Updated : 07 Jul 2022 14:56 IST

Salary protection plan: శాల‌రీ ప్రొట‌క్ష‌న్ ప్లాన్ గురించి తెలుసా? ఎవరు తీసుకోవచ్చు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వ్య‌క్తి ఉద్యోగం చేస్తూ డ‌బ్బు సంపాదిస్తున్నాడు అంటే.. అది కేవ‌లం త‌న ఒక్క‌డి కోసం మాత్ర‌మే కాదు. భార్య‌, పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు.. ఇలా మొత్తం కుటుంబం కోసం కూడా. వారికి ఇచ్చే ప్ర‌తిదీ ఉత్త‌మంగా ఉండాల‌ని కోరుకుంటారు. అందుకే క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తుంటారు. అయితే, అనుకోకుండా కుటుంబంలో సంపాదించే వ్య‌క్తికి ఏదైనా జ‌రిగితే.. ఒక్క‌సారిగా సంపాదన ఆగిపోతుంది. అప్పుడు కుటుంబ స‌భ్యుల భ‌విష్య‌త్తుపై అంధకారం నెలకొంటుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో స‌హాయ‌ప‌డేదే శాల‌రీ ప్రొట‌క్ష‌న్ ప్లాన్‌.

ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు బీమా సంస్థ‌లు శాల‌రీ ప్రొట‌క్ష‌న్ ప్లాన్‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఇది నిజానికి ఒక‌ ట‌ర్మ్ పాల‌సీ. అయితే హామీ మొత్తం.. ఏక మొత్తంగా అందించ‌డంతోపాటు క్ర‌మ‌మైన ఆదాయాన్ని కూడా ఇస్తుంది. అందువ‌ల్ల దీన్ని ఇన్‌కమ్‌ ప్రొట‌క్ష‌న్ ప్లాన్ అని కూడా అంటారు. అంతేకాకుండా నెల‌వారీగా అందించే ఆదాయం పాల‌సీదారుని ప్ర‌స్తుత జీతంతో ముడిప‌డి ఉంటుంది. ఈ ప్లాన్‌ని ఎంచుకున్న‌వారు.. హామీ మొత్తం ఏవిధంగా నామినీకి అందించాలో పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలోనే బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి. ఇక్క‌డ రెండు ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. 
1. హామీ మొత్తం రెండు భాగాలుగా అంటే.. ఏక‌మొత్తం, నెల‌వారీ ఆదాయంగా విభ‌జించవ‌చ్చు. ఈ విధానంలో దేనికి ఎంత మొత్తం కేటాయించాలో కూడా పాలసీదారుడే తెలియ‌జేయాలి.

2. మొత్తం హామీని క్ర‌మ‌మైన ఆదాయంగా (రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ పే అవుట్ ఆప్ష‌న్‌తో) చెల్లించేలా ట‌ర్మ్ పాల‌సీని ఎంచుకోవ‌చ్చు.

కొనుగోలుదారులు ఇక్కడ ఒక ముఖ్య విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ముందే చెప్పుకున్న‌ట్లుగా ఇది ఒక ట‌ర్మ్ పాల‌సీ. అందువ‌ల్ల పాల‌సీదారునికి ఎటువంటి మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాలూ అంద‌వు. పాల‌సీదారుడు, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణిస్తే.. హామీ మొత్తం పాలసీలో ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం నామినీకి అందజేస్తారు.

పాలసీ ఏవిధంగా ప‌నిచేస్తుంది? 

  • శాల‌రీ ఇన్సూరెన్స్ లేదా ఇన్‌క‌మ్ ప్రొట‌క్ష‌న్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన పాల‌సీదారుడు.. కుటుంబ స‌భ్యులకు నెల‌వారీ ఆదాయంగా ఎంత మొత్తాన్ని అందించాల‌నుకుంటున్నారో తెలియ‌జేయాలి. అయితే ఇది ప్ర‌స్తుతం పాల‌సీదారుడు అందుకుంటున్న‌ టేక్ హోమ్ శాల‌రీకి స‌మానంగా గానీ అంత‌కంటే త‌క్కువ‌గా గానీ ఉండాలి.
  • ఆ త‌ర్వాత పాల‌సీ, ప్రీమియం చెల్లింపుల కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణకు.. 30 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న‌ (ధూమ‌పానం అల‌వాటు లేని వ్య‌క్తి) 10 నుంచి 30 ఏళ్ల వ్య‌వ‌ధితో పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు.
  • ప్రీమియంను బీమా సంస్థ నిర్ణ‌యిస్తుంది. పాల‌సీదారుని వ‌య‌సు, ఎంచుకున్న పాల‌సీ, హామీ మొత్తం త‌దిత‌ర అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది.
  • నెలవారీ ఆదాయంలో ఎంత శాతం పెంపుదల ఉండాలనేది కూడా బీమా సంస్థే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బీమా సంస్థ ఈ ఆదాయంపై వార్షికంగా 5 నుంచి 6 శాతం పెరుగుదలను అందించవచ్చు. ఇది బీమా సంస్థ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అంటే ప్రతి పాలసీ ఈ ఏడాది నెలవారీ ఆదాయం, మునుపటి ఏడాది నెలవారీ ఆదాయంలో 106 శాతం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి, మీరు నెల‌వారీ ఆదాయంగా రూ. 50 వేలు ఎంచుకున్నార‌నుకుందాం. పాల‌సీ తీసుకున్న రెండో సంవ‌త్స‌రం ఈ నెల‌వారీ ఆదాయం రూ. 53 వేల (6 శాతం పెరుగుద‌ల చొప్పున )కు చేరుతుంది. ఆ త‌ర్వాతి సంవ‌త్స‌రం రూ.56,180గా ఉంటుంది.
  • ఒక‌వేళ పాల‌సీదారుడు పాల‌సీ తీసుకున్న ఆరో సంవ‌త్స‌రం మొద‌ట్లో అనుకోకుండా మ‌ర‌ణిస్తే, నామినీకి అస్యూర్డ్ డెత్ బెనిఫిట్ (12*ఇంక్రీజ్డ్‌ మంత్లీ ఇన్‌క‌మ్ = 12*66,911) దాదాపు రూ.8 ల‌క్ష‌లు, నెల‌వారీ ఆదాయం రూ.66,911 (ఇంక్రీజ్డ్‌ మంత్లీ ఇన్‌క‌మ్‌) వ‌ర‌కు అందుతుంది. బీమా సంస్థ నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అస్యూర్డ్ డెత్ బెనిఫిట్‌లో మార్పులు ఉండొచ్చు.

ఎందుకు తీసుకోవాలి?
1.
ఆధారిత కుంటుంబ స‌భ్యులు ఉంటే.. వారి సంర‌క్ష‌ణ‌, భ‌విష్య‌త్తు కోసం ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం అవ‌స‌రం. దీంట్లో హామీ మొత్తం ఒకసారి మాత్ర‌మే కాకుండా నెల‌వారీగా అందజేసే వీలుంది కాబ‌ట్టి మీరు లేన‌ప్పుడు కూడా కొన్ని సంవ‌త్స‌రాల పాటు వారి అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ఇది స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా పిల్ల‌ల ఉన్న‌త చ‌దువులు, వివాహం వంటి ముఖ్య స‌మ‌యాల్లో ఈ మొత్తం ఉప‌యోగ‌ప‌డుతుంది.

2. ఏక‌మొత్తంలో డ‌బ్బు చేతికి అందిన‌ప్పుడు.. ఆధారిత కుటుంబ సభ్యుల‌కు డ‌బ్బు నిర్వ‌హ‌ణ భారం కావ‌చ్చు. స‌రిగ్గా వినియోగించ‌క‌పోతే.. ఎంత పెద్ద మొత్తం అందిన‌ప్ప‌టికీ.. ఆ మొత్తం అన‌తి కాలంలోనే ఖ‌ర్చ‌వుతుంది. దీంతో ఆ త‌ర్వాతి జీవ‌నం క‌ష్ట‌మ‌వుతుంది. కాబ‌ట్టి ఈ పాల‌సీని ఎంచుకోవ‌డం ద్వారా కొంత స్థిర మొత్తాన్ని ఒకేసారి అందించినా, నెల‌వారీగా కూడా ఆదాయం వ‌స్తుంది కాబ‌ట్టి ఖ‌ర్చుల విష‌యంలో రాజీ ప‌డాల్సిన ప‌ని ఉండదు. మీరు ఉన్న‌ప్పుడు ఏవైతే ప్ర‌మాణాల‌తో జీవించారో అదేవిధంగా మీరు లేన‌ప్పుడు జీవించ‌గులుగుతారు.

3. ఏక మొత్తంగా కొంత డ‌బ్బు చేతికందుతుంది కాబ‌ట్టి ఆ మొత్తంతో ఇంటి రుణాలు వంటివి ఏమైనా ఉంటే సుల‌భంగా చెల్లించ‌వ‌చ్చు.

4. శాల‌రీ ప్రొట‌క్ష‌న్ ప్లాన్ ద్ర‌వ్యోల్బ‌ణంతో కూడా పోరాడుతుంది. ఏక మొత్తంగా డ‌బ్బు చేతికందిన‌ప్పుడు పెట్టుబ‌డుల కోసం స‌రైన మార్గాన్ని ఎంచుకోక‌పోతే.. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డి ఇవ్వ‌లేక‌పోవ‌చ్చు. ఒక్కోసారి అస‌లు మొత్తం కూడా రిస్క్‌లో ప‌డొచ్చు. ఆ భ‌యం లేకుండా స్థిర శాతాన్ని ప్ర‌తి సంవ‌త్స‌రం పెంచుతూ వ‌స్తుంది. దీంతో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగినా ఇబ్బంది ఉండ‌దు.

చివ‌రిగా: సంపాదించే లేదా ఆధారిత కుటుంబ స‌భ్యులు ఉన్న‌ ప్ర‌తి వ్య‌క్తికీ ట‌ర్మ్ పాల‌సీ త‌ప్ప‌కుండా ఉండాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ట‌ర్మ్ పాల‌సీ తీసుకోని వారు, ఒక వేళ ట‌ర్మ్ పాల‌సీ ఉన్న హామీ మొత్తం స‌రిపోదు అనుకున్న‌వారు.. ఈ పాల‌సీని తీసుకోవ‌చ్చు. బీమా సంస్థ‌లు శాల‌రీ ప్రొట‌క్ష‌న్ ప్లాన్ పేరుతో ఇత‌ర పాల‌సీల‌ను కూడా విక్ర‌యించ‌వ‌చ్చు. అందువ‌ల్ల పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగి పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, నామినీ త‌ప్ప‌కుండా ఆర్థిక స‌ల‌హాదారుని సంప్ర‌దించి.. త‌మ అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా డ‌బ్బును వినియోగించేలా ఏర్పాటు చేయ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని