుదుర్చుకున్న డీల్‌ తాజాగా పూర్తయ్యింది. ఈ మేరకు రెండు సంస్థలు మంగళవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ రెండు సంస్థలూ సంయుక్తంగా నెలకొల్పబోయే సంస్థ విలువ రూ.3,300 కోట్లు. ఇందులో రిలయన్స్‌కు చెందిన RSBVLకు 50.1 శాతం వాటా.. సన్మినా ఇండియా విభాగానికి 49.9 శాతం వాటా ఉండనుంది.

ఇప్పటికే ఉన్న సన్మినా కార్పొరేషన్‌ ఇండియా విభాగంలో RSBVL రూ.1670 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా యాజమాన్య హక్కులను పొందనుంది. ఈ జాయింట్‌ వెంచర్‌ రోజువారీ వ్యాపార కార్యకలాపాలను చెన్నైలోని సన్మినా యాజమాన్య బృందమే నిర్వహిస్తుంది. ఈ రంగంలో 4 దశాబ్దాల అనుభవం కలిగిన సన్మినా కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్‌ వెంచర్‌.. భారత్‌ను ఎలక్ట్రానిక్‌ మానుఫాక్చరింగ్‌ తయారీ కేంద్రంగా నిలుపుతుందని సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్కింగ్‌ (5జీ, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లు), వైద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, పారిశ్రామిక, క్లీన్‌టెక్‌, రక్షణ, ఏరోస్పేస్‌ లాంటి వివిధ రంగాలకు అవసరమైన హైటెక్‌ మౌలిక హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీ చేపట్టనున్నట్లు ప్రకటించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని