House Rent: అద్దెదారుడిపై ఇంటి యజమానికి ఎలాంటి హక్కులుంటాయి?

అద్దెకుండేవారితో యజమానికి కొన్ని సందర్భాలలో సమస్యలు వస్తుంటాయి, ఇలాంటప్పుడు యజమాని ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఇక్కడ చూడండి.

Published : 22 Sep 2023 17:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌లో అద్దె ఇళ్లలో నివసించేవారి సంఖ్య ఎక్కువే. చాలా మంది ఇంటి యజమానులు ఇంటిని అద్దెకిచ్చి ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అద్దె ఇళ్లలో నివసించేవారు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ. ఇంటి యజమానికి, అద్దెదారునికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పితే చాలావరకు సంబంధాలు బాగానే ఉంటాయి. ఒక్కోసారి అద్దెకు నివసించేవారు ప్రతి నెలా చెల్లించాల్సిన అద్దె కట్టకుండా, ఇల్లు ఖాళీ చేయకుండా ఇంటి యజమానిని ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి  సందర్భంలో చర్చల వల్ల లాభం లేకపోతే యాజమానులు చట్టబద్ధమైన చర్యలను ఆశ్రయించవలసి ఉంటుంది. భారత్‌లో అద్దెదారులు అద్దె చెల్లించకపోతే యజమానుల రక్షణార్థం కొన్ని చట్టాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

అగ్రిమెంట్‌

అద్దెదారులతో యజమాని ఇంటిలోకి ప్రవేశించే ముందే రెంట్‌ అగ్రిమెంట్‌పై విధిగా సంతకం తీసుకోవాలి. అద్దె మొత్తం, గడువు తేదీ, వార్షిక అద్దె పెంపుతో పాటు ఒకవేళ అద్దె చెల్లించకపోతే ఏర్పడే పరిణామాలతో సహా అద్దెకు సంబంధించిన నిబంధనలు, షరతులను ఒప్పందంలో స్పష్టంగా రాసుకోవాలి. ఈ పత్రం ఇంటి యజమానిని అనేక చట్టపరమైన ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. అద్దెదారుడు సంతకం చేసిన అగ్రిమెంట్‌ను ఇంటి యజమాని జాగ్రత్తగా సమీక్షించాలి. యజమాని అనుసరించే చట్టపరమైన చర్యకు ఈ పత్రం పునాదిగా పనిచేస్తుంది.

డిపాజిట్‌

అద్దెదారులు ఇంటిలోకి ప్రవేశించే ముందు యజమానికి 2-3 నెలల (కొన్ని ప్రాంతాల్లో మరింత ఎక్కువ) అద్దె మొత్తం సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించవలసి ఉంటుంది. ఈ డిపాజిట్‌.. అద్దెదారుడు అద్దె చెల్లించని పరిస్థితుల్లో, ఇంటికి ఏదైన నష్టం కలిగించిన సందర్భంలో యాజమానికి ఒక రకమైన ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది. ఈ డిపాజిట్‌ ఇంటి యజమాని దగ్గర ఉండడం వల్ల.. అద్దెదారులు ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా అద్దె ఒప్పందం ప్రకారం వారి బాధ్యతలను సరిగ్గా నెరవేరుస్తారు.

నోటీసు

గడువు తేదీలో అద్దెదారుడు అద్దె చెల్లించడంలో విఫలమైతే తొలుత అతడితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అలా వీలుకానప్పుడు అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వారికి లీగల్‌ నోటీసు పంపొచ్చు. కాంట్రాక్టు/అద్దె ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని గుర్తుచేస్తూ యజమాని అద్దెదారుడికి చట్టబద్ధమైన నోటీసును పంపొచ్చు. నోటీసులో చెల్లించని అద్దె వివరాలు, చెల్లించే గడువు ఉండాలి. నోటీసుకు స్పందించకపోతే చట్టపరంగా జరిగే పరిణామాలను వివరించాలి. నోటీసు ఇండియన్‌ కాంట్రాక్ట్‌ చట్టం కింద పేర్కొన్న చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. రిజిస్టర్డ్‌ పోస్ట్‌ పంపడం తప్పనిసరి. పోస్ట్‌ అందినట్లు నిర్ధారించుకోవాలి. 15 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కూడా అద్దె చెల్లించడానికి నిరాకరిస్తే, అద్దె నియంత్రణ కోర్టు లేదా సివిల్‌ కోర్టులో అద్దెదారుడిని విచారించడానికి కోర్టును అనుమతి కోరవచ్చు.

చర్చలు

లీగల్‌ నోటీసులు, కోర్టు విచారణల కన్నా ముందు మధ్యవర్తిని పంపి చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అవుతుందేమో ఆలోచించాలి. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కొనుగొనే అవకాశం ఈ చర్చల్లో ఉంటుంది. భారత్‌లోని అనేక నగరాల్లో మధ్యవర్తిత్వ కేంద్రాలు, ఫోరంలు ఉన్నాయి. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇవి మంచి వేదికలుగా ఉపయోగపడతాయి.

కోర్టు కేసు

లీగల్‌ నోటీసు, చర్చలు ఫలప్రదం కాకుండా అద్దెదారుడు చెల్లింపులను నిరాకరిస్తూనే ఉంటే, యజమాని తగిన కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. ఏ కోర్టు అనేది బకాయిపడిన అద్దె విలువపై ఆధారపడి ఉంటుంది. చిన్న మొత్తాల కోసం సివిల్‌ కోర్టును ఆశ్రయించొచ్చు. బకాయి పెద్ద మొత్తం అయితే జిల్లా కోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది.

కోర్టు డిక్రీ

కేసు దాఖలు చేసిన తర్వాత కోర్టు సాక్ష్యాలను పరిశీలించి ఇరుపక్షాల వాదనలను విచారిస్తుంది. కోర్టు యాజమాని వాదనలు అనుకూలంగా పరిగణిస్తే, బకాయి అద్దె మొత్తాన్ని చెల్లించాలని అద్దెదారుని నిర్దేశిస్తూ ఒక డిక్రీని జారీ చేస్తుంది. ఈ డిక్రీ ఎలా ఉపయోగపడుతుందంటే.. అద్దెదారు ఆస్తిని అటాచ్‌మెంట్‌ చేయడం, వారి వేతనాల నుంచి అద్దె బకాయి వసూలు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి జాగా నుంచి అద్దెదారుడిని ఖాళీ చేయించడం వంటివి కోర్టు ద్వారా అమలవుతాయి. చాలా సందర్భాల్లో అద్దెదారులు కోర్టు నుంచి చట్టపరమైన నోటీసును స్వీకరించిన తర్వాత అద్దె ప్రాంగణాన్ని వదిలేసే అవకాశాలెక్కువ. ఇంటి యజమానులు ఇలాంటి విషయాలలో సరైన న్యాయవాది మార్గదర్శకత్వం పొందడం చాలా ముఖ్యం.

ఇల్లు ఖాళీ చేయించడం

అద్దె నియంత్రణ చట్టం 12 నెలల పైన అద్దెకు ఉన్న అద్దెదారులకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త మోడల్‌ టెనెన్సీ చట్టం 2015 ప్రకారం అద్దెదారుడు.. అద్దె డిఫాల్ట్‌ అయినా, అద్దె ఒప్పందాన్ని ఉల్లఘించినా ఇంటి నుంచి ఖాళీ చేయించడానికి యజమానికి వీలు కల్పిస్తుంది. అద్దెదారుడు అద్దె ఇవ్వని పరిస్థితుల్లోనే కాకుండా ఇంటి యజమానికి కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కూడా అద్దెదారుల నుంచి ఇంటిని ఖాళీ చేయించవలసి ఉంటుంది. ఖాళీ చేయించడానికి ఎలాంటి చట్టబద్ధమైన కారణాలు చూపవచ్చో ముందు తెలుసుకోవాలి. అద్దెదారులు ఇంటి యజమాని అనుమతి లేకుండా అద్దె జాగాను పూర్తిగా/ కొంత భాగాన్ని వేరే వాళ్లకు అద్దెకిస్తే.. అది అద్దె ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. అద్దె జాగాలో నివాసం ఉండడం తప్ప ఎటువంటి వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలు నిర్వహించకూడదు. అక్రమ కార్యకలాపాల వల్ల ఇంటి యజమానులు కూడా బాధ్యులవుతారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంటిని ఖాళీ చేయించవచ్చు. ఇంటి మరమ్మతులు, మార్పులు, చేర్పులు ఉంటే యజమాని ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఆస్తి నివాసానికి సురక్షితం కాకుండా, మరమ్మతుకు మించి ఇల్లు పాడైన సందర్భంలో కూడా ఇంటిని స్వాధీనం చేసుకునే హక్కు యజమానికి ఉంటుంది. 

చివరిగా: ఇంటిని అద్దెకిచ్చేటప్పుడు పరిచయం ఉన్న వారికి ఇవ్వడం మేలు. దీనివల్ల ఇంటి యజమానులు ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని