Electric scooter: ఈవీల కొనుగోలుకు జంకుతున్న జనం.. సర్వేలో ఆసక్తికర విషయాలు!

Electric vehicles: ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు సంబంధించి ప్రముఖ ఆన్‌లైన్‌ వేదిక లోకల్‌ సర్కిల్స్‌ ఓ సర్వే నిర్వహించింది. అత్యధికంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల భద్రత, పనితీరుపై అపనమ్మకంతో ఉన్నారని తేలింది. 

Published : 22 Aug 2022 19:46 IST

ముంబయి: పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలతో పోలిస్తే విద్యుత్‌ వాహనాలు నడిపేందుకు అయ్యే ఖర్చు తక్కువ. పైగా ప్రభుత్వం ప్రకటించిన రాయితీ పథకం వల్ల వీటి ధరలూ దిగొచ్చాయి. మైలేజీ, ధర.. ఇలా ఎందులో చూసినా ఈవీలే బెటర్‌గా కనిపిస్తాయి. ఆ లెక్కన ఈ పాటికే జనాలు పెట్రోల్‌తో నడిచే వాహనాలు కొనడం మానేసి.. ఈవీల కోసం పోటెత్తాలి. కానీ, అలా జరగడం లేదు. వాహనదారులను కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. క్రమంగా తగ్గాల్సిన ఆ భయాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు సంబంధించి ప్రముఖ ఆన్‌లైన్‌ వేదిక లోకల్‌ సర్కిల్స్‌ ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 292 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 11 వేలమంది పాల్గొన్నారు. టైర్‌-1, టైర్‌-2 నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణులు సైతం ఇందులో పాల్గొన్నారు. ఇందులో అత్యధికంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల భద్రత, పనితీరుపై అపనమ్మకంతో ఉన్నారని తేలింది. సుమారు 32 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. గతేడాది ఇదే సమయంలో 2 శాతంగా ఉన్న ఈ భయాలు.. ప్రస్తుత ఏడాదిలో 30 శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

దేశవ్యాప్తంగా ఈవీల అమ్మకాలు ఊపందుకున్నప్పటికీ.. ఎక్కడో ఏదో వాహనం తగలబడినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో వినియోగదారుల్లో భయం నెలకొంది. ఒక్క మార్చి - ఏప్రిల్‌ నెలలోనే దాదాపు రెండు డజన్ల వాహనాలు మంటల్లో కాలిపోవడంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. దీంతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే లోకల్‌ సర్కిల్స్‌ ఈవీల గురించి ఓ సర్వే నిర్వహించింది.

రాబోయే 6 నెలల్లో మీరు గానీ, మీ కుటుంబ సభ్యులు గానీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అని సర్వే ఆరా తీసింది. ఈ క్రమంలోనే 32 శాతం మంది ఎలక్ట్రిక్‌ స్కూటర్ల భద్రత, పనితీరు పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. మరో 5 శాతం మంది కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా.. తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని కారణంగా వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు. కొనడానికి తమ వద్ద డబ్బుల్లేవని 7 శాతం మంది తెలిపారు. ఈవీలు ఒక ప్యాషన్‌ అని.. కొద్ది రోజుల్లో ఆ బుడగ పేలిపోతుందని 2 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈవీలు నడపని కారణంగా వాటిపై ఆసక్తి లేదని 31 శాతం మంది తెలిపారు. ఇప్పటికే తగినన్ని టూ వీలర్లు ఉన్నాయని, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనే ప్రణాళికేదీ లేదని చెప్పారు. మొత్తం సర్వేలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే రాబోయే ఆరు నెలల్లో విద్యుత్‌ స్కూటర్‌ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ పరిస్థితిపై సర్వే నివేదిక స్పందిస్తూ.. వినియోగదారుల్లో విశ్వాసం నింపాల్సిన అవసరం కంపెనీలపైనా, ప్రభుత్వం పైనా ఉందని అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని