Health Insurance: రూ.1 కోటి ఆరోగ్య బీమా నిజంగా అవసరమేనా?

దేశంలో వైద్య ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల మూలంగా అధిక మొత్తంలో ఆరోగ్య బీమాకై ఆలోచించేవారు ఎక్కువయ్యారు.

Published : 29 Nov 2022 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకూ పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా.. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యబీమా తప్పనిసరి అయింది. ఒక్కోసారి పాలసీ కొనుగోలుదారులు (ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు) సరైన హామీ మొత్తాన్ని నిర్ణయించుకోవడంలో విఫలమవుతున్నారు. వైద్య చికిత్స ఖర్చులు పెరిగిపోతుండడంతో రూ.1 కోటి వరకు ఆరోగ్య రక్షణను తీసుకోవడాన్ని సమర్థించేవారు కూడా ఉన్నారు. రూ.1 కోటి రూపాయల వరకు ఆరోగ్య కవరేజీని అందించే అనేక బీమా పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ఏ సందర్భాల్లో అధిక బీమా కావాలి?

అన్ని సందర్భాల్లో రూ.1 కోటి ఆరోగ్య బీమా కవర్‌ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ, క్లిష్టమైన అనారోగ్యాల చరిత్ర కలిగిన కుటుంబాలకు అటువంటి కవర్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దేశంలో వైద్య ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంది. కాబట్టి రూ.1 కోటి వరకు ఆరోగ్య రక్షణను తీసుకోవడాన్ని కొందరు వైద్య నిపుణులు సమర్థిస్తున్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సలు, మూత్రపిండాలు, కాలేయం, గుండె మార్పిడి వంటి ప్రధాన అవయవ మార్పిడికి సంబంధించిన చికిత్సలకు ప్రముఖ కార్పొరేట్‌ ప్రైవేట్‌ ఆసుపత్రులలో రూ.25 లక్షల నుంచి రూ.1 కోటి వరకు చికిత్స ఖర్చులు ఉంటాయి. అంతేకాకుండా ఈ చికిత్సలు దీర్ఘకాలికంగా కొనసాగుతూ.. తరచూ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు వంటి అవసరాలు ఉంటాయి. ఇలాంటి వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని రూ.1 కోటి వరకు ఆరోగ్య రక్షణను ఎంచుకునేవారు లేకపోలేరు. బీమా హామీతో పాటు ప్రీమియం కూడా పెరుగుతున్నది మనకు తెలిసిన విషయమే. అయితే, రిస్క్‌ ప్రొఫైల్‌ కలిగినవారు భరించగలిగితే ఎక్కువ బీమా మొత్తాన్ని ఎంచుకోవడం మంచిదే.

రూ.1 కోటి ఆరోగ్య బీమా పాలసీకి (35 సంవత్సరాల గల వ్యక్తికి) వివిధ బీమా సంస్థల ప్రీమియంలు కింది పట్టికలో చూద్దాం..

ఎక్కువ బీమా ఉంటే.. అన్నీ కవర్‌ అవుతాయా?

ఎక్కువ బీమా తీసుకుంటే అన్ని కవర్‌ అయిపోతాయని అనుకోవడానికి లేదు. ఆరోగ్య బీమా ఎంచుకునే ముందు పాలసీ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఏయే వ్యాధులకు ఎంత వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుందనేది చూడాలి. కొన్ని పాలసీలలో ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉండదు. బీమా తీసుకునేటప్పుడు ఇటువంటి కవరేజీ లేని వ్యాధులు.. తక్కువ స్థాయిలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆసుపత్రిలో గది అద్దె స్థాయి క్యాపింగ్‌, మినహాయింపులు, సహ-చెల్లింపు నిబంధనలు మొదలైన వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.

చివరిగా: మినహాయింపులు లేకుండా కవరేజీ పూర్తి స్థాయిలో ఉండడానికి పాలసీ తీసుకునేటప్పుడే వివిధ యాడ్‌-ఆన్/రైడర్స్‌ తీసుకుంటే ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. రూ.20-25 లక్షల ఆరోగ్య బీమా తీసుకుని, మిగిలిన మొత్తానికి సూపర్‌ టాప్‌-అప్‌ను ఎంచుకోవడం ద్వారా కూడా బీమా ప్రీమియంను తగ్గించుకోవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని