Ukraine crisis: రష్యా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అంటరానిది: అమెరికా

ఉక్రెయిన్‌పై దాడికి ఫలితంగా రష్యా ప్రపంచ చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షల్ని ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.....

Updated : 09 Mar 2022 11:32 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై దాడికి ఫలితంగా రష్యా ప్రపంచ చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షల్ని ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. మాస్కోపై ఆంక్షల్ని విధించడంలో ప్రపంచ దేశాలు తమతో కలిసి నడిచాయన్నారు. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు.

‘‘ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయింది. ఆ దేశ కరెన్సీ రూబుల్‌ విలువ 50 శాతానికి పైగా పతనమైంది. ఇప్పుడది ఒక పెన్నీ విలువ కూడా చేయదు. రష్యాలోని పెద్ద బ్యాంకులన్నింటినీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి బహిష్కరించాం. దీంతో ఇతర దేశాలతో వ్యాపారం చేసే సామర్థ్యాన్ని రష్యా కోల్పోయింది’’ అని బైడెన్‌ శ్వేతసౌధంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంగళవారం వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగానే బైడెన్‌ రష్యా నుంచి గ్యాస్‌, ముడి చమురు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఐరోపా మిత్ర దేశాలు ఈ విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవన్నారు. వాటి పరిస్థితులను తాము అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటూ నిధులు అందిస్తామని బైడెన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక, భద్రత, మానవతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. చమురు దిగుమతులపై నిషేధం విధించడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు.

రష్యాపై ఆంక్షలు విధించే విషయంలో ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ‘అంటరానిది’గా మారిందని బైడెన్ పాలక వర్గంలోని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగం వాటా కలిగిన దాదాపు 30 దేశాలు ఇప్పుడు మాస్కోపై ఆంక్షలు విధించాయన్నారు. తమ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థయేగాక రానున్న రోజుల్లో రష్యన్‌ సైనిక వ్యవస్థ సైతం బలహీనంగా మారుతుందని పేర్కొన్నారు.

ఆధునిక టెక్నాలజీ, సెమీకండక్టర్ల వంటి ఉత్పత్తులు కూడా రష్యాకు అందుబాటులో లేకుండా చేస్తామని బైడెన్‌ తెలిపారు. ఫలితంగా రష్యన్‌ మిలిటరీ బలహీనంగా మారుతుందన్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు రష్యా నుంచి వైదొలుగుతున్నాయన్నారు. గతవారం వీసా, మాస్టర్‌కార్డ్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తమ కార్యకలాపాల్ని మూసివేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ జాబితాలో మరిన్ని కంపెనీలు చేరుతున్నాయన్నారు. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు రష్యన్‌ సెక్యూరిటీల ట్రేడింగ్‌ను నిలిపివేశాయన్నారు. యుద్ధానికి వెళ్లాలన్న రష్యా దుర్బుద్ధిని ప్రైవేటు రంగం సైతం వ్యతిరేకిస్తోందన్నారు. ఐరోపా దేశాలతో కలిసి రష్యా నాయకుల విలాస భవంతులు, ప్రైవేటు జెట్లు సహా ఇతర ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు పనిచేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని