పెట్టుబ‌డులే కాదు..రాబడి చాలా ముఖ్యం

వయసుతో పాటు అనుభవం, ఆదాయం పెరుగుతాయి . కాబట్టి, ప్రతి సంవత్సరం మదుపును కొంత శాతం పెంచుకుంటూ , మదుపు చేయాలి........

Updated : 01 Jan 2021 16:50 IST

వయసుతో పాటు అనుభవం, ఆదాయం పెరుగుతాయి . కాబట్టి, ప్రతి సంవత్సరం మదుపును కొంత శాతం పెంచుకుంటూ , మదుపు చేయాలి.

ప్రతి ఒక్కరికి ఎదో ఒక లక్ష్యం ఉంటుంది . దీని కోసం ప్రతి ఒక్కరు సంపాదన మొదలైన నాటినుంచి ఒకటి లేదా వివిధ పథకాలలో మదుపు చేస్తుంటారు. మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు రాబడి, భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. వీటిలో ముఖ్యమైనది రాబడి. ద్రవ్యోల్బణం కన్నా రాబడి ఎక్కువ ఉండాలి. ద్రవ్యోల్బణం కన్నా రాబడి తక్కువగా ఉంటె, అసలు కూడా నష్టపోతాం.

ఉదా : ఒక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటే , మనం చేసే పెట్టుబడికి6 శాతం పైన రాబడి ఉంటేనే , వచ్చే ఏడాదికి మన పెట్టుబడి విలువ అంతే ఉంటుంది. ఈ ద్రవ్యోల్బణం వస్తు సేవలను బట్టి మారుతుంటుంది. ద్రవ్యోల్బణం వైద్య ఖర్చులకు 10 శాతం ఉంటె, విద్యా ఖర్చులకు 8-9 శాతం, ఇళ్లపై 5-7 శాతంగా ఉంటాయి.
అందుకనే ఆర్ధిక లక్ష్యాలకు అనుగుణంగా మదుపు చేయాలి. అలాగే మదుపును ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఉండాలి. పెరిగిన ఆదాయానికి తగినట్లుగా మదుపు చేయాలి. ప్రతి ఏడూ చేసిన పెట్టుబడులను సమీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే, మన ఆదాయంలో వచ్చిన మార్పుల వల్ల ,జీవన ప్రమాణాలలో మార్పు తోపాటు ఆర్ధిక లక్ష్యాలలో, చేసే మదుపు పథకాలలో, వడ్డీ రేట్లలో మార్పుల వలన రాబడిలో కూడా మార్పు వస్తుంది.

మనం చేసే పెట్టుబడి కాలాన్ని అనుసరించి రాబడిలో మార్పు ఉంటుంది. స్వల్పకాలంలో కన్నా దీర్ఘకాలంలో మదుపు చేయడం ద్వారా చక్రవడ్డీ ప్రభావంతో ఎక్కువ మొత్తం పొందవచ్చు. ఈ కింది పట్టిక ద్వారా ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని జమ చేయడం ద్వారా వివిధ రాబడి అంచనాలతో ఎంత మొత్తం లభిస్తుందో చూద్దాం.
పట్టికలో చూపించిన ప్రకారం నెలకు రూ . 5 వేలను 3 ఏళ్ల పాటు మదుపు చేస్తే 36 నెలల తరువాత 6 శాతం రాబడి అంచనాతో రూ 1,97,664 పొంద వచ్చు. ఈ సమయంలో పెట్టిన మొత్తం పెట్టుబడి రూ. 1,80,000. అంటే రాబడి రూ. 17,664 .
అదే రూ 5 వేలను 10 ఏళ్ళు మదుపు చేస్తే 120 నెలల తరువాత 6 శాతం రాబడి అంచనా తో రూ. 8,23,494 పొందవచ్చు. ఈ సమయంలో పెట్టిన మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షలు . అంటే రాబడి రూ. 2,23,494 .

ఈ విధంగా నెలకు రూ 5 వేలు చొప్పున వివిధ కాలపరిమితులకు మదుపు చేస్తే , 6%, 8%, 10% 12% ల అంచనా రాబడితో ఎంత పొందవచ్చో తెలుసుకోవచ్చు.

వయసుతో పాటు అనుభవం, ఆదాయం పెరుగుతాయి . కాబట్టి, ప్రతి సంవత్సరం మదుపును కొంత శాతం పెంచుకుంటూ , మదుపు చేయాలి. దీనివలన అధిక మొత్తం ఎంత పొందవచ్చో మరో కధనంలో చూద్దాం.

retaa.jpg

retbb.jpg

మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలంలో అంటే 10 ఏళ్ళు ఆ పైన చేస్తే మంచి రాబడి పొందొచ్చు. స్వల్పకాలంలో పెట్టుబడికి నష్టం కూడా రావచ్చు. స్వల్పకాలిక పెట్టుబడులకు రికరింగ్ డిపాజిట్, ఫిక్సెడ్ డిపాజిట్ మంచిది. అందువలన 3,5 ఏళ్ల కాలానికి అధిక రాబడిని సూచించడంలేదు
ముగింపు:
సంపాదన మొదలైన నాటినుంచే మదుపు మొదలు పెట్టాలి. మదుపు చేయడం ఒక అలవాటుగా మారాలి. పట్టుదల, క్రమశిక్షణతో మీ ఆర్ధిక ప్రణాళికలను సునాయాసంగా చేరుకోవచ్చు. జీతం వచ్చిన వెంటనే ముందు మదుపు చేసి, మిగిలిన దానినే ఖర్చుచేయాలి. ఆ విధంగా నెలవారీ బడ్జెట్ రూపొందించుకోవాలి. డబ్బు ఉండటం వలన మనో ధైర్యం పెరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని