Productivity paranoia: సత్య నాదెళ్ల చెప్పిన కొత్త సమస్య.. ‘ప్రొడక్టివిటీ పారనోయా’

కరోనా సంక్షోభం మూలంగా కార్పొరేట్‌లో ఇంటి నుంచి పని విధానం తప్పనిసరైంది....

Updated : 23 Sep 2022 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సంక్షోభం మూలంగా కార్పొరేట్‌ ప్రపంచంలో ఇంటి నుంచి పని విధానం తప్పనిసరైంది. మహమ్మారి కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు ఇంటి దగ్గర, కొన్ని రోజులు కార్యాలయాలకు వెళ్లాలనే హైబ్రిడ్‌ వర్కింగ్‌ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ వెసులుబాట్లు సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతుండటంతో చాలా మంది ఉద్యోగులు ఈ విధానానికి అలవాటుపడ్డారు. పైగా తాము ఆఫీసుకు వెళ్లే కంటే ఇంటి దగ్గరే ఎక్కువ పనిచేస్తున్నామని 87 శాతం మంది ఉద్యోగులు చెబుతున్నారు. కానీ, 85 శాతం యాజమాన్యాలు మాత్రం తమ ఉద్యోగుల పనితీరు అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నాయి. ఈ విషయం టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ద్వారా వెలుగులోకి వచ్చింది.

తాము మెరుగ్గా పనిచేస్తున్నామని ఉద్యోగులు చెప్పడం.. లేదు వారి ఉత్పాదకత అంతంత మాత్రంగానే ఉందని యాజమాన్యాలు అనడం.. ఈ అంతరం వల్ల ఉద్యోగులపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన పరిస్థితి తలెత్తుతోందని కార్పొరేట్‌ వర్గాలు అంటున్నాయి. పనితీరు మెరుగ్గాలేని ఉద్యోగుల వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అంటున్నారు. ఈ పరిస్థితిని ఆయన ‘ప్రొడక్టివిటీ పారనోయా’గా అభివర్ణించారు. అంటే యాజమాన్యాల్లో నెలకొన్న ఈ ఆందోళనను ఆయన ‘ఉత్పాదకత భయం’గా పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో వచ్చిన కొత్త పని విధానంలో అధిగమించాల్సిన అతిపెద్ద సవాల్‌ ఇదేనని నాదెళ్ల అన్నారు.

కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల్లో, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను మైక్రోసాఫ్ట్‌ సర్వే చేస్తూ వస్తోంది. ఏడాదిలో పలుసార్లు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఫలితంగా కొత్త పోకడలకు అనుగుణంగా తమ సాంకేతికతను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా పలుసార్లు చేసిన సర్వేలో ఉద్యోగులు, యాజమాన్యాల మధ్య అంతరం ఉన్నట్లు స్పష్టమైంది. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ వైవా వంటి కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల కంపెనీలో నాయకత్వ హోదాలో ఉన్న వారు వారి కిందిస్థాయి ఉద్యోగులతో దగ్గరగా మాట్లాడేందుకు అవకాశం ఏర్పడింది. అయితే.. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి వారిపై నిఘా ఉంచడం సమంజసం కాదని మైక్రోసాఫ్ట్‌ అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని