5G phones: 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా? తక్కువకే వస్తుందని కొంటే అంతే!

5g phone buying guide: 5జీ ఫోన్‌ కొనుగోలు చేయాలని అనుకునేవారు ఈ విషయాలు తెలుసుకోండి..

Updated : 04 Aug 2022 18:26 IST

5g phone buying guide: 5జీ వేలం ప్రక్రియ ముగిసింది. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. తొలుత నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దశలో చాలా మందికి వచ్చే సందేహం.. ఏ ఫోన్‌ కొనాలి? అని. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటే.. 5జీ ఫోన్‌ కొనుగోలును కొద్ది రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేవారైతే 5జీ ఫోన్‌ కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.  తక్కువ ధరకే 5జీఫోన్‌ వస్తుందని కొనుగోలు చేస్తే ఆ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి 5జీ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఏ టెల్కో ఏ బ్యాండ్‌..?

5జీ ఫోన్‌ కొనుగోలు చేసే ముందు ఏ టెలికాం కంపెనీ ఏ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మొత్తం 10 బ్యాండ్లను కేంద్రం వేలానికి ఉంచగా.. రిలయన్స్‌ జియో 700 MHz, 800 MHz, 1800 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లలో 24.740 గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రాన్ని వేలంలో సంపాదించింది. ఎయిర్‌టెల్‌ 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లలో 19.86 GHz స్పెక్ట్రాన్ని వేలంలో దక్కించుకుంది. వొడాఫోన్‌ ఐడియా 1800 MHz, 2100 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 6.22 GHz స్పెక్ట్రాన్ని కొనుగోలు చేసింది.

మనం చూడాల్సిందేంటి?

మార్కెట్‌లో 5జీ ఫోన్ల సందడి ఈ మధ్య జోరుగా కనిపిస్తోంది. ఇప్పడొస్తున్న స్మార్ట్‌ఫోన్లలో దాదాపు అన్ని ఫోన్లూ 5జీకి సపోర్ట్‌ చేస్తున్నాయి. అలాగని ఫోన్లలో ఉండే చిప్‌సెట్లూ అన్ని బ్యాండ్లకూ సపోర్ట్‌ చేయకపోవచ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేయబోయే ఫోన్‌ అన్ని బ్యాండ్లకూ సపోర్ట్‌ చేస్తుందో లేదో చూసుకోవాలి. ఫోన్‌ తయారీ కంపెనీలు ఏయే బ్యాండ్లకు తమ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుందో N అనే అక్షరంతో అది సపోర్ట్‌ చేసే బ్యాండ్‌ను సూచిస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ కొనుగోలు చేసిన బ్యాండ్లను ఈ విధంగా చూసినప్పుడు.. 700 MHz (N28), 800 MHz (N20), 900 MHz (N8), 1800 MHz (N3), 2300 MHz (N30/N40), 2500 MHz (N41), 3300 MHz (N78), 26 GHz (N258)గా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ₹20 వేల నుంచి ₹30వేల బడ్జెట్‌లో ఉండే ఫోన్లు దాదాపు అన్ని బ్యాండ్లకూ సపోర్ట్‌ చేస్తాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫోన్లు మాత్రం పరిమిత సంఖ్యలో బ్యాండ్లను మాత్రమే సపోర్ట్‌ చేస్తున్నాయి. ఒకవేళ మీరు కొత్త 5జీ ఫోన్‌ కొనాలనుకుంటే లేటెస్ట్‌గా వచ్చిన ఫోన్లను కొనడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తున్నాయని పాత ఫోన్లు కొంటే.. నిర్దేశించిన 5జీ బ్యాండ్లకు అవి సపోర్ట్‌ చేయకపోతే డబ్బులన్నీ వృథా అయినట్లే. కాబట్టి ఫోన్‌ కొనేముందు ఈ బ్యాండ్లను చూడడం మరిచిపోవద్దు.

ఇవీ చూడడం మరిచిపోవద్దు..

ఒకవేళ 5జీ సేవలను పూర్తిగా ఆనందించాలనుకుంటే నాసిరకం ఫోన్లను కొనుగోలు చేయొద్దు. కొంచెం ఖర్చుతో కూడుకున్నా.. ఖరీదైన ఫోన్లనే కొనుగోలు చేయడం ఉత్తమం. మార్కెట్లో 5జీ సందడి ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి కొద్ది రోజులయ్యాక వీటి ధరలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చు. అలాగే, 5జీ నెట్‌వర్క్‌కు ఎక్కువ బ్యాటరీ అవసరం అవుతుంది. కాబట్టి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కొనాలనుకునేవారు 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండేట్లు చూసుకోవడం మంచిది. యాపిల్‌ ఫోన్లు కొనుగోలు చేసేవారు ఐఫోన్‌ 11 సిరీస్‌ ఆ తర్వాత వచ్చిన ఫోన్లను కొనడం ఉత్తమం.

-ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని