Term Policy: టర్మ్‌ పాలసీ.. అన్ని వివరాలూ చెప్పండి..!

నేను ప్లాటు కొనాలని అనుకుంటున్నాను. దీనికోసం నా దగ్గరున్న మొత్తంతో పాటు మరో రూ.5 లక్షలు కావాలి. నెలకు రూ.12,500 వరకూ

Published : 30 Jun 2022 15:23 IST

నేను ప్లాటు కొనాలని అనుకుంటున్నాను. దీనికోసం నా దగ్గరున్న మొత్తంతో పాటు మరో రూ.5 లక్షలు కావాలి. నెలకు రూ.12,500 వరకూ వీపీఎఫ్‌లో జమ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన మొత్తాన్ని ఈపీఎఫ్‌ నుంచి వెనక్కి తీసుకోవచ్చా? లేకపోతే వ్యక్తిగత రుణం తీసుకోవడం మేలా? ఏం చేయాలి? 

- సంతోశ్

ద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నుంచి ప్లాటు కొనుగోలు కోసం డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. అయితే, మీరు అయిదేళ్లకు మించి ఈపీఎఫ్‌లో కొనసాగుతూ ఉండాలి. అప్పుడు మీకు స్థలం కొనేందుకు అర్హత ఉంటుంది. ఈపీఎఫ్‌ నుంచి డబ్బు వస్తే.. దానికే ప్రాధాన్యం ఇవ్వండి. వ్యక్తిగత రుణంపైన వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కొన్ని అదనపు ఛార్జీలూ భరించాలి. ఒకవేళ ఈపీఎఫ్‌ నుంచి డబ్బు రాకపోతే అప్పుడు వ్యక్తిగత రుణం తీసుకోండి. ఈపీఎఫ్‌ నుంచి వెనక్కి తీసిన మొత్తాన్ని భర్తీ చేసేందుకు, వీపీఎఫ్‌ను పెంచుకోవడం, లేదా ఏదైనా పెట్టుబడి పథకంలో మదుపు చేయండి.


మా అమ్మాయి వయసు రెండేళ్లు. తన భవిష్యత్‌కు ఉపయోగపడేలా.. నెలకు రూ.10వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాం. నష్టభయం తక్కువగా ఉండే పథకాలు ఏమున్నాయి?  

- రాజేంద్ర

ముందుగా మీ అమ్మాయి అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుతో తగిన జీవిత బీమా తీసుకోండి. తన భవిష్యత్‌ అవసరాలు తీర్చడానికి, మీరు పెట్టే పెట్టుబడిపై మంచి రాబడిని ఆర్జించడం ఎంతో ముఖ్యం. దీనికి నష్టభయం లేని పెట్టుబడులతో పాటు.. కాస్త నష్టభయం ఉన్న పథకాలూ ఎంతో అవసరం. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో రూ.5వేలను సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. మిగతా రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. ఇలా చేయడం వల్ల 20 ఏళ్లపాటు నెలకు రూ.10వేలు జమచేస్తూ వెళ్తే.. 10శాతం రాబడి అంచనాతో దాదాపు రూ.68,73,000 అయ్యేందుకు అవకాశం ఉంది. నష్టభయం లేని పెట్టుబడుల్లో పోస్టాఫీసులో కిసాన్‌ వికాస పత్రం, టర్మ్‌ డిపాజిట్‌, బ్యాంకుల్లో రికరింగ్‌ డిపాజిట్‌ లేదా ఎఫ్‌డీలను ఎంచుకోవచ్చు. వీటిపైన వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దీంతోపాటు వడ్డీపైన పన్ను వర్తిస్తుంది.


నా వయసు 47 ఏళ్లు. ఇప్పుడు రూ.కోటి టర్మ్‌ పాలసీ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఏడాది క్రితం ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డాను. కరోనా వచ్చింది. ఈ విషయాలన్నీ బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుందా? లేదా తక్కువ మొత్తానికి పాలసీ తీసుకుంటే మంచిదా?

- కిశోర్‌

మీరు టర్మ్‌ పాలసీ తీసుకునేటప్పుడు దరఖాస్తు పత్రంలో సాధారణ వివరాలతోపాటు, ఆర్థిక, ఆరోగ్య వివరాలను కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ప్రమాదం జరిగింది, కరోనా వచ్చింది అంటున్నారు కాబట్టి, ఈ వివరాలను బీమా సంస్థకు తెలియజేయాలి. అవసరాన్ని బట్టి, జీవిత బీమా సంస్థ కొన్ని ఆరోగ్య పరీక్షలనూ అడగవచ్చు.ఆ తర్వాత కంపెనీ విచక్షణ ఆధారంగా మీకు పాలసీ ఇస్తారా లేదా అనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు కొన్ని బీమా సంస్థలు కరోనా వచ్చిన వారికి మూడు నెలల తర్వాతే పాలసీని ఇస్తున్నాయి. ఈ వివరాలు తెలియజేయకుండా.. తక్కువ మొత్తానికి పాలసీ తీసుకున్నా..క్లెయిం వచ్చినప్పుడు.. బీమా సంస్థ తిరస్కరించే ఆస్కారం ఉంది.


పదేళ్ల నుంచి పీపీఎఫ్‌లో నెలకు రూ.2వేలు జమ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచి, నెలకు రూ.5వేల వరకూ పెట్టుబడి పెడదామనుకుంటున్నాను. ఇది సరైన ఆలోచనేనా? ప్రత్యామ్నాయం ఏముంది?

- విజయ్‌

ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) సురక్షితమైన పెట్టుబడి పథకం. దీనిపై వచ్చిన వడ్డీకి ఎటువంటి పన్నూ ఉండదు. ప్రస్తుతం ఈ పథకం 7.1శాతం వడ్డీనిస్తోంది. మనకు అందుబాటులో ఉన్న, నష్టభయం లేనటువంటి పథకాలను పోలిస్తే.. ఇదే మంచిదని చెప్పొచ్చు. ఇందులో జమ చేసిన మొత్తానికి సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపూ లభిస్తుంది. మీరు ఇప్పుడు పీపీఎఫ్‌లో జమ చేస్తున్న రూ.2వేలను అలాగే కొనసాగించండి. కొత్తగా మదుపు చేద్దామనుకుంటున్న రూ.3వేలను హైబ్రీడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించండి. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడికి అవకాశం ఉంటుంది.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని