Adani Group: అదానీ గ్రూప్‌పై నివేదిక 2 నెలల ముందే కింగ్డన్‌ చేతికి

అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా రూపొందించిన నివేదికను ప్రచురించడానికి రెండు నెలల ముందే,

Published : 08 Jul 2024 02:30 IST

హిండెన్‌బర్గ్‌పై సెబీ ఆరోపణ

దిల్లీ: అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా రూపొందించిన నివేదికను ప్రచురించడానికి రెండు నెలల ముందే, న్యూయార్క్‌ హెడ్జ్‌ ఫండ్‌ అయిన కింగ్డన్‌ క్యాపిటల్‌ చేతికి అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిందని భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆరోపించింది. ఫలితంగా ఆ సంస్థ సెల్లింగ్‌ పొజిషన్లు తీసుకుందని.. ఆ తరవాత అదానీ షేర్ల పతనమవ్వడం వల్ల కింగ్డన్‌ క్యాపిటల్‌ లాభాలు పొందిందని వెల్లడించింది. హిండెన్‌బర్గ్‌కు జారీ చేసిన 46 పేజీల షోకాజ్‌ నోటీసులో ఈ వివరాలను సెబీ పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడ్డాక, అదానీ గ్రూప్‌నకు చెందిన 10 నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ 150 బిలియన్‌ డాలర్లకు పైగా క్షీణించింది. తద్వారా హిండెన్‌బర్గ్, కింగ్డన్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌తో సంబంధం ఉన్న బ్రోకర్‌ లబ్ధి పొందారని సెబీ వివరించింది. 

  • ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం ద్వారా అదానీ గ్రూప్‌ షేర్లలో వచ్చిన భారీ అమ్మకాలను ఉపయోగించుకుని, అనైతిక లాభాలను హిండెన్‌బర్గ్‌ ఆర్జించిందని సెబీ ఆరోపిస్తోంది. వీటిపై స్పందించిన హిండెన్‌బర్గ్‌.. కేవలం తమను బెదిరించడానికే సెబీ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది. అవినీతిని, మోసాలను బయటపెట్టిన వారిని బెదిరించడానికి, భారత్‌లో ఉన్న అత్యంత శక్తిమంత వ్యక్తులను కాపాడడానికే ఈ నోటీసులని ఆరోపించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లను షార్ట్‌ చేసేందుకు తెరిచిన ఖాతాలు కోటక్‌ మహీంద్రా ఇంటర్నేషనల్‌కు చెందినవని స్పష్టం చేసింది. కింగ్డన్‌కు చెందిన కింగ్డన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం అదానీ షార్ట్‌ పొజిషన్‌లను కోటక్‌ మహీంద్రా ఇంటర్నేషనల్‌ తీసుకుంది. హిండెన్‌బర్గ్‌తో సంబంధాలు ఉన్నట్లు కింగ్డన్‌ వెల్లడించలేదని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చెబుతోంది. 
  • హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశంతో చేసినవని అదానీ గ్రూప్‌ చెబుతూ వస్తోంది. సుప్రీం కోర్టు కూడా ఈ ఏడాది జనవరిలో ‘సెబీ దర్యాప్తునకు మించి ఇతర దర్యాప్తులేవీ ఈ వ్యవహారంపై అవసరం లేదని’ స్పష్టం చేసింది. అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో చైనా హస్తం ఉందని సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ ఇటీవల ఆరోపించారు. సెబీ ఆరోపణలపై స్పందించడానికి హిండెన్‌బర్గ్‌కు 21 రోజుల సమయం ఇచ్చింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని