Housing scheme: గృహ పథకానికి రూ.55,000 కోట్ల సబ్సిడీ!

Updated : 07 Jul 2024 09:29 IST

2023-24 కంటే 50% అధికం

దిల్లీ: రాబోయే బడ్జెట్‌లో గ్రామీణ గృహ పథకానికి సబ్సిడీల కేటాయింపును 50 శాతం మేర పెంచి సుమారు రూ.55,000 కోట్లకు చేర్చే అవకాశం ఉందని ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఇందుకు నేపథ్యమని పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ గృహ పథకానికి రూ.32,000 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చింది. గ్రామాల్లో రహదారుల అభివృద్ధి, వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న లక్షలాది మంది యువతకు ఉద్యోగ కల్పన కార్యక్రమాలు చేపట్టడం సహా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై అధికంగా వ్యయ కేటాయింపులు చేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఇందులో భాగంగానే గ్రామీణ గృహ పథకానికి సబ్సిడీని పెంచే యోచనను ప్రభుత్వం చేస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే గ్రామీణ గృహ పథకం ప్రారంభమైన 2016 తర్వాత ఇంత భారీ మొత్తంలో వార్షిక కేటాయింపులను పెంచడం ఇదే తొలిసారి అవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ) గృహ పథకం కింద ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో పేద కుటుంబాలకు సుమారు 2.6 కోట్ల గృహాలను మంజూరు చేసింది. వచ్చే కొన్నేళ్లలో అదనంగా 2 కోట్ల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఒత్తిడిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ: ‘అధిక ద్రవ్యోల్బణం, రైతుల ఆదాయాల వృద్ధిలో స్తబ్దత కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంద’ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెలలో ప్రకటించబోయే బడ్జెట్‌లో కేవలం గ్రామీణ గృహ పథకానికే కాకుండా ఇతర గ్రామీణ రంగ పథకాలకు కూడా గణనీయ స్థాయిలో కేటాయింపులను పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ కల్పన కార్యక్రమానికి ప్రభుత్వం రూ.86,000 కోట్ల మేర వ్యయ కేటాయింపులు చేయొచ్చని ఇంతకుమునుపు అంచనా వేయగా.. ఇప్పుడు దానికి మించే కేటాయిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ అదనపు వ్యయ కేటాయింపులకు పార్లమెంట్‌ అనుమతిని ప్రభుత్వం తీసుకోవాల్సి రావొచ్చు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ రహదారులపై వ్యయ కేటాయింపులను ఇంతకుమునుపు రూ.12,000 కోట్లుగా అంచనా వేయగా.. ఈ మొత్తాన్ని పెంచుతూ ప్రత్యేక ప్రతిపాదనను కూడా బడ్జెట్‌లో చేసే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని