Excise duty: పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్‌ సుంకం నిర్ణయం ఒక నెల వాయిదా

ఇథనాల్‌, బయో డీజిల్‌ కలపని పెట్రోల్‌, డీజిల్‌పై అదనంగా రూ.2 ఎక్సైజ్‌ సుంకం విధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఒక నెల వాయిదా వేసింది.

Updated : 01 Oct 2022 15:18 IST

దిల్లీ: ఇథనాల్‌ కలపని పెట్రోల్‌పై అదనంగా రూ.2 ఎక్సైజ్‌ సుంకం విధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఒక నెల వాయిదా వేసింది. పెట్రోల్‌లో ఇథనాల్‌, డీజిల్‌లో బయో డీజిల్‌ కలిపేందుకు పరిశ్రమ వర్గాలకు మరింత గడువు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెప్టెంబర్‌ 30న ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువవరించింది. నవంబర్‌ 1 నుంచి పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్‌ సుంకం అమల్లోకి రానుంది. డీజిల్‌పై ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమలౌతుంది.

చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే ఉద్దేశంతో ఇథనాల్‌, బయో డీజిల్‌ను కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 90 శాతం పెట్రోల్‌లో చెరకు, మిగులు ఆహార ధాన్యాల నుంచి తీసిన 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నారు. అలాగే డీజిల్‌లో ప్రయోగాత్మకంగా బయో డీజిల్‌ను కలుపుతున్నారు. అయితే, ఇథనాల్‌, బయో డీజిల్‌ కలపని పెట్రోల్‌, డీజిల్‌పై అదనంగా రూ.2 చొప్పున ఎక్సైజ్‌ సుంకం విధిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

అక్టోబర్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రావాల్సి ఉండగా.. పరిశ్రమ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని పెట్రోల్‌పై ఒక నెల, డీజిల్‌పై ఆరు నెలలు వాయిదా వేశారు. దీని ప్రకారం ఇథనాల్‌ కలపని బ్రాండెడ్‌ పెట్రోల్‌పై ఇప్పుడున్న రూ.2.60 బేసిక్‌ ఎక్సైజ్‌ సుంకం కాస్తా రూ.4.60లకు పెరగనుంది. అలాగే బ్రాండెడ్‌ డీజిల్‌పై ప్రస్తుతం ఉన్న రూ.4.20 బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూ.6.20కి చేరనుంది. ప్రస్తుతం బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, సెస్‌, స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్నారు. ఇలా మొత్తంగా పెట్రోల్‌పై రూ.19.90, డీజిల్‌పై రూ.15.80 పేరిట కేంద్రం పన్నులు విధిస్తోంది. రాష్ట్రాలు వ్యాట్‌ విధిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని