Rupee Value: రూపాయికి ‘వడ్డీ’ భయం.. జీవితకాల కనిష్ఠానికి మారకం విలువ!

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో రూపాయి విలువ ఈరోజు జీవితకాల కనిష్ఠానికి పతనమైంది....

Updated : 22 Sep 2022 16:43 IST

ముంబయి: అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో రూపాయి విలువ ఈరోజు జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులు రూపాయిపై ఒత్తిడిని మరింత తీవ్రం చేశాయి. ఈరోజు ఓ దశలో దాదాపు 1.24 శాతం మేర నష్టపోయి డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ.80.91 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 90 పైసలు కుంగి రూ.80.86 వద్ద స్థిరపడింది. రూపాయికి ఇప్పటి వరకు ఇదే రికార్డు ముగింపు.

అమెరికాలో వడ్డీరేట్ల పెంపుతో డాలర్‌ బలపడడం, ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు, చమురు ధరలు స్తబ్ధుగా ఉండడం.. రూపాయిపై ప్రభావం చూపుతున్నాయని ఫారెక్స్‌ ట్రేడర్లు చెబుతున్నారు. ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను మరో 75 పాయింట్లు పెంచుతున్నట్లు ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం ప్రకటించారు. దీంతో అక్కడ వడ్డీరేట్లు 3.25 శాతానికి చేరాయి. ఈ సందర్భంగా పావెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మున్ముందు రేట్ల పెంపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఫలితంగా ఆర్థికమాంద్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

సాధారణంగా యూఎస్‌లో వడ్డీరేట్లు పెరిగితే.. దేశీయ మార్కెట్ల నుంచి మదుపర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు. అధిక రాబడి కోసం వాటిని అమెరికాకు తరలిస్తారు. ఫలితంగా డాలర్‌కు డిమాండ్‌ పెరిగి బలపడుతుంది. ఇది రూపాయిపై ఒత్తిడికి దారి తీస్తుంది.

రూపాయి క్షీణత వల్ల లాభనష్టాలు..

రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి వాటిల్లోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే డాలర్ల  కోసం ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ విలువ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై కూడా భారం పెరుగుతుంది. 

తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు కరెన్సీ విలువ క్షీణత వల్ల లబ్ధి పొందుతాయి. ముఖ్యంగా భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి కాబట్టి రూపాయి క్షీణత వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలు లాభపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని