Rupee at All time low: జీవనకాల కనిష్ఠానికి రూపాయి.. కారణాలివే!

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో రూ.77.41 వద్ద జీవితకాల కనిష్ఠానికి చేరింది....

Updated : 09 May 2022 12:22 IST

దిల్లీ: డాలరు (Dollar)తో పోలిస్తే రూపాయి (Rupee) విలువ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో రూ.77.41 వద్ద జీవితకాల కనిష్ఠానికి చేరింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు (Fed Rate Hike), బాండ్ల రాబడులు పెరగడం డాలర్‌ (Dollar) బలపడడానికి కారణమయ్యాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Stock market) పతనం, ఇక్కడి ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల నిష్క్రమణ కూడా రూపాయి పతనాని (Rupee Fall)కి కారణమవుతున్నాయి. మధ్యాహ్నం 12:07 గంటల సమయంలో డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.77.37 వద్ద ట్రేడవుతోంది.

  1. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన కరెన్సీలను అమెరికా డాలర్‌ విలువతో పోల్చే డాలర్‌ సూచీ (Dollar Index) 103.98కు చేరింది. మరోవైపు 10 ఏళ్ల అమెరికా బాండ్ల ఈల్డులు 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 3.14 శాతానికి చేరాయి.
  2. కీలక వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్లు పెంచనున్నట్లు గతవారం ఫెడరల్‌ రిజర్వు ప్రకటించడంతో డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రానున్న రోజుల్లో వడ్డీరేటును మరింత పెంచనున్నట్లు ప్రకటించడం కూడా మరో కారణం.
  3. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే.. భారత్‌ వంటి వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడులను మదుపర్లు ఉపసంహరించుకుంటారు. ఇప్పటి వరకు విదేశీ సంస్థాగత మదుపర్లు 2022లో భారత మార్కెట్‌ నుంచి రూ.1.3 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. రూపాయి బలపడడం వల్ల రాబడి తగ్గడమే ఇందుకు కారణం.
  4. ద్రవ్యోల్బణ కట్టడి కోసం ఫెడ్‌కు అనుగుణంగా ఆర్‌బీఐ సైతం వడ్డీరేట్లు పెంచింది. ఈ నిర్ణయం మధ్యశ్రేణిలో రూపాయికి మద్దతునిచ్చేదే. కానీ, స్వల్పకాలంలో మాత్రం స్టాక్‌ మార్కెట్లు పతనమై ఆ ప్రభావం రూపాయిపై ఒత్తిడిని పెంచుతుంది.
  5. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఎగబాకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రూపాయి బలహీనంగా చలిస్తోంది. భారత్‌ తన అవసరాల్లో 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో దిగుమతుల బిల్లు పెరిగి ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది.
  6. రూపాయి పతనాన్ని అరికట్టేలా ఆర్‌బీఐ త్వరలో చర్యలు చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విదేశీ మారక నిల్వల్లోని కొన్ని డాలర్లను విక్రయించే మార్గాన్ని పరిశీలించొచ్చని చెబుతున్నారు. కేంద్రం వద్ద ఉన్న దాదాపు 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వల నుంచి ఇప్పటికే రూపాయికి మద్దతుగా కొన్ని డాలర్లను విక్రయించినట్లు సమాచారం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని