IPO: ఐపీఓకు రిషభ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సన్నాహాలు.. సెబీకి దరఖాస్తు

విద్యుత్తు, వాహన సహా ఇతర పరిశ్రమలకు మీజరింగ్‌ పరికరాలను అందిస్తున్న రిషభ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఐపీఓకి రాబోతోంది. త్వరలో దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది.

Published : 02 Jan 2023 18:45 IST

దిల్లీ: గ్లోబల్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ సొల్యూషన్‌ కంపెనీ రిషభ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (Rishabh Instruments IPO)కి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు సోమవారం మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. సంబంధించిన ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఈ ఐపీఓ (Rishabh Instruments IPO)లో రూ.75 కోట్లు విలువ చేసే తాజా షేర్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే మరో 94.17 లక్షల ఈక్విటీ షేర్లు ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద (OFS)’ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయిస్తున్నారు.

ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ఆశా నరేంద్ర గోలియా 25 లక్షలు, నరేంద్ర రిషభ్‌ గోలియా 5.17 లక్షలు, రిషభ్‌ నరేంద్ర గోలియా 4 లక్షలు, SACEF Holdings II 60 లక్షల ఈక్విటీ షేర్లను ఐపీఓలో విక్రయానికి ఉంచుతున్నాయి. ముసాయిదా పత్రాల ప్రకారం కంపెనీ ప్రీ-ప్లేస్‌మెంట్‌కు వెళ్లేందుకు కూడా యోచిస్తోంది. ఈ మార్గంలో రూ.15 కోట్లు సమీకరించాలని ప్లాన్‌ చేసుకుంది. ఒకవేళ అది విజయవంతమైతే.. ఐపీఓ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. ఈ ఐపీఓలో సమీకరించిన నిధులతో నాశిక్‌లోని తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నారు. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు.

నాశిక్‌ కేంద్రంగా పనిచేస్తున్న రిషభ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌.. విద్యుత్తు, వాహన సహా ఇతర భారీ పరిశ్రమల్లో ఉపయోగించే ఎలక్ట్రికల్‌ ఆటోమేషన్‌, మీటరింగ్‌, మీజర్‌మెంట్‌, ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది. లోవోల్టేజీ ట్రాన్స్‌ఫార్మర్లు, అనలాగ్‌ ప్యానెల్‌ మీటర్ల తయారీ, సరఫరా చేస్తున్న కంపెనీల జాబితాలో ఇది ముందుంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ నికర లాభాలు రూ. 49.65 కోట్లుగా నమోదయ్యాయి. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.470.25 కోట్లకు చేరింది. డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, మీరే అసెట్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ (ఇండియా), మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని