Investments: ఆ ఐపీఓలో రూ.10వేలు పెట్టి ఉంటే.. ఇప్పుడు కోటీశ్వరులే!

Investments: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. ఈ కంపెనీ 1998లో ఐపీఓకి వచ్చింది. అప్పుడు ఇన్వెస్ట్‌ చేసి అట్టిపెట్టుకున్న వారి సంపద ఇప్పటికి భారీగా పెరిగి ఉంటుంది.

Published : 19 Jun 2024 15:37 IST

వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. బడా టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి ఈ స్థానానికి చేరింది. కృత్రిమ మేధకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్విడియా షేర్ల డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటోంది.

ఏఐ, రోబోటిక్స్‌, అటానమస్‌ వెహికల్స్‌ సహా అత్యాధునిక సాంకేతికతలో వాడే పలురకాల చిప్‌లను ఎన్విడియా అందిస్తోంది. ఈనేపథ్యంలో కంపెనీ వృద్ధిపై బలమైన విశ్వాసంతో ఉన్న మదుపర్లు ఈ షేర్ల కోసం పోటీపడుతున్నారు. మంగళవారం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్‌ ధర 3 శాతం పెరిగి 135.58 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 110 బిలియన్‌ డాలర్లు పెరిగి 3.335 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. 

ఎన్విడియా ఇటీవలే ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ను అధిగమించి రెండో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి తొలి స్థానానికి ఎగబాకడం విశేషం. మైక్రోసాఫ్ట్‌ విలువ ప్రస్తుతం 3.317 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. యాపిల్‌ మార్కెట్‌ క్యాప్‌ 3.286 ట్రిలియన్‌ డాలర్లుగా కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇవి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఎన్విడియా షేరు విలువ ఈ ఏడాది ఇప్పటివరకు మూడింతలు పెరగడం విశేషం. అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌ షేరు ధర 19 శాతం పుంజుకుంది.

1999లో ఐపీఓకు..

ఎన్విడియా 1999లో ఐపీఓకి వచ్చింది. ఒక్కో షేరు ధరను అప్పట్లో 12 డాలర్లుగా నిర్ణయించింది. తర్వాత కాలంలో గేమింగ్‌ సహా కొత్తతరం టెక్నాలజీల కోసం చిప్‌లకు గిరాకీ పుంజుకోవటంతో కంపెనీ షేర్ల విలువ భారీగా పెరిగింది. ఒకవేళ భారతీయులెవరైనా అప్పట్లో ఈ కంపెనీ ఐపీఓలో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి షేర్లను పొంది ఉంటే వారికి (అప్పటి డాలర్‌ మారకపు విలువను పరిగణనలోకి తీసుకొని) 19 షేర్లు దక్కి ఉండేవి. క్రమంగా స్టాక్‌ విలువ భారీగా పెరగడంతో రిటైల్‌ మదుపర్లకు అందుబాటులో ఉండేలా పలుమార్లు షేర్లను కంపెనీ విభజించింది. ఫలితంగా 2000 సంవత్సరానికి ముందున్న ఒక ఎన్విడియా షేరు కాస్తా ఇప్పుడు 480 షేర్లకు సమానమయ్యాయి. అంటే ఈ లెక్కన రూ.10,000తో సొంతం చేసుకున్న 19 షేర్ల సంఖ్య 9,120కు పెరిగి ఉంటుంది. 

ఎన్విడియా ప్రస్తుత స్టాక్‌ ధర 135 డాలర్ల ప్రకారం 9,120 షేర్ల విలువ 1.231 మిలియన్‌ డాలర్లకు చేరి ఉంటుంది. ఇప్పుడున్న డాలర్‌ మారకపు విలువను పరిగణనలోకి తీసుకుంటే అది రూ.10.27 కోట్లకు సమానం. అంటే 25 ఏళ్ల క్రితం ఎన్విడియా కంపెనీ షేర్లలో రూ.10 వేలు ఇన్వెస్ట్‌ చేసి అట్టిపెట్టుకున్నవారు ఇప్పుడు కోటీశ్వరులుగా అవతరించి ఉంటారు.

సీఈవోకు ఒక్కరోజే రూ.33.4 వేల కోట్ల లాభం

ఎన్విడియా షేర్ల ధర పెరగడంతో కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానానికి చేరారు. మంగళవారం ఒక్కరోజే ఆయన సంపద 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.33.4 వేల కోట్లు) పెరిగి 119 బి.డాలర్లకు చేరింది. 2019లో ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో 546వ స్థానంలో ఉన్నారు. ఐదేళ్లలో ఆయన సంపద 2,250% పెరగడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని