Bank Locker: సవరించిన బ్యాంక్‌ లాకర్‌ నియమాలు

బ్యాంకు లాకర్‌లను నిర్వహించే కస్టమర్లు ఈ ఏడాది జూన్‌, 30 లోపు సవరించిన లాకర్‌ ఒప్పందాలపై సంతకం చేయాలి. దీని గురించి మరిన్ని విషయాలు చూద్దాం.

Updated : 29 May 2023 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ప్రతి బ్యాంకూ తమ ఖాతాదారులకు ఆర్థిక సేవలతో పాటు విలువైన వస్తువులను, డాక్యుమెంట్స్‌ను భద్రపరచుకోవడానికి లాకర్‌ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. దాదాపుగా అన్ని ప్రముఖ బ్యాంకులు ఈ లాకర్‌ సదుపాయాన్ని ఇస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) లాకర్‌ ఖాతాదారుడైతే.. సవరించిన లాకర్‌ ఒప్పందాలపై సంతకం చేయమని కోరుతూ బ్యాంకు గత కొన్ని రోజులుగా మెసేజ్‌లు పంపుతోంది. ఈ మెసేజ్‌లో సవరించిన లాకర్‌ ఒప్పందాన్ని అమలు చేయడానికి మీ శాఖను సందర్శించాలని ఉంది. ఒకవేళ ఇంతకు ముందు సవరించిన ఒప్పందంపై సంతకం చేసినట్లయితే.. ఇంకా అనుబంధ ఒప్పందాన్ని అమలు చేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ మేసేజ్‌లు పంపుతోంది. బ్యాంకు లాకర్‌లను కలిగి ఉన్న ఖాతాదారులు 2023 జూన్‌ 30 లోపు సవరించిన లాకర్‌ ఒప్పందాలపై సంతకం చేయాలి.

ఒప్పందాల పునరుద్ధరణ

ఎస్‌బీఐ లాగానే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా జూన్‌ 30 నాటికి సవరించిన లాకర్‌ ఒప్పందాలపై సంతకం చేయాలని తన శాఖలలో లాకర్లను నిర్వహించే ఖాతాదారులను కోరుతోంది. త్వరలో అన్ని బ్యాంకులు కూడా దీన్ని అనుసరించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జనవరిలో ఆర్‌బీఐ.. 2023, డిసెంబరు 31 తేదీ నాటికి లాకర్‌ ఒప్పందాల పునరుద్ధరణ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయడానికి బ్యాంకులకు గడువును పొడిగించింది. 

స్టాంపు పేపర్‌పై ఒప్పందం

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. లాకర్‌ ఒప్పందం స్టాంప్‌ పేపర్‌పై ఉండాలి. వీటిని బ్యాంకులు ఉచితంగా అందించాలి. సవరించిన ఒప్పందానికి సంబంధించి ప్రాథమిక లక్ష్యం లాకర్‌ హోల్డర్ల ప్రయోజనాలను కాపాడడానికే అని వినియోగదారులు తెలుసుకోవాలి. బ్యాంకులు తమ కస్టమర్లకు తాజాగా 'సంప్లిమెంటరీ స్టాంప్‌డ్‌ అగ్రిమెంట్‌'ల అమలును సులభతరం చేయాలని, స్టాంప్‌ పేపర్‌ల ఏర్పాటు, ఫ్రాంకింగ్‌, అగ్రిమెంట్‌ ఎలక్ట్రానిక్‌ ఎగ్జిక్యూషన్‌, ఇ-స్టాంపింగ్‌ మొదలైన చర్యలు తీసుకోవడం ద్వారా ఎగ్జిక్యూటెడ్‌ అగ్రిమెంట్‌ కాపీని అందించాలని ఆర్‌బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. 

ఒప్పందం కాపీ

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం... బ్యాంకులు కస్టమర్లకు ఒప్పందం కాపీని అందించాలి. రెండు పక్షాలు సంతకం చేసిన లాకర్‌ ఒప్పందానికి సంబంధించిన కాపీని హక్కులు, బాధ్యతలు తెలియజేయడానికి 'లాకర్‌-హైరర్‌'కు బ్యాంకు అందిస్తుంది. లాకర్‌ ఉన్న బ్యాంకు బ్రాంచీలో ఒరిజినల్‌ అగ్రిమెంట్‌ను భద్రపరుస్తారు. ఖాతాదారులు ఒప్పందానికి సంబంధించిన కాపీని కలిగి ఉండడం ఇప్పుడు తప్పనిసరి. లాకర్ల కోసం నిబంధనలు, ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాల (స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌)ను సూచించడం వల్ల ఖాతాదారులు చాలా విషయాలను తెలుసుకుంటారు. బ్రాంచ్‌లలో బ్యాంకు వెబ్‌సైట్‌లో అన్ని నిబంధనలు, SOP (స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌)ను ప్రదర్శించడం కూడా తప్పనిసరి. మీ బ్యాంకు ఒప్పందాన్ని అందించినట్లయితే, దాన్ని జాగ్రత్తగా చదవండి. బ్యాంకు తెలిపిన నిబంధనలతో మీరు ఏకీభవించకపోతే, మీ బ్యాంకుతో మాట్లాడి ఆర్‌బీఐ నిబంధనలు, మార్గదర్శకాలను నిర్ధారించుకోండి.

లాకర్‌ కోసం ఎఫ్‌డీలు

లాకర్‌ కేటాయింపు సమయంలో అవసరమైతే 3 సంవత్సరాల లాకర్‌ అద్దె (ఛార్జీల)ను కవర్‌ చేయగల ఎఫ్‌డీలను పొందడానికి ఆర్‌బీఐ బ్యాంకులను అనుమతించింది. లాకర్‌ అద్దెదారుడు లాకర్‌ను ఆపరేట్‌ చేయని లేదా అద్దె చెల్లించని పరిస్థితులున్నప్పుడు, ఈ డిపాజిట్‌ ఉపయోగపడుతుంది. అయితే, మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న ఖాతాదారుల విషయంలో బ్యాంకులు ఎఫ్‌డీ చేయమని ఇబ్బందులు పెట్టకపోవచ్చు. అలాగే, లాకర్‌ అద్దెను బ్యాంకులు ముందుగానే వసూలు చేసిన సందర్భాలుంటాయి. ఇలాంటప్పుడు లాకర్‌ అద్దెదారుడు మధ్యలో లాకర్‌ను సరెండర్‌ చేస్తే, బ్యాంకు వసూలు చేసిన అడ్వాన్స్‌ను మిగిలిన కాలానికి తిరిగి చెల్లించాలి.

బ్యాంకు బాధ్యత వహించదు

భారీ వర్షాలు, వరదలు, భూకంపం, పిడుగులు, తీవ్రవాదుల దాడి, అల్లర్లలో ఇబ్బందుల వల్ల, లాకర్‌ అద్దెదారుడు నిరక్ష్యం కారణంగా లాకర్‌లోని వస్తువులు చెడిపోయినా/దెబ్బతిన్నా.. లాకర్‌లో ఉన్న వస్తువులకు బ్యాంకు బాధ్యత వహించదు.

బ్యాంకు బాధ్యత

అయితే, సేఫ్‌ డిపాజిట్‌ వాల్ట్‌లు ఉన్న ప్రాంగణంలో భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవడం బ్యాంకుల బాధ్యత. అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కూలడం, బ్యాంకు నిర్లక్ష్యం లేదా ఉద్యోగుల మోసపూరిత కార్యకలాపాల వంటి సంఘటనల విషయంలో లాకర్‌ అద్దెదారునకు బ్యాంకు పరిహారం చెల్లించాలి. ఈ పరిహారం లాకర్‌కు సంబంధించిన ప్రస్తుత వార్షిక అద్దెకు గరిష్ఠంగా 100 రెట్ల వరకు ఉండొచ్చు.

చివరిగా: బ్యాంకు లాకర్‌ ఖాతా దరఖాస్తులో మీ ఇ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. లాకర్‌ ఆపరేషన్‌ తేదీ, సమయాన్ని తెలియజేస్తూ బ్యాంకులు ఇ-మెయిల్‌, ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ హెచ్చరికలను పంపుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని