Electric Vehicles: రూ.23 లక్షల కోట్లతో దేశంలో పూర్తిగా 2-3 వీలర్లు!

భారత్‌లో ప్రస్తుతం 23 కోట్ల ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. వీటన్నింటి స్థానంలో విద్యుత్తు వాహనాలు తీసుకురావడానికి రూ.23 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక అంచనా వేసింది. 

Published : 02 Dec 2022 00:25 IST

దిల్లీ: భారత్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలన్నింటి స్థానంలో పూర్తిగా విద్యుత్తు వాహనాలను తీసుకురావాలంటే దాదాపు రూ.23 లక్షల కోట్లు అవసరమని ఓ నివేదిక తెలిపింది. దేశంలో డెలివరీ సంస్థలు వేగంగా విద్యుత్తు వాహనాలను వినియోగంలోకి తీసుకొస్తున్నాయని నీతి ఆయోగ్‌తో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన నివేదిక పేర్కొంది. తొలుత ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లోనే పూర్తిగా విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది.

యజమానులే డ్రైవర్లుగా ఉన్నవారు విద్యుత్తు వాహనాలపై అంతగా ఆసక్తి చూపడం లేదని నివేదిక తెలిపింది. కొనుగోలు ధరలు అధికంగా ఉండటం, కొత్త సాంకేతికతపై విశ్వాసం లేకపోవడం, కచ్చితమైన రీసేల్‌ విలువ తెలియకపోవడమే సవాళ్లుగా నిలుస్తున్నాయని పేర్కొంది. భారత్‌లో వాహన విక్రయాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలదే 80 శాతం వాటా. గత కొన్నేళ్లుగా ఈ విభాగాల్లో విద్యుత్తు వాహనాల గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది.

భారత్‌లో 45 కంపెనీలు విద్యుత్తు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను తయారు చేస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో ఈ విభాగాల్లో విద్యుత్తు వాహనాల సంఖ్య 10 లక్షలకు చేరింది. ప్రస్తుతం ఈ విభాగంలో దేశవ్యాప్తంగా అన్నీ కలిపి 25 కోట్ల వాహనాలున్నాయని అంచనా. వీటిని విద్యుత్తు వాహనాల్లోకి మార్చే నాటికి ఆ సంఖ్య 27 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. ఒక్కో ద్విచక్ర వాహన యూనిట్‌ ధరను సగటున రూ.81,000, త్రిచక్ర యూనిట్‌ ధర రూ.2.8 లక్షలుగా లెక్కేస్తే.. పూర్తిగా విద్యుత్తు వాహనాలను తీసుకురావడానికి రూ.23 లక్షల కోట్ల నిధులు అవసరమని అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని