ITR filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో త‌ప్పులా? ఇప్పుడేం చేయాలి?

Revised itr process in telugu: ఒక‌వేళ ఇప్ప‌టికీ ఐటీఆర్ ఫైల్ చేయ‌క‌పోతే అప‌రాధ రుసుము చెల్లించి డిసెంబ‌రు 31లోపు ఆల‌స్య‌పు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌వ‌చ్చు.

Updated : 09 Aug 2022 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఆడిట్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా ఐటీఆర్ దాఖ‌లు (ITR filing) చేసేందుకు వీలున్న ఖాతాల రిట‌ర్నుల దాఖ‌లు గ‌డువు జులై 31తో ముగిసింది. ఒక‌వేళ ఇప్ప‌టికీ ఐటీఆర్ ఫైల్ చేయ‌క‌పోతే అప‌రాధ రుసుము చెల్లించి ఈ ఏడాది డిసెంబ‌రు 31లోపు ఆల‌స్య‌పు ఐటీఆర్ (Belated ITR) దాఖ‌లు చేయ‌వ‌చ్చు. గ‌డువులోపు రిట‌ర్నులు దాఖ‌లు చేసిన అర్హులైన వ్యక్తుల‌కు రీఫండ్ కూడా ల‌భిస్తుంది. ఒక‌వేళ రీఫండ్ రాక‌పోతే ఐటీఆర్ దాఖ‌లులో ఏమైనా త‌ప్పులు ఉన్నాయా? అనేది చెక్ చేసుకోవ‌డం మంచిది.

ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు కొన్నిసార్లు పొర‌పాట్లు జ‌రుగుతుంటాయి. ఇలాంటి త‌ప్పులు/పొర‌పాట్లు జ‌రిగితే రీఫండ్ రాదు. అందువ‌ల్ల ఈ త‌ప్పుల‌ను స‌రిచేసుకోవాల్సి ఉంటుంది. రివైజ్డ్ (స‌వ‌రించిన‌) ఐటీఆర్‌ను (Revised ITR) స‌మ‌ర్పించ‌డం ద్వారా ప‌న్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖ‌లులో చేసిన త‌ప్పులను స‌రిదిద్దుకోవ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 139 (5) కింద ప‌న్ను చెల్లింపుదారులు రివైజ్డ్ ఐటీఆర్ దాఖ‌లు చేసే వెసులుబాటు ఉంది. మ‌దింపు సంవ‌త్స‌రం ముగియ‌డానికి మూడు నెల‌ల ముందు వ‌ర‌కు రివైజ్డ్ ఐటీఆర్‌ను దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అంటే ఇప్ప‌టికే స‌మ‌ర్పించిన ఐటీఆర్‌లో త‌ప్పులు ఉన్న‌ట్లు గుర్తిస్తే డిసెంబ‌రు 31లోపు స‌వ‌రించిన‌ ఐటీఆర్‌ని దాఖ‌లు చేయ‌వ‌చ్చు.

ఐటీఆర్ దాఖ‌లు చేసేట‌ప్పుడు సాధార‌ణంగా చేసే త‌ప్పులు/పొర‌పాట్లు..

  • బ్యాంకు వివ‌రాల‌ను త‌ప్పుగా న‌మోదు చేయ‌డం
  • వ్య‌క్తిగ‌త వివ‌రాలు త‌ప్పుగా ఇవ్వడం
  • త‌ప్పు ఐటీఆర్ ఫారం ఎంచుకోవ‌డం
  • ఆదాయం వివ‌రాలు, ఫారం 26ఏఎస్‌తో స‌రిపోల‌క‌పోవ‌డం 
  • టీడీఎస్ క్లెయిమ్ చేయ‌ని క్రెడిట్‌
  • ఆస్తులు, అప్పులు జ‌త‌చేయ‌డంలో చేసే త‌ప్పులు
  • విదేశీ ఆదాయం, ఆస్తులు వెల్ల‌డించ‌డంలో చేసే పొరపాట్లు
  • నివాసం, ఇత‌ర స‌మాచారం త‌ప్పుగా ఎంట‌ర్ చేయ‌డం

రివైజ్డ్ రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసే విధానం..

  • ముందుగా https://www.incometax.gov.in/iec/foportalకి వెళ్లి మీ యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి.
  • మీ ఖాతాకు లాగిన అయిన త‌ర్వాత ఇటీవ‌లే ఫైల్ చేసిన ఐటీఆర్‌కు సంబంధించిన ఫైల్ రివైజ్డ్ రిట‌ర్న్‌ ఆప్ష‌న్ చూడ‌వ‌చ్చు.
  • ఇక్క‌డ ఏవై 2022-23 ఎంచుకుని, ఫైలింగ్ మోడ్ ఆన్‌లైన్ ఎంచుకుని (ఇక్క‌డ ఆఫ్‌లైన్ మోడ్ కూడా ఎంచుకోవచ్చు) కంటిన్యూపై క్లిక్ చేయాలి.
  • ఆ త‌ర్వాత మీ స్టేట‌స్‌ (ఇండివిడ్యువ‌ల్‌, హెచ్‌యూఎఫ్‌, ఇత‌రులు)ని సెల‌క్ట్ చేసుకోవాలి.
  • ఇక్క‌డ మీకు వ‌ర్తించే ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవాలి. ఒరిజిన‌ల్‌గా స‌బ్మిట్ చేసిన ఫారంనే తిరిగి సెల‌క్ట్ చేసుకోవాల‌నేం లేదు.
  • ఇప్పుడు మీరు రివైజ్డ్ రిట‌ర్నులు ఎందుకు దాఖ‌లు చేస్తున్నారో త‌గిన కార‌ణం తెల‌పాలి.
  • ఆ త‌ర్వాత త‌ప్పులను స‌రిచేసి రిట‌ర్నులను ఫైల్ చేయాలి. ఆ త‌ర్వాత ఈ-వెరిఫికేష‌న్ పూర్తిచేయాలి.
  • ప‌న్ను చెల్లింపుదారులు ఆదాయ‌పు ప‌న్ను శాఖ సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌, బెంగుళూరు వారికి ఆఫ్‌లైన్ ద్వారా అంటే స్పీడ్‌ పోస్ట్ ద్వారా పంపించి కూడా రిట‌ర్నుల వెరిఫికేష‌న్ పూర్తి చేయ‌వ‌చ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని