బంధువుల నుంచి రుణాలు తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన నియమాలు

మొత్తం రూ. 20,000 కంటే ఎక్కువ రుణాన్ని నగదు రూపంలో లేదా బేరర్ చెక్ ద్వారా ఇవ్వకూడదు

Updated : 23 Jan 2022 18:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు స్నేహితులు, బంధువుల నుంచి డబ్బు తీసుకోవడం సాధార‌ణ‌మే. కొవిడ్ -19 సంక్షోభం కార‌ణంగా ఆదాయాలు కోల్పోవ‌డంతో చాలామంది సహాయం కోసం వారి బంధువులు లేదా స్నేహితుల వైపు చూసే ప‌రిస్థితి ఎదురైంది. అయినప్పటికీ, ఇది వ్యక్తిగత లావాదేవీ అయినందున ఎటువంటి నియ‌మాలు ఉండ‌వ‌ని భావించవద్దు. బంధువు/స్నేహితుడి వ‌ద్ద‌ రుణాలు తీసుకోవడం లేదా రుణాలు ఇవ్వడం పన్ను విధించదగిన లావాదేవీ కానప్పటికీ, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి.

బదిలీ విధానం
బంధువు/స్నేహితుడికి ₹20,000 కంటే ఎక్కువ రుణం ఇవ్వాలనుకుంటే చెక్‌, బ్యాంక్ డ్రాఫ్ట్, బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్‌లైన్ బ‌దిలీ విధానాన్ని ఎంచుకోవడం మంచిది. ₹20,000 కంటే ఎక్కువ ఉంటే రుణం నగదు రూపంలో లేదా బేరర్ చెక్ ద్వారా ఇవ్వకూడదు. రుణం తీసుకునేటప్పుడూ ఇదే విధానాన్ని ఎంచుకోవాలి.

రుణం తిరిగి చెల్లించే విషయంలో అదే నియమాలు వర్తిస్తాయి. ₹20,000 లేదా అంతకంటే ఎక్కువ రుణాన్ని చెక్, ఖాతా చెల్లింపుదారుడి డ్రాఫ్ట్, బ్యాంక్‌ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ వ్యవస్థను ఉపయోగించి,లేదా సెక్షన్ 269 టి ప్రకారం సూచించిన ఇతర ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా చేయాలి. ఈ నియ‌మాల‌ ఉల్లంఘన జ‌రిగితే పన్ను అధికారికి రుణం మొత్తంపై 100 శాతం జరిమానా విధించటానికి అధికారం ఉంటుంది.

వడ్డీ పన్ను పరిధి
రుణాలు ఇవ్వడం పన్ను విధించదగిన లావాదేవీ కానప్పటికీ, రుణ కార్యకలాపాల నుంచి సంపాదించిన వడ్డీకి పూర్తిగా పన్ను వ‌ర్తిస్తుంది. రుణగ్రహీత నుంచి (బంధువు అయినా) రుణదాత వసూలు చేసే వడ్డీ మొత్తం ఆదాయానికి కలిపి పన్నుకు వసూలు చేస్తారు. దీనిని ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు.

రుణగ్రహీతలు కూడా అలాంటి వడ్డీపై పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఒకవేళ మీరు ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం డబ్బు తీసుకున్నట్లయితే అసలు, వడ్డీ తిరిగి చెల్లించడంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. కానీ దానికి సంబంధించి ఆదాయ‌ పన్ను శాఖ ధ్రువీక‌ర‌ణ కోసం అన్ని ప‌త్రాల‌ను సిద్ధంగా ఉంచాలి. రుణ ఒప్పందం (బందువు నుంచి రుణం తీసుకున్నప్పటికీ మీకు ఒకటి ఉండాలి). వడ్డీ లెక్కలు, సంవత్సరంలో జ‌రిపిన లావాదేవీల‌ను చూపించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి ఉండాలి.

ఎన్ఆర్‌ఐ లావాదేవీలు
మీరు నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) నుంచి రుణాలు తీసుకుంటుంటే లేదా ఇస్తుంటే, ఇండియన్ ఎక్స్ఛేంజ్ కంట్రోల్ రెగ్యులేషన్స్‌కు  అనుగుణంగా ఉండాలి. 
భారతీయుడు రూపాయ‌ల్లో రుణాల‌ను ఎన్ఆర్‌ఐల నుంచి లేదా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నుంచి మాత్రమే స్వీకరించగలడు, విదేశీ పౌరుల నుంచి కాదు. రుణ కాలం మూడు సంవత్సరాలకు మించకూడదు.

ఇది కాకుండా, ఒక భారతీయ నివాసి తన దగ్గరి ప్రవాసుల నుంచి విదేశీ మారక రుణాలను కూడా తీసుకోవచ్చు. "అటువంటి రుణాల మొత్తం సంవత్సరానికి, 2,50,000 డాల‌ర్ల‌కు మించకూడదు, ఇది కనీసం ఒక సంవత్సర కాలంలో తీసుకోవాలి, దీనిపై వ‌డ్డీ ఉండ‌దు. భారతీయ నివాసి ఒక ఎన్నారై బంధువుకు కూడా రుణాలు ఇవ్వవచ్చు. ఈ రుణం వ‌డ్డీ లేకుండా ఒక సంవత్సరం కాలానికి మాత్రమే ఇవ్వబడుతుంది. రుణ మొత్తం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ పరిమితికి లోబ‌డి 250,000 డాల‌ర్లు ఉంటుంది.

చివ‌ర‌గా... మీరు బంధువు నుంచి రుణం తీసుకుంటే లేదా రుణాలు ఇస్తుంటే మీకు వర్తించే పన్ను నియమాలు లేవని అనుకోవ‌ద్దు. మీ శ్రద్ధ వహించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని