F.I.R.E. Method: 40ల్లోనే రిటైర్ కావాలంటే మీరు ‘ఫైర్‌’ అవ్వాల్సిందే!

ఫైర్‌ అంటే ‘ఫైనాన్షియల్‌ ఇండిపెండెన్స్‌, రిటైర్‌ ఎర్లీ’. అంటే త్వరగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధిస్తే త్వరగా రిటైర్‌ అవ్వొచ్చన్నదే దీని ప్రధానోద్దేశం....

Updated : 27 May 2022 12:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిటైర్‌మెంట్‌ (Retirement) అనగానే చాలా మంది 60 ఏళ్ల తర్వాత జీవితమే అనుకుంటుంటారు. ఆ వయసులో పింఛను తీసుకుంటూ మలిదశ జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటారు. కానీ, ఉన్న ఒక్క జీవితంలో మన కలలన్నింటినీ రిటైర్‌మెంట్‌  తర్వాత నిజం చేసుకోవడం సాధ్యమేనా? ఉద్యోగమో లేక వ్యాపారమో చేసే సమయంలో ఉండే బరువు, బాధ్యతల వల్ల ఎలాగూ కొన్ని మనసుకు నచ్చిన పనుల నుంచి దూరంగా ఉండాల్సిందే. మరి రిటైర్‌మెంట్‌ (Retirement) తర్వాత కూడా వాటిని సుసాధ్యం చేసుకోలేకపోతే ఇంకెప్పుడు మరి? దానికి ఏకైక పరిష్కారం తొందరగా రిటైర్‌ కావడం..

రిటైర్‌మెంట్‌ (Retirement)కు వయసుతో పనిలేదు. ఏ వయసులోనైనా సరే.. మిగతా జీవిత అవసరాలకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చి పెట్టుకోగలిగితే చాలు. ఎంచక్కా ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి విరమణ పొందొచ్చు. ఆ వనరుల నుంచి వచ్చే ఆదాయంతో ఆనందంగా గడిపేయొచ్చు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఫైర్‌ (F.I.R.E) ఉద్యమం. ఫైర్‌ అంటే ‘ఫైనాన్షియల్‌ ఇండిపెండెన్స్‌, రిటైర్‌ ఎర్లీ’. అంటే త్వరగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధిస్తే త్వరగా రిటైర్‌ అవ్వొచ్చన్నదే దీని ప్రధానోద్దేశం. ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేయగలిగితే 40 ఏళ్ల వయసొచ్చే సరికి రిటైర్‌మెంట్‌ (Retirement) తీసుకోవచ్చు.

ఫైర్‌లోని కీలకాంశాలు..

  • మీ ఆదాయంలో 50-70% పొదుపు చేయాలి
  • మితంగా ఖర్చు చేస్తూ కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి
  • మీ పొదుపును తెలివిగా మదుపు చేయాలి

ఈ మూడే ఫైర్‌ (F.I.R.E)కి ఆధారం. ఎక్కువ పొదుపు చేసి, తక్కువ ఖర్చు పెట్టి, తెలివిగా మదుపు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అసలు దీని వెనకున్న గణితమేంటో ఓసారి చూద్దాం..

ఫైర్‌ వెనకున్న లెక్కలివే..

ఫైర్‌ (F.I.R.E) వెనకున్న లెక్కల్ని అర్థం చేసుకోవాలంటే.. రెండు ప్రధాన ప్రశ్నలకు సమాధానం కావాల్సి ఉంటుంది. ఒకటి.. రిటైర్‌ అయిన తర్వాత జీవితాన్ని గడపడానికి మీకు ఎంత మొత్తం కావాలి? రెండోది.. మీరు ఎంత త్వరగా రిటైర్‌ (Retire) కావాలనుకుంటున్నారు? రెండో ప్రశ్నకు సమాధానం చాలా సులువు. ముందు మొదటి దానిపై దృష్టి సారిద్దాం..

రిటైర్‌ (Retire) అయిన తర్వాత జీవితాన్ని గడపడానికి ఎంత డబ్బు కావాలనేది నెలకు మీరు ఎంత ఖర్చు చేస్తారనేదానిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని 4% రూల్‌ ద్వారా త్వరగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ.5 కోట్లతో రిటైరయ్యారనుకుందాం! అంటే మీరు ఏడాదికి రూ.20 లక్షల వరకు ఉపయోగించుకోవచ్చు. లేదా 4% అంటే 25 రెట్లని అర్థం. అంటే మీరు ఏటా ఖర్చు చేసే మొత్తానికి 25 రెట్ల ఆదాయంతో రిటైర్‌ (Retire) కావాలి. అయితే, మన ఖర్చుల్ని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే అది మరింత పెరుగుతంది. అలాగే ఈ సొమ్మును ఏటా 7 శాతం ఆదాయం వచ్చే పెట్టుబడిమార్గాల్లో మదుపు చేయాలి. అప్పుడే మీరు అనుకున్న ఫైర్‌ (F.I.R.E) ఫలితాలిస్తుంది. మరి ఫైర్‌లోని మూడు అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం..

50-70 శాతం పొదుపు

ప్రతినెలా మీ ఆదాయంలో 50-70% పొదుపు చేయాలి. మనం సాధారణంగా చేసే 15-20 శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అద్దె, ఆహారం, పిల్లల చదువుల ఖర్చు, గృహరుణం.. వంటి కచ్చితమైన ఖర్చులుండేవారికి ఇంతమొత్తం పొదుపు చేయడం కష్టమే. కానీ, కనీసం దీని దరిదాపుల్లోకైనా వస్తే మంచిది. లేదంటే మీ ఆదాయాన్నైనా పెంచుకోవాలి. అందుకోసం సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. పార్ట్‌టైం జాబ్‌, మంచి వేతనం కోసం తరచూ కంపెనీలు మారడం, ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాల్ని పుణికిపుచ్చుకొని ఉద్యోగంలో ఉన్నతస్థాయికి వెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించాలి.

మితంగా ఖర్చు చేయడం

అత్యవసరమైనవాటిపైనే ఖర్చు చేయాలి. అలాగే ఖర్చు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలి. సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనడం, ప్రజారవాణాను వినియోగించడం, బయటి ఆహారం పూర్తిగా తగ్గించడం, రెస్టారెంట్లు, క్రెడిట్‌కార్డులు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరంగా ఉండడం వంటి కఠిన నియమాలను పాటించాల్సిందే. రిటైర్‌మెంట్‌ (Retirement) తర్వాత జీవితాన్ని ఆనందించాలంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకు దూరంగా ఉండక తప్పదు మరి!

తెలివిగా మదుపు

ఫైర్‌ (F.I.R.E)లోని చివరి వ్యూహం డబ్బుని తెలివిగా మదుపు చేయడం. వీలైనంత ఎక్కువ డబ్బుని ఎక్కువ రాబడినిచ్చే, సురక్షితమైన మదుపు మార్గాల్లోకి మళ్లించాలి. సేవింగ్స్‌ అకౌంట్‌ వంటి సాధారణ పద్ధతుల్ని అవలంబించొద్దు. సూచీ ఫండ్‌లు, ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్లు మదుపునకు సరిగ్గా సరిపోతాయి.

2010 తర్వాత ఈ ఫైర్‌ పద్ధతి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని అనుసరించి కొంతమంది 30లలో రిటైర్‌ అయినవారు కూడా ఉన్నారు. అయితే, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే వరకు చాలా వరకు ఆనందాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. పైగా ఇది పూర్తిగా ఒక వ్యక్తి అవసరాలు, బాధ్యతలు, లక్ష్యాలతో ముడిపడి ఉన్న అంశం. అలాగే ఎక్కవ రాబడి కోసం ఎక్కడ పెట్టుబడి పెడతారనేది కూడా చాలా ముఖ్యం. అవన్నీ కలిసొస్తేనే ఫైర్‌తో త్వరగా రిటైర్ కావొచ్చు. లేదంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని