Reverse Mortgage Loan: మలి వయసులో మంచి ఆదాయం.. రివర్స్‌ మార్టగేజ్‌ గురించి తెలుసా?

మలి వయసులో ఉండి ఆదాయ వనరులు లేనివారికి రివర్స్‌ మార్గగేజ్‌ లోన్‌ ఓ మంచి మార్గం. సొంత ఇంటిని తనఖా పెట్టి నెలానెలా ఆదాయం పొందొచ్చు. పైగా దీన్ని జీవితకాలంలో తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

Updated : 15 Dec 2022 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధాప్యంలో ఉన్నవారికి రివర్స్‌ మార్టగేజ్‌ లోన్‌ ఒక మంచి ఆదాయ మార్గం. సొంతంగా ఇల్లు ఉంటే చాలు.. నెలనెలా ఆదాయం పొందొచ్చు. ముఖ్యంగా మలివయసులో సరైన ఆదాయ వనరులు లేనివారికి ఖర్చుల కోసం ఇది ఒక మంచి మార్గమని నిపుణులు చెబుతుంటారు. ఈ లోన్‌కి సంబంధించిన ఇతర కీలక విషయాలు తెలుసుకుందాం..

60 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్స్‌ తమ సొంతింటిని తనఖా పెట్టి క్రమంతప్పని ఆదాయం పొందొచ్చు. పైగా ఇల్లు కూడా వారి పేరిటే ఉంటుంది.

జీవితకాలంలో లోన్‌ తిరిగి చెల్లించాల్సిన అసవరం ఉండదు. బ్యాంకులు వడ్డీ కూడా వసులు చేయబోవు.

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ వద్ద నమోదైన ప్రైమరీ లెండింగ్‌ సంస్థలు- షెడ్యూల్డ్‌ బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు రివర్స్‌ మార్టగేజ్‌ లోన్లను అందిస్తాయి.

ఇంటి విలువ, లోన్‌తీసుకునేవారి వయసుపై లోన్‌ మంజూరు మొత్తం ఆధారపడి ఉంటుంది.

లోన్‌ మొత్తాన్ని నెలవారీగా/మూడు నెలలకు/ఆరు నెలలకు లేదా ఒకేసారి ఏకమొత్తంలో తీసుకోవచ్చు.

గరిష్ఠ రుణ కాలపరిమితి 20 ఏళ్లు. అంటే లోన్‌ తీసుకున్న దగ్గరి నుంచి వరుసగా 20 సంవత్సరాల పాటు మంజూరైన మొత్తాన్ని వాయిదాలుగా చెల్లిస్తారు.

రుణ మొత్తాన్ని ఇంటి మరమ్మతులు, విస్తరణ, వైద్య ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే, వ్యాపార అవసరాలకు మాత్రం ఈ సొమ్మును వాడుకోవద్దని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి పర్యవేక్షణ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఇంటి విలువను రుణ సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తాయి. అందుకు అనుగుణంగా రుణ మంజూరులో మార్పులు చేస్తుంటాయి.

లోన్‌ తీసుకున్నవారు జీవించి ఉన్నంత కాలం లేదా అక్కడి నుంచి వేరే ఇంటికి శాశ్వతంగా మారనంత కాలం తనఖా పెట్టిన ఇంటిని ఉపయోగించుకోవచ్చు.

లోన్‌ పొందినవారు మరణించినా లేక అక్కడి నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతానికి తరలివెళ్లినా.. తనఖా పెట్టిన ఇంటిని అమ్మి బ్యాంకులు తమ రుణం, దానిపై వడ్డీని వసూలుచేసుకుంటాయి. ఒకవేళ ఏమైనా మిగిలితే చట్టపరమైన వారసులకు ఇచ్చేస్తాయి.

కావాలంటే చట్టపరమైన వారసులు వడ్డీతో సహా లోన్ మొత్తాన్ని చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు