Health Insurance: ఆరోగ్య బీమా క‌వరేజ్ అయిపోయిందా?

రిస్టోరేష‌న్ బెనిఫిట్‌తో 100 శాతం క‌వ‌రేజ్ తిరిగి పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. 

Published : 07 Apr 2022 16:36 IST

ఆరోగ్య బీమా క‌వ‌రేజ్ ఒక్క‌ క్లెయిమ్ కే పూర్త‌య్యిందా?కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రైనా అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే..ఎలా అని ఆలోచిస్తున్నారా?ఇలాంటి సంద‌ర్భంలో మ‌ళ్లీ 100 శాతం క‌వ‌రేజ్ పొందేందుకు స‌హాయ‌ప‌డేదే రిస్టోరేష‌న్ బెనిఫిట్ (పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌నం). 

రిస్టోరేష‌న్ బెనిఫిట్ అంటే..
పాల‌సీదారుడు.. ఒక సంవత్స‌రంలో పాల‌సీకి సంబంధించిన హామీ మొత్తాన్ని పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ క్లెయిమ్ చేసుకున్న‌ప్ప‌టికీ, మ‌రోసారి వినియోగించుకునేందుకు వీలుగా అసలు బీమా హామీ మొత్తాన్ని పున‌రుద్ధ‌రిస్తారు. దీనినే 'రిస్టోరేష‌న్ బెనిఫిట్' అంటారు.

సాధార‌ణ బీమా పాల‌సీతో పాటు రిస్టోరేష‌న్ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌డం ద్వారా ఆరోగ్య బీమా ర‌క్ష‌ణ‌ను పెంచుకోవ‌చ్చు. ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం, ఆసుప‌త్రిలో చేర‌డం, ఇత‌ర ఆరోగ్య సంర‌క్ష‌ణకు అయిన‌ ఖ‌ర్చుల కార‌ణంగా ఒక సంవ‌త్సంలో పాల‌సీ ద్వారా వ‌చ్చే హామీ మొత్తాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా గానీ వినియోగించుకున్న‌ప్ప‌టికీ, వంద శాతం హామీని తిరిగి పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. 

ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక కుటుంబంలో న‌లుగురు లేదా ఐదుగురు.. ఇలా ఎంత మంది స‌భ్యులున్నా.. వ‌యసుతో సంబంధం లేకుండా..ప్ర‌తీ ఒక్క‌రికి ఆరోగ్య బీమా చేయించ‌డం అవ‌స‌రమే. అయితే,  విడివిడిగా పాలసీ తీసుకోవడం ఖరీదైన‌ వ్యవహారం. కుటుంబ సభ్యుల్లో చిన్న వయసువారు, ఆరోగ్యవంతులు ఉంటే ఈ ప్రీమియం అనేది అనవసరపు ఖర్చుగా అనిపించవచ్చు. ఇలాంటి విషయాలను అధిగమిస్తూ, త‌క్కువ ప్రీమియంతో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ బీమా స‌దుపాయాన్ని అందించేదే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ. 

ఇక్కడ కుటుంబంలోని స‌భ్యులంద‌రికీ బీమా హామీ వ‌ర్తిస్తుంది. అయితే, ఏదైనా అనారోగ్య కార‌ణం చేత ఒక స‌భ్యుడు ఆసుపత్రిలో చేరితే, బీమా హామీలో చాలా వ‌ర‌కు ఆ కుటుంబ స‌భ్యుని వైద్య ఖ‌ర్చుల‌కే స‌రిపోతుంది. ఈ సంద‌ర్భంలో ఆ సంవ‌త్స‌రం మొత్తం ఆ స‌భ్యునితో పాటు మిగిలిన వారికి బీమా ర‌క్ష‌ణ ఉండ‌దు. అలాంటి సమయంలో, రిస్టోరేష‌న్ ప్ర‌యోజ‌నక‌రంగా ఉంటుంది, ఎందుకంటే, సంస్థ బీమా మొత్తాన్ని వెంటనే పునరుద్ధరిస్తుంది, కాబ‌ట్టి అదే సభ్యునికి లేదా కుటుంబంలోని ఇతర సభ్యులకు సంబంధించిన వైద్య ఖ‌ర్చుల కోసం, అదే పాల‌సీని మళ్లీ క్లెయిమ్ చేయవచ్చు. 

రిస్టోరేష‌న్ బెనిఫిట్ - ర‌కాలు..
రిస్టోరేష‌న్ బెనిఫిట్‌తో పాల‌సీల‌ను తీసుకుంటే ప్రీమియం కొంత వ‌ర‌కు పెరుగుతుంది. ఇది రెండు ర‌కాలుగా అందుబాటులో ఉంది. పాల‌సీ తీసుకున్న స‌మ‌యంలోనే కావాల్సిన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.  

1. పూర్తి క‌వ‌రేజ్ క్లెయిమ్ చేసుకుంటే..
పాల‌సీకి సంబంధించిన హామీ మొత్తాన్ని పూర్తిగా క్లెయిమ్ చేసుకున్న‌ప్పుడు మాత్ర‌మే.. తిరిగి పున‌రుద్ధ‌రిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కి, మీరు తీసుకున్న ఆరోగ్య బీమా హామీ మొత్తం రూ. 5 ల‌క్ష‌లు, రూ. 4 ల‌క్ష‌లు ఇప్ప‌టికే క్లెయిమ్ చేసుకున్నారు. ఇంకా రూ. 1 ల‌క్ష హామీ మొత్తం ఉంటుంది కాబ‌ట్టి రెండో క్లెయిమ్ విష‌యంలో పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌నం ల‌భించ‌దు. ఒక‌వేళ రూ. 5 ల‌క్ష‌లు వినియోగించుకుని ఉంటే హామీ మొత్తం పూర్తిగా పున‌రుద్ధ‌రిస్తారు. 

2. పాక్షికంగా క్లెయిమ్ చేసుకుంటే..
పాల‌సీకి సంబంధించిన హామీ మొత్తంలో కొంత భాగాన్ని క్లెయిమ్ చేసుకుంటే..హామీ మొత్తాన్ని తిరిగి పున‌రుద్ధ‌రిస్తారు. పైన తీసుకున్న ఉదాహరణ ప్రకారం మీరు ఇప్ప‌టికే రూ. 4 ల‌క్ష‌లు క్లెయిమ్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంలో పాక్షికంగా క్లెయిమ్ చేసుకున్నారు. భ‌విష్య‌త్తు క్లెయిమ్‌ల కోసం 100 శాతం హామీని పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. 

ప్ర‌యోజ‌నాలు..
* అదే పాల‌సీ సంవ‌త్స‌రంలో మీ పాల‌సీ కింద‌ అద‌న‌పు హామీ మొత్తం పొంద‌వ‌చ్చు. 
* 'ఇన్-బిల్ట్ రిస్టోరేష‌న్ బెనిఫిట్‌'తో లభించే ఆరోగ్య బీమా ప్లాన్‌ల విషయంలో, అదనపు ప్రీమియం చెల్లించకుండానే అదనపు కవరేజీని పొందగలరు.
* పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌నంతో వైద్య‌ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌కు సిద్ధంగా ఉండ‌వ‌చ్చు.  
* ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ల‌లో ఒక‌రి కోసం క‌వ‌రేజ్‌ని క్లెయిమ్ చేస్తే.. రిస్టోరేష‌న్‌తో మిగిలిన కుటుంబ స‌భ్యుల‌కు క‌వ‌రేజ్ ల‌భిస్తుంది. 

గుర్తుంచుకోండి..
రెండు భిన్న వ్యాధుల‌కు మాత్ర‌మే రిస్టోరేష‌న్ ప్ర‌యోజ‌నం అందుబాటులో ఉంటుంది. అలాగే, పున‌రుద్ధ‌ర‌ణ భ‌విష్య‌త్తు క్లెయిమ్‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. పాల‌సీ తీసుకున్న సంవ‌త్స‌రంలో మొద‌ట చేసిన క్లెయిమ్‌కి మ‌రోసారి వ‌ర్తించ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని