ఏడాదికోసారైనా స‌మీక్షించండి..

పోర్ట‌ఫోలియోను రోజువారీ చూడాల్సిన అవ‌స‌రంలేదు అయితే అప్పుడ‌ప్పుడు దానిని స‌మీక్షించ‌డం మంచిది

Published : 17 May 2021 15:50 IST

పెట్టుబ‌డులను త‌రచూ మార్చ‌డం వ‌ల్ల చివ‌రికి న‌ష్టాలు మిగిలే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అలా అని పెట్టుబ‌డుల‌ను స‌మీక్ష చేయ‌కుండా మానేయ‌మ‌ని కాదు. చాలా మంది ఆర్థిక స‌ల‌హాదారులు ఏడాదికి ఒక సారి పెట్టుబ‌డుల‌ను స‌మీక్ష చేయ‌మ‌ని చెబుతుంటారు. పోర్ట‌ఫోలియోను రోజువారీ చూడాల్సిన అవ‌స‌రంలేదు అయితే అప్పుడ‌ప్పుడు దానిని స‌మీక్షించ‌డం మంచిది అంటున్నారు నిపుణులు.

ఆర్థిక ప్ర‌ణాళిక ప్రారంభించిన స‌మ‌యంలో మొద‌ట ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుంటాం. సాధార‌ణంగా ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు, పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు, ఇల్లు, కారు కొనుగోలు చేసే ల‌క్ష్యాలే దాదాపు అంద‌రికీ ఉంటాయి.

పెట్టుబ‌డుల‌తో పాటు ల‌క్ష్యాలు…
పెట్టుబ‌డుల‌ను, ల‌క్ష్యాల‌ను ట్రాక్ చేసేందుకు అప్పుడ‌ప్పుడు సమీక్ష చేయ‌డం మేలు. స‌మీక్షల ద్వారా ల‌క్ష్యాల‌ను బ‌ట్టి ఆర్థిక స‌ల‌హాదారులను సంప్ర‌దించి సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ విధానంలో నెల‌కు ఎంత పెట్టుబ‌డి చేయాలో నిర్ణ‌యించుకోవ‌చ్చు. ల‌క్ష్యానికి ఎంత దూరంలో ఉన్నామో అంచ‌నా వేయ‌గ‌లం. ఒక వేళ ల‌క్ష్యం చేరువ‌వుతుంటే ఎక్కువ న‌ష్ట‌భ‌యం ఉండే ప‌థ‌కాల నుంచి త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే వాటివైపు పెట్టుబ‌డుల‌ను మ‌ళ్లించ‌మ‌ని ఆర్థిక స‌లహాదారులు సూచించ‌వ‌చ్చు. పెట్టుబ‌డుల‌తో పాటు ల‌క్ష్యాల‌ను కూడా స‌మీక్షించ‌డం వ‌ల్ల అందుకు త‌గ్గ‌ట్టు కేటాయింపుల‌ను పెంచ‌డ‌మో.. లేక‌ త‌గ్గించ‌డ‌మో.. చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. సిప్ లో సొమ్ము పెంచ‌డం పైనో.. త‌గ్గించ‌డం పైనో.. నిర్ణ‌యం తీసుకోగ‌లుగుతాం.

ఎక్కువ మొత్తం మ‌దుపు చేసేందుకు..
కాలం గ‌డిచే కొద్దీ స‌హ‌జంగా ఎక్కువ మొత్తంలో సంపాదించాల‌ని ఎవ‌రికైనా ఉంటుంది. ఉద్యోగుల‌కు ఏటా ఇంక్రిమెంట్ లభిస్తుంది. వృత్తి నిపుణుల ఆదాయంలో హెచ్చుత‌గ్గులుంటాయి. పెట్టుబ‌డుల‌ను అప్పుడ‌ప్పుడు స‌మీక్ష చేయ‌డం వ‌ల్ల నెల నెలా ఎంత ఎక్కువ మ‌దుపు చేయ‌వ‌చ్చో తెలిసిపోతుంది. కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు సిప్ మొత్తాన్ని ఏడాదికోసారి లేదా ఆరు నెల‌ల కోసారి పెంచుకునేందుకు అవ‌కాశం ఇస్తాయి. సిప్ ప్రారంభించే స‌మ‌యంలోనే ఏడాదికి ఎంత చొప్పున పెంచాల‌నే విష‌యాన్ని అడుగుతారు. ఏడాదికి రూ.వెయ్యి లేదా సిప్ విలువ‌లో 10శాతం పెంచుకునేందుకు అవకాశాలుంటాయి.

త‌క్కువ‌ రాబ‌డికి కార‌ణాలు..
ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు దీర్ఘకాలానికి ఉద్దేశించిన‌వి. అయితే వీటిని అప్పుడ‌ప్పుడు స‌మీక్ష చేయ‌డం వ‌ల్ల ఏయే ఫండ్లు ఆశించిన మేర‌కు ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదో తెలుసుకోవ‌చ్చు. మీ స‌ల‌హాదారును అడిగి నిర్ణీత ఫండ్ ప్ర‌ద‌ర్శ‌న ఎందుకు బాగాలేదో త‌గిన కార‌ణాలు తెలుసుకోండి. స‌ద‌రు ఫండ్ పెట్టుబ‌డులున్న రంగం పేల‌వంగా ఉండ‌ట‌మే దీనికి కార‌ణం కావ‌చ్చు. కార‌ణాలేమైనా స‌రే తెలుసుకోవ‌డం ముఖ్యం.

ఫండ్ మేనేజ‌ర్ మారితే…
కొన్ని సార్లు ఫండ్ మేనేజ‌ర్లు మారుతుంటారు. అప్పుడ‌ప్పుడు పోర్ట్‌ఫోలియోను స‌మీక్షిస్తుండ‌డం వ‌ల్ల కొత్త మేనేజ‌ర్ పెట్టుబ‌డుల‌ను ఏ విధంగా నిర్వ‌హిస్తుంది తెలిసేందుకు అవ‌కాశం ఉంది. ఒక వేళ కొత్త ఫండ్ నిర్వాహ‌కుడితో సంతృప్తిగా లేక‌పోతే మ‌రో అవ‌కాశం కోసం చూడ‌వ‌చ్చు. అంటే వేరే ఫండ్‌కు మారాల‌నుకుంటే మార‌వ‌చ్చు.

అంతా ఆన్‌లైన్‌లోనే…
ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబడుల‌న్నీ కాగిత‌ర‌హితంగా, ఆన్‌లైన్‌లోనే జ‌రిగిపోతున్నాయి. ఒక‌ప్పుడైతే ఏజెంటు అవ‌స‌రం ఉండేది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లో ఎంత పెట్టుబ‌డుల‌న్నాయి, రాబ‌డి ఎంత వ‌చ్చింది, ఏడాదికి ఎంత శాతం పెరిగింది త‌దిత‌ర వివ‌రాల‌న్నీ తెలిసిపోతున్నాయి. ఆర్థిక స‌ల‌హాదారుకు ఈ వివ‌రాల‌న్నీ తెలిపి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటే మంచిది.

అప్పుడ‌ప్పుడు పెట్టుబ‌డుల‌ను స‌మీక్షిస్తుండ‌డం వ‌ల్ల ల‌క్ష్య సాధ‌న‌లో ఎన్ని మెట్ల వ‌ర‌కు చేరుకున్నామో… పూర్తిగా చేరేందుకు ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలో తెలుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని