Retirement Plan: పదవీ విరమణ ప్రణాళిక ఎలా ఉండాలి?

ఎవరికైనా వారి పదవీ విరమణ అనంతరం ఆనందకరమైన, ప్రణాళికబద్ధమైనా జీవితాన్ని గడపడానికి.. ముందు నుంచీ తగిన పదవీ విరమణ ప్రణాళికను అమలు చేయడం ఎంతో అవసరం.

Updated : 06 Jul 2024 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదవీ విరమణ అనేది జీవితంలో ఎవరికైనా ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది పని జీవితం నుంచి విశ్రాంతి కాలానికి మారడాన్ని సూచిస్తుంది. కానీ, చాలామంది పదవీ విరమణ అనంతరం ఖర్చులను తట్టుకోవడానికి తగిన ప్రణాళికతో ఉండరు. భారత్‌లో మెజారిటీ ప్రజలకు పదవీ విరమణ కోసం ఎలా ప్లాన్‌ చేయాలో ఇప్పటికి తెలియదు. ఇటీవల ఒక ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నిర్వహించిన సర్వే ప్రకారం.. నలుగురిలో ముగ్గురు భారతీయులు తమ పదవీ విరమణ కోసం పొదుపు చేయడంలో విఫలమవుతున్నారని తేలింది. ఇలాంటి వారు చివరి సంవత్సరాల్లో పిల్లలపై ఆధారపడుతున్నారు. అందుకే పటిష్ఠమైన పదవీ విరమణ పెట్టుబడి ప్రణాళిక ఎవరికైనా అవసరం. పదవీ విరమణ ప్రణాళిక అనేది ఒక ఆర్థిక నిర్వహణ మాత్రమే కాదు. ఇది రిటైరైన వ్యక్తి భవిష్యత్‌ను ఆర్థిక కష్టాలను ఎదుర్కోకుండా జీవితాన్ని గడపడానికి తగిన స్వేచ్ఛను ఇస్తుంది. పదవీ విరమణ ప్రణాళిక ఆర్థిక భద్రతకు మించిన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందుచేత, పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా సురక్షితమైన, సంతృప్తికరమైన జీవితం గడపడానికి కచ్చితమైన పదవీ విరమణ ప్రణాళిక అవసరం.

పదవీ విరమణ ప్రణాళిక

వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వం, స్వాతంత్ర్యం కోసం పదవీ విరమణ ప్రణాళిక చాలా కీలకం. పెరుగుతున్న ఆయుర్ధాయం, కుటుంబాలు చిన్నవి కావడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సురక్షితమైన పదవీ విరమణ జీవితాన్ని ప్లాన్‌ చేయడం చాలా అవసరం. పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం రావడం ఆగిపోతుంది. సంవత్సరాల తరబడి సేకరించిన పొదుపు మాత్రమే ఆదాయ వనరుగా మిగులుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ పదవీ విరమణ తర్వాత జీవితం కోసం బాగా ఆలోచించదగిన పదవీ విరమణ ప్రణాళికను కలిగి ఉండాలి. పనిచేసే ఉద్యోగ జీవితం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సౌకర్యవంతమైన జీవనశైలిని అనుభవించడంలో పదవీ విరమణ ప్రణాళిక కీలకపాత్ర పోషిస్తుంది.

పదవీ విరమణ ప్రణాళిక ఎందుకు అవసరమంటే.. ఇది పదవీ విరమణ తర్వాత క్రమమైన ఆదాయం లేనప్పుడు, పాత జీవనశైలి ఏ మాత్రం తగ్గకుండా కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. పదవీ విరమణ జీవితంలో ఆరోగ్య సంరక్షణ, ప్రయాణాలు, విశ్రాంతి కార్యకలాపాలు వంటి ఖర్చులను కవర్‌ చేయడానికి గణనీయమైన పొదుపు అవసరం. పదవీ విరమణ నిధిని నిర్ణయించేటప్పుడు మీ ప్రస్తుత జీవనశైలి, అభిరుచులు, ఆసక్తులు, పదవీ విరమణ తర్వాత మీ అవసరాలు, మీపై ఆధారపడిన వారి సంఖ్య మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు.

ఆయుర్ధాయం 

పదవీ విరమణ తర్వాత జీవించే కాలం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వైద్యరంగ పురోగతి వల్ల పురుషులు, మహిళలు అందరికీ ఆయుర్ధాయం పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ విధానాలు మెరుగవ్వడం వల్ల జనాభాలో సగానికి పైగా 78, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలు, జీవనశైలిలో మార్పులు వల్ల ఆయుర్ధాయంలో పెరుగుదల భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. దాంతో అధిక కాలం జీవన వ్యయంతో పాటు ద్రవ్యోల్బణం కూడా కాలక్రమేణా పెరుగుతుంది. పదవీ విరమణ చెందినవారు ఎంత ఎక్కువ కాలం జీవిస్తారో, అంత డబ్బు అవసరం అవుతుంది. సుదీర్ఘ జీవితకాలం కోసం సిద్ధం కావడానికి ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్య సంరక్షణ

పదవీ విరమణ తర్వాత జీవన వ్యయాలలో వైద్య, ఆరోగ్య రంరక్షణ ఖర్చులు చాలా ముఖ్యమైన అంశం. ఆదాయంలో దాదాపు 15%-20% ఖర్చులు రూపంలో సాధారణ ఆరోగ్య సంరక్షణ కోసం అవుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయే గానీ తగ్గవు. ప్రతి రోజూ మందులు, ఆరోగ్య పరీక్షలు, ట్రీట్‌మెంట్స్‌, కొన్ని దశల్లో ఒక మెడికల్‌ అటెండెంట్‌ను కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఖర్చులను ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలి. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం దాదాపు 14%. అందువల్ల పదవీ విరమణ కోసం ప్లాన్‌ చేస్తున్నప్పుడు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం ప్రత్యేక నిధిని కలిగి ఉండడం చాలా అవసరం.

పెట్టుబడి ఎక్కడ

పదవీ విరమణ ప్రణాళికకు అనువైన వివిధ పెట్టుబడి మార్గాలున్నాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), ఎంప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌), నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) వంటి స్థిర రాబడిని అందించే పన్ను ప్రయోజనాన్ని అందించే సంప్రదాయ పథకాలు ఉన్నాయి. ఈక్విటీ-లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లు ఎక్కువ రిస్క్‌తో ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా అధిక రాబడికి అవకాశం ఉంటుంది. ఇంకా మ్యూచువల్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం కూడా ఎక్కువ పదవీ విరమణ నిధిని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు యాన్యుటీ రిటైర్మెంట్‌ ప్లాన్‌లో పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. వివిధ పథకాల మదుపు డిపాజిట్లు కాంపౌండింగ్‌ ప్రయోజనంతో పెట్టుబడులపై స్థిరమైన రాబడిని అందిస్తాయి. అయితే, రిస్క్‌ను తగ్గించడానికి, రాబడిని పెంచుకోవడానికి మీ పెట్టుబడులను వైవిధ్యపర్చడం చాలా కీలకం.

ముందుగానే మదుపు

పదవీ విరమణ కోసం ప్లాన్‌ చేస్తున్నప్పుడు మీ పెట్టుబడులను వ్యూహాత్మకంగా లెక్కించడం అవసరం. మీ పదవీ విరమణ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, విరమణ అనంతరం ఎంత డబ్బు అవసరమో లెక్కించడం, దీనికి పొదుపులను పెంచుకోవడానికి పెట్టుబడులు పెట్టడం వంటివి ఈ ప్రణాళికలో ఉండాలి. పదవీ విరమణ ప్రణాళికలో మదుపును క్రమశిక్షణతో ముందుగానే ప్రారంభించడం ద్వారా అధిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు. కాలక్రమేణా గణనీయమైన పదవీ విరమణ నిధిని సమకూర్చుకోవచ్చు. ఉపాధి పొందిన ప్రారంభంలోనే వీలైనంత త్వరగా పదవీ విరమణ వ్యూహాన్ని అమలు చేయడం ఎవరికైనా ఉత్తమం.

ఉదాహరణకు 30వ ఏటనే ప్రతి నెలా రూ.10 వేలను మదుపు చేయడం ఆరంభించి 60 సంవత్సరాలు వయసు వచ్చేవరకు మదుపు కొనసాగిస్తే 12% రాబడితో దాదాపు రూ.3.53 కోట్లు సమకూర్చుకోవచ్చు. అదే 40వ ఏటన రూ.10 వేలతో మదుపు ప్రారంభిస్తే రూ.1 కోటి మాత్రమే సమకూర్చుకునే వీలుంది. ఆలస్యం చేసేకొద్దీ సమకూర్చుకునే నిధి తగ్గిపోతుంది. దీనివల్ల దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా పదవీ విరమణ పొందినవారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా వారి జీవన నాణ్యతపై రాజీ పడాల్సి ఉంటుంది.

అత్యవసర నిధి

పనిచేసేటప్పుడే కాదు పదవీ విరమణ చెందిన తర్వాత కూడా అత్యవసర నిధి అవసరం చాలా ఎక్కువ పడుతుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం చాలా సాధారణం. ఈ వయసు వారికి ఆరోగ్య బీమా ఉన్న అనేక షరతులు, నియమ నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి, దాని మీద పూర్తిగా ఆధారపడలేం. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తితే, తగిన చికిత్సను పొందడానికి ఎవరికైనా డబ్బు అవసరం కావచ్చు. సరైన పదవీ విరమణ ప్రణాళికతో, ఊహించని పరిస్థితులను నిర్వహించడానికి అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి.

రుణ బకాయిలు

పదవీ విరమణ ప్రణాళిక.. ఆర్థిక భద్రతకు మించిన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మీ పదవీ విరమణ అనంతర జీవనశైలిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేలా చేయడానికి ప్రతి ఒక్కరూ 60 ఏళ్లు వచ్చేనాటికి రుణ రహితంగా పదవీ విరమణ చేయాలనే లక్ష్యంతో ఉండాలి. ప్రత్యేకించి అధిక వడ్డీ వసూలుజేసే క్రెడిట్‌ కార్డు రుణాలు, కారు, తనఖా రుణాలు, పిల్లల విద్యా రుణాలు వంటి లేకుండా చూసుకోవాలి. మీ పదవీ విరమణ తర్వాత రుణ బకాయిలు లేకుండా చూసుకోవడం ఎంతో ఆర్థిక భద్రతనిస్తుంది. దీనివల్ల మనశ్శాంతి లభించడమే కాకుండా, అభిరుచులు, ఆసక్తులను చివరి వరకు కొనసాగించడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. మీ వారసులపై ఆర్థిక భారం పడకుండా చూసుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని